నాడి పట్టేవారేరీ?

ABN , First Publish Date - 2021-09-18T06:20:14+05:30 IST

బోధన్‌లోని జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

నాడి పట్టేవారేరీ?

బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా వేధిస్తున్న వైద్యుల కొరత

గైనకాలజిస్టులు లేక ప్రసూతి సేవలు అంతంతమాత్రమే

ఐదుగురు గైనకాలజిస్టులకు గాను విధులు నిర్వహిస్తున్నది ఒక్కరే!

బోధన్‌ రూరల్‌, సెప్టెంబరు 17: బోధన్‌లోని జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సీజనల్‌ వ్యాధులతో ప్రతీరోజు 200 మందికిపైగా రోగులు వైద్య సేవలకు వస్తున్నారు. కాగా.. ఇందులో 40 నుంచి 50 మంది రోగులు వివిధ కారణాల చేత ఆసుపత్రిలో చేరుతున్నారు. సీజనల్‌ వ్యాధులైన చికెన్‌ గున్యా, డెంగ్యూ, వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆసుపత్రికి రోగులు అధికంగా వస్తున్నారు. వందల సంఖ్యలో రోగులు వస్తున్నా వారికి చికిత్స అందించేందుకు సరిపడా వైద్యులు లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఆసుపత్రిలో 30మందికిపైగా వైద్యులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 16 మంది మాత్రమే వైద్యులు పని చేస్తున్నారు. కొంతమంది వైద్యులు మాత్రమే ఉండడంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఆసుపత్రిలో ప్రసూతి, అత్యవసర సేవలు అందించేందుకు సరిపడా వైద్యులు లేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

అందని ప్రసూతి సేవలు 

బోధన్‌లోని జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో గర్భిణులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆసుపత్రికి కాన్పు కోసం వచ్చే గర్భిణుల సంఖ్య అధికంగా ఉంటుంది. బోధన్‌ డివిజన్‌లోని ఎడపల్లి, రెంజల్‌, నవీపేట, వర్ని, కోటగిరి, రుద్రూరు, మోస్రా, చందూరు, బోధన్‌ పట్టణం, మండలంలోని వివిధ గ్రామాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో కాన్పుకోసం గర్భిణులుఃవస్తుంటారు. కానీ, ఆసుపత్రిలో సివిల్‌ సర్జన్‌, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌, ముగ్గురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు విధులు నిర్వహించాల్సి ఉండగా.. ప్రస్తుతం డాక్టర్‌ భానుప్రియ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రసూతి సేవలు అందరికీఅందించడం సాధ్యం కావడం లేదు. ఒకే ఒక్క గైనకాలజీ వైద్యురాలు విధులు నిర్వహించడం, సాధారణ కాన్పులు, ఆపరేషన్లు చేయడం కష్టంగా మారుతోంది. ఇదివరకు ముగ్గురు గై నకాలజీ వైద్యులు ఉండగా.. నెలకు 300లకుపైగా కాన్పులు చేసేవారు. కానీ, ప్రస్తుతం ఒకే వైద్యురాలు ఉండడంతో గత నెలలో 142 ప్రసవాలు మాత్రమే జరిగాయి. ముగ్గురు మత్తుమందు వైద్యులు ఉన్నా.. గైనకాలాజిస్టులు లేకపోవడంతో ప్రసవాలు చేయడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో ఎక్కువ మందిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి కాన్పుల కోసం పంపిస్తున్నారని గర్భిణులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

వైద్యుల బదిలీతో ఇబ్బందులు

 బోధన్‌లోని జిల్లా ఆసుపత్రిలో ఇద్దరు కీలక వైద్యులు బదిలీ అయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన డాక్టర్‌ అన్నపూర్ణ, అనస్తీషియా వైద్యురాలు డాక్టర్‌ శారదదేవి బదిలీ అయ్యారు. ఈ ఇద్దరి బదిలీతో ఆసుపత్రిలో సేవలపై ప్రభావం పడింది. బోధన్‌ ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మార్చిన తర్వాత సేవలు మెరుగుపడుతూ వచ్చాయి. దీంతో బోధన్‌తో పాటు పరిసర మండలాలైన కోటగిరి, వర్ని, రుద్రూరు, మోస్రా, చందూరు, ఎడపల్లి, రెంజల్‌ మండలాల నుంచి గర్భిణులు, ఇతర సేవల కోసం అంతా వచ్చి బోధన్‌లోని జిల్లా ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందుతున్నారు. కానీ, ఇద్దరు వైద్యుల బదిలీతో బోధన్‌ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలపై ప్రభావం పడింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అన్నపూర్ణ డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా కొనసాగుతుండగా ఆమెకు సివిల్‌ సర్జన్‌గా పదోన్నతి రావడంతో పాటు గజ్వేల్‌ జిల్లా ఆసుపత్రికి బదిలీ అయ్యారు. మత్తుమందు వైద్యురాలు డాక్టర్‌ శారద దేవి డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా బోధన్‌ జిల్లా ఆసుపత్రిలో కొనసా గుతుండగా ఆమెకు సైతం సివిల్‌ సర్జన్‌గా పదోన్నతి రావడంతో పాటు మిర్యా లగూడ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.

పని భారం పెరుగుతోంది..

-డాక్టర్‌ భానుప్రియ, గైనకాలజిస్టు

బోధన్‌లోని జిల్లా ఆసుపత్రిలో ఐదుగురు గైనకాలాజిస్టులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం నేను మాత్రమే పని చేస్తున్నాను. దీంతో పనిభారం పెరుగుతోంది. నిత్యం అధిక సంఖ్యలో వచ్చే గర్భిణులకు కాన్పులు చేస్తున్నాం. అయినా కష్టంగా మారుతోంది. రాత్రి, పగలు విధులు నిర్వహించడం ఇబ్బందిగా ఉన్నప్పటికీ సేవలు అందిస్తున్నాం. 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

-ఆశిష్‌ రాండర్‌, సూపరింటెండెంట్‌

బోధన్‌లోని జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత అంశాన్ని కలెక్టర్‌తో పాటు శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీలను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-09-18T06:20:14+05:30 IST