నిండుకున్న కరోనా టీకాలు

ABN , First Publish Date - 2021-04-11T05:21:27+05:30 IST

సెకెండ్‌ వేవ్‌ భయపెడుతోంది. వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ తీవ్రత కూడా ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిండుకున్న కరోనా టీకాలు

  1. నిలిచిపోయిన వ్యాక్సిన్‌ సరఫరా
  2. ఉన్నది 26 వేల డోసులే
  3. నేటి నుంచి టీకా పండుగ
  4. వైద్య ఆరోగ్యశాఖలో ఆందోళన
  5. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో 25.5 శాతం వృథా


కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 10: సెకెండ్‌ వేవ్‌ భయపెడుతోంది. వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ తీవ్రత కూడా ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ వ్యాక్సిన్‌ పట్ల పెద్దగా ఆసక్తి చూపనివారు కూడా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం టీకా పండుగ పేరిట ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తోంది. అంతా బాగానే ఉంది..! కానీ.. ఈ టీకా పండుగకు కావాల్సినన్ని డోసులు జిల్లాలో అందుబాటులో లేవు. సరఫరా కూడా నిలిచిపోయింది. మరోవైపు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో 25 శాతానికి పైగా టీకాను వృథా చేశారు. జిల్లాలో తొలి డోసుకే కొరత వచ్చేలా కనిపిస్తోంది. మరి రెండో డోసు మాటేమిటి..? కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఉత్పన్నమౌతున్న సందేహాలు ఇవి.


పెరుగుతున్న బాధితులు

కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ప్రభావం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. గడచిన 10 రోజుల్లో  1,283 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటిం చడం ద్వారా వైరస్‌ బారిన పడకుండా కాపాడు కోవచ్చని పదే పదే చెబుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా నిర్వహించడానికి జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. కానీ తగినన్ని టీకా డోసులు జిల్లాకు అందడం లేదు. వ్యాక్సిన్‌ కొరత ఏర్పడితే ఏంచేయాలోనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన చెందుతు న్నారు. మొదటి డోస్‌ వేయించుకున్న వారికి రెండో డోస్‌ అందుతుందో లేదో తెలియడం లేదు. కానీ ఈ విషయమై వైద్యాధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ప్రస్తుతం జిల్లా ఇమ్యూనైజేషన్‌ కేంద్రంలో 26 వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో నాలుగు రోజులకు మాత్రమే సరిపోతాయి. ఎక్కడైనా మిగులు ఉన్నాయోమోనని అధికారులు వెతుకుతున్నారు. 


ప్రతిరోజూ 10 వేల మందికి..

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి వార్డు సచివాలయాల్లో టీకాలు వేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున జనం ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకా వేస్తున్నారు. 15 రోజుల క్రితం వరకూ టీకా వేయించుకోవడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూప లేదు. రోజుకు 500 నుంచి 2000 మంది మాత్రమే టీకాలు వేయించుకునేవారు. సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక ప్రతిరోజు 10 వేల నుంచి 14 వేల మంది టీకా వేయించుకుంటున్నారు. జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 22 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 18 సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు 52, నగర పాలక, పురపాలక సచివాలయల్లో టీకాలు వేస్తున్నారు.


ప్రైవేటుకు నిలిపివేత

జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు నాలుగు రోజుల నుంచి కొవాగ్జిన్‌ సరఫరా నిలిపేశారు. నెట్‌వర్క్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండు నెలలుగా రూ.250 తీసుకుని వ్యాక్సిన్‌ వేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి వ్యాక్సిన్‌ సరఫరా నిలిచిపోవడంతో జిల్లా స్టోరేజీ కేంద్రంలో నిల్వలు  అయిపోయాయి. దీంతో అధికారులు వ్యాక్సిన్‌ను ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫలితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. 


ఇదీ పరిస్థితి..

ఇప్పటి వరకు 3.9 లక్షల కొవిడ్‌ డోసులు జిల్లాకు వచ్చాయి. ఇందులో 2.59 లక్షల డోసులు వేశారు. కొవిషీల్డ్‌ 2.45 లక్షల డోసులు, కోవాగ్జిన్‌ 64,700 డోసులు వినియోగించారు. ఆరోగ్యశ్రీ ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా కొవిషీల్డ్‌ 2 శాతం, కోవాగ్జిన్‌ 25 శాతం టీకాలు వృథా అయ్యాయి. జిల్లాలో 52 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 5 ఆసుపత్రులు తప్ప మిగిలిన ప్రైవేటు ఆసుపత్రులు టీకా లక్ష్యాన్ని  చేరలేదు. 18 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కరికీ టీకా వేయలేదు. ప్రైవేటు ఆసుపత్రులకు అందించే ఒక వ్యాక్సిన్‌ వయల్‌లో 20 డోసులు ఉంటాయి. ఒకసారి ఓపెన్‌ చేస్తే 20 మందికి వ్యాక్సిన్‌ వేయాలి. కానీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కేవలం ముగ్గురు నలుగురికి మాత్రమే టీకా వేసేందుకు వయల్‌ తెరవడంతో మిగిలిన డోసులు వృథా అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వృథా 2 శాతం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.


ప్రైవేటులో 25.5 శాతం వృథా..

జిల్లాలో శుక్రవారం రాత్రికి 26 వేల డోసులు వ్యాక్సిన్‌ స్టాక్‌ ఉంది. ప్రతిరోజు 10 నుంచి 13 వేల మందికి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. నెట్‌వర్క్‌ ప్రైవేటు ఆసుపత్రులలో 25.5 శాతం డోసులు వృథా అయ్యాయి. ఒక్కో వయల్‌ నుంచి 20 మందికి టీకా వేయాల్సి ఉండగా,  కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం నలుగురు, ఐదుగురికి టీకా వేస్తూ వృథా చేస్తున్నారు. జిల్లాకు 5 లక్షల డోసుల వ్యాక్సిన్‌ కావాలని ఇండెంట్‌ పెట్టాం. ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు వ్యాక్సిన్‌ వస్తుంది. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  

- డాక్టర్‌ విశ్వేశ్వరరెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి


Updated Date - 2021-04-11T05:21:27+05:30 IST