కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత

ABN , First Publish Date - 2022-01-23T03:47:29+05:30 IST

జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరగడం లేదు. స్టాంప్‌ వెండర్ల వద్ద లభించే బాండ్‌ పేపర్లు గత నెల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. దీంతో వివిధ అవసరాల కోసం వచ్చిన వారు మంచిర్యాల, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత

- రూ.20బాండు పేపర్‌కు రూ.200

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు

- పట్టించుకోని అధికారులు

- భూముల క్రయ విక్రయాల కోసం తంటాలు

- పెండింగ్‌లో పడిపోతున్న పనులు

- ఇతర జిల్లాల నుంచి తెచ్చుకుంటున్న ప్రజలు 

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌టౌన్‌, జనవరి 22: జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరగడం లేదు. స్టాంప్‌ వెండర్ల వద్ద లభించే బాండ్‌ పేపర్లు గత నెల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. దీంతో వివిధ అవసరాల కోసం వచ్చిన వారు మంచిర్యాల, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి స్టాంప్‌ వెండ ర్లకు నేరుగా అందించే అవకాశాలున్నప్పటికీ అధికారుల అలసత్వం కారణంగా ఇంతవరకు అందలేదు. కులం, ఆస్తి ఇతర వాటి కోసం బాండ్‌ పేపర్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌తో పాటు పలు చోట్ల కొద్ది నెలలుగా బాండ్‌(స్టాంపు) పేపర్ల కొరత ఏర్పడింది. ఈ స్టాంపు పేపర్లను విద్యార్థులు ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, రైతులు రిజిస్ట్రేషన్‌, నోటరీ తదితర పనుల కోసం వినియోగిస్తుంటారు. బాండ్‌ పేపర్లు స్టాంపు వెండర్ల వద్ద లేకపోవడంతో జిల్లా కేంద్రానికి లేదంటే సమీపంలోని మంచిర్యాల, తదితర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. నిత్యం రూ.20, 50, 100 విలువ గల స్టాంపు పేపర్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటుంది. కానీ ఈ స్టాంపు పేపర్లు ఎక్కడా లభించడం లేదు. కేవలం రూ.20 విలువ గల స్టాంపు పేపర్‌ కోసం పక్క జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. దీంతో రూ.200 ఛార్జీలు పెట్టుకొని ఒక్కరోజు సమయం వృధా చేసుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొ న్నాయి. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్‌ శాఖ ఆధ్వ ర్యంలో స్టాంపు పేపర్లు ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి తెపించాల్సి ఉంటుంది. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు, కాగజ్‌నగర్‌ పట్టణంలో మొత్తం 24మందికి పైగా స్టాంపు అమ్మకందారులు ఉన్నారు. కానీ ఎక్కడా కూడా స్టాంపు పేపర్లు అందుబాటులో లేవు. కొన్నిచోట్ల అత్యవసరం అవుతున్న ఈ బాండ్‌ పేపర్స్‌కు రూ.20 విలువగల బాండ్‌ పేపర్‌కు రూ.200మేర చెల్లించేందుకు వినియోగదారులు వెనుకాడడం లేదు. అయినా అందుబాటులో లేవని స్టాంప్‌ వెండర్స్‌ సమాధానం చెప్పడంతో తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్టాంపు పేపర్లు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. 

చాలా ఇబ్బందులు పడుతున్నాం

- బోగె ఉపేందర్‌, రెబ్బెన

బాండ్‌ పేపర్లు గత నెల నుంచి దొరకడం లేదు. స్టాంప్‌ వెండర్ల దగ్గరికి వెళితే కొరత ఉందని చెప్పేస్తున్నారు. అత్యవసరం ఉండడంతో మంచిర్యాల, ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకున్నాం. ఇలా చేయడం వల్ల డబ్బుతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. అధికారులు స్పందించి బాండ్‌ పేపర్లను అందుబాటులోకి తేవాలి. 

జిల్లా కేంద్రంలోనే దొరకడం లేదు

-మోహన్‌, ఆసిఫాబాద్‌

జిల్లా కేంద్రంలోనే బాండ్‌ పేపర్లు దొరకడం లేదు. చాలా కష్టంగా ఉంది. చిన్నపాటి ఒప్పందం చేసుకుందామన్న బాండ్‌ పేపర్స్‌ అవసరం ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

Updated Date - 2022-01-23T03:47:29+05:30 IST