కావలి, గూడూరులలో షాపుల మూత

ABN , First Publish Date - 2021-04-21T05:02:00+05:30 IST

రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు

కావలి, గూడూరులలో షాపుల మూత
గూడూరు : గాంధీబొమ్మసెంటర్‌లో దుకాణాల మూతతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం

ఆత్మకూరులో నేటినుంచి.. 


కావలి, ఏప్రిల్‌ 20 : రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కావలి, గూడూరులలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా, ఆత్మకూరులో బుధవారం నుంచి అమలులోకి రానుంది. కావలిలో మంగళవారం సాయంత్రం పోలీసులు హడావుడి చేస్తూ దుకాణాలను మాయించారు. ఆర్డీవో జీ.శ్రీనివాసులు, డీఎస్పీ ప్రసాద్‌రావు, కమిషనర్‌ శివారెడ్డి వ్యాపారులతో నిర్ణయం తీసుకున్నారు. మెడికల్‌ దుకాణాలు తప్ప మిగిలిన అన్ని వ్యాపార సంస్థలు 30వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. ఆ మేరకు పట్టణంలో దండోరా చేయించారు. అయితే తొలిరోజైన మంగళవారం దుకాణాలు మూయించేందుకు పోలీస్‌ అధికారులు కసరత్తు చేపట్టారు. డీఎస్పీతోపాటు సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది సాయంత్రం 5 గంటలకే రోడ్డుపైకి వచ్చి తెరచి ఉన్న దుకాణాలను మూయించారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉంటే ట్రంకురోడ్డు నిర్మానుష్యంగా  మారింది. అయితే, మద్యం దుకాణాలు మాత్రం తెరిచే ఉండటంతో అదిచూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. 


గూడూరు రూరల్‌ : కరోనా కట్టడిలో గూడూరు పట్టణంలో మంగళవారం పాక్షిక లాకౌడౌన్‌ అమలు అయ్యింది. మున్సిపల్‌ కమిషనర్‌ వైవో.నందన్‌ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 2గంటలకే వాణిజ్య సముదాయాలు  మూసివేశారు. మధ్యాహ్నం నుంచి మున్సిపల్‌, సచివాయల సిబ్బంది పట్టణంలో తిరుగుతూ దుకాణాలు మూయించారు. కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. దీంతో రద్దీగా ఉండే కుమ్మరవీధి, రాజావీధి, గాంధీబొమ్మసెంటర్‌, బజారువీధి, ఆసుపత్రి రోడ్డు తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. మెడికల్‌, పాలు, ఆహారపదార్థాల దుకాణాలు మాత్రమే తెరిచివుంచారు. కాగా, సోమవారం ఉదయం నుంచి పట్టణంలో 150వరకు పాజిటివ్‌లు నమోదవగా, ఆరుగురు మృతి చెందారు. 


ఆత్మకూరు : పట్టణంలో బుధవారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు  మున్సిపల్‌ కమిషనర్‌ ఎం రమేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన వ్యాపారులు, పురప్రముఖులు, మున్సిపల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి మున్సిపల్‌ పరిధిలో ఉదయం 7 నుంచి  మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరుచుకోవచ్చని తెలిపారు. పాలు, మెడికల్‌ షాపులకు మాత్రమే అత్యవసర సేవల కింద అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. పట్టణ కొవిడ్‌ కమిటీ తీర్మానం మేరకు ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి ఉన్నందున తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా పేరుతో మాస్క్‌లను అధిక రేట్లకు విక్రయిస్తే చర్చలు తీసుకుంటామన్నారు. ప్రజలు స్వచ్ఛందగా చైతన్యవంతులై కరోనాను తరిమికొట్టేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. 


వెంకటాచలం : వెంకటాచలం పంచాయతీలో బుధవారం నుంచి ఐదురోజులపాటు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు దండోరా వేశారు. సర్పంచు మందల రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ రావు, ఇతర అధికారులు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చు. అత్యవసరం ఉంటే తప్ప ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకూడదు. 




Updated Date - 2021-04-21T05:02:00+05:30 IST