చదువుల గుడిలో నెత్తుటి తడి.. పసిప్రాణాలపై తూటాల వర్షం!

ABN , First Publish Date - 2022-05-26T14:34:02+05:30 IST

అది.. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రం యువాల్డేలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌! మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో.. ఒక ట్రక్కు ఆ స్కూలు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది! అందులోంచి విసురుగా దిగాడో 18 ఏళ్ల కుర్రాడు. బాడీ..

చదువుల గుడిలో నెత్తుటి తడి..  పసిప్రాణాలపై తూటాల వర్షం!

అమెరికా బడిలో 18 ఏళ్ల కుర్రాడి కాల్పులు

19 మంది చిన్నారులు.. ఇద్దరు టీచర్లు బలి

డజను మందికిపైగా చిన్నారులకు గాయాలు

పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఆస్పత్రిలో చికిత్స

హంతకుణ్ని మట్టుబెట్టిన సరిహద్దు పోలీసులు

పిల్లల మృతదేహాలు చూసి తల్లిదండ్రుల కన్నీరు

తీవ్ర భావోద్వేగానికి గురైన అమెరికా అధ్యక్షుడు


పద్దెనిమిదేళ్ల కుర్రాడు.. తుపాకులు చేతబట్టి.. పాఠశాల(School)లో నరమేధం సృష్టించాడు! తరగతి గది(Class room)లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. నాలుగో తరగతి చదువుతున్న 19 మంది చిన్నారులను, ఇద్దరు టీచర్లను బలిగొన్నాడు. స్కూలుకు రావడానికి ముందు.. ఇంట్లో తన నాయనమ్మపైనా కాల్పులు జరిపాడు! అమెరికా చరిత్రలోనే అత్యంత విషాద ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయే ఈ దారుణం.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11.32 గంటలకు టెక్సస్‌లోని యువాల్డే పట్టణంలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగింది.


హ్యూస్టన్‌: అది.. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రం యువాల్డేలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌! మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో.. ఒక ట్రక్కు ఆ స్కూలు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది! అందులోంచి విసురుగా దిగాడో 18 ఏళ్ల కుర్రాడు. బాడీ ఆర్మర్‌ ధరించి.. ఒక చేతిలో హ్యాండ్‌ గన్‌, మరో చేతిలో ఏఆర్‌-15 సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌ పట్టుకుని స్కూల్లోకి ప్రవేశించాడు. ఎదురుగా ఉన్న నాలుగో తరగతి గదిలోకి ప్రవేశించాడు. తలుపులు మూసేసి.. ‘‘మీరిప్పుడు చావబోతున్నారు’’ అంటూ విచక్షణరహితంగా కాల్పు లు ప్రారంభించాడు! అతడు ఎందుకు కాలుస్తున్నాడో.. తాము ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో.. 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు రక్తపుమడుగులో నేలకొరిగారు. ఆ దుర్మార్గుడు కాల్పులు జరుపుతుండగా.. అమెరీ జో గార్జా అనే పదేళ్ల చిన్నారి 911కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వబోయింది.


మరుక్షణమే అతడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. కాల్పుల గురించి సమాచారం అందగానే.. అక్కడికి సమీపంలో ఉన్న సరిహద్దు పోలీసులు (బోర్డర్‌ పెట్రోల్‌ టాక్టికల్‌ యూనిట్‌) స్కూలు వద్దకు చేరుకున్నారు. ఎదురుకాల్పులు జరిపి.. అంతమంది పిల్లల ప్రాణాలు బలిగొన్న హంతకుణ్ని మట్టుబెట్టారు. కాగా.. హంతకుణ్ని సాల్వడర్‌ రామోస్‌(18)గా గుర్తించినట్టు టెక్సస్‌ గవర్నర్‌ తెలిపారు. స్కూల్లో ఈ నరమేధం సృష్టించడానికి ముందు అతడు తన నాయనమ్మపై కాల్పులు జరిపాడని.. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు.


రెండ్రోజుల్లో సెలవులనగా...రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థులకు మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా నాలుగైదు రోజులుగా పిల్లలంతా సరదాగా గడుపుతున్నారు. మంగళవారంనాడు ‘ఫుట్‌లూజ్‌ అండ్‌ ఫ్యాన్సీ’ థీమ్‌ ఉండడంతో అంతా మంచి మంచి దుస్తులు ధరించి బడికొచ్చారు. స్కూల్లో కాల్పుల సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు.. విగతజీవులుగా పడి ఉన్న తమ బిడ్డలను చూసుకుని హృదయవిదారకంగా రోదించారు. రామోస్‌ కాల్పుల్లో 21 మంది చనిపోగా డజను మందికి పైగా తీవ్రగాయాలైనట్టు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రామోస్‌ ఈ దారుణానికి పాల్పడడానికి గల కారణాల గురించి అధికారులు ఏ సమాచారం ఇవ్వలేదు. అయితే, తనను డిగ్రీ చదివించకపోవడంపై రామోస్‌ తన నాయనమ్మతో పోట్లాట పెట్టుకున్నాడని.. ఆమెపై కాల్పులు జరిపి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడని, ఇంతలోనే ఇంతటి ఘోరానికి ఒడికడతాడని ఊహించలేదని పొరుగింటి వ్యక్తి తెలిపినట్టుగా స్థానిక మీడియా పేర్కొంటోంది. 2012లో కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో శాండీహుక్‌ ఎలిమెంటరీ స్కూల్లో ఆడమ్‌ లాంజా అనే దుండగుడు ఇలాగే కాల్పులు జరిపి 20 మంది చిన్నారులను, ఆరుగురు పెద్దలను బలిగొన్నాడు. ఆ తర్వాత మళ్లీ అంతటి ఘోరం ఇదే.


సోషల్‌ మీడియాలో ముందే చెప్పి మరీ..

తాను చేయబోయే ఈ ఘోరం గురించి రామోస్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ముందే హింట్‌ ఇచ్చాడు. ఫేస్‌బుక్‌లో ఈ మేరకు మూడు పోస్టులు పెట్టాడు. తాను కొనుగోలు చేసిన హ్యాండ్‌గన్‌, రైఫిల్‌ ఫొటోలను గతంలోనే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. టెక్సస్‌ గవర్నర్‌ అతడే ఈ కాల్పులకు పాల్పడినట్టు ప్రకటించాక ఇన్‌స్టాలో అతడి ఖాతాను తొలగించారు. రామోస్‌ హైస్కూల్‌ చదువు యువాల్డేలోనే సాగింది. అదే పట్టణంలోని వెండీస్‌ కంపెనీలో ఏడాదిపాటు పనిచేశాడు. నెలరోజుల క్రితమే అక్కడ ఉద్యోగం మానేశాడు. తమ వద్ద పనిచేసేటప్పుడు అతడు ఎవరితోనూ స్నేహంగా ఉండేవాడు కాదని వెండీస్‌ మేనేజర్‌ తెలపడం గమనార్హం. అతడితోపాటు పనిచేసిన కొందరు సహోద్యోగులు మాత్రం.. రామోస్‌ తన తోటి మహిళా ఉద్యోగులకు అనుచిత సందేశాలు పంపుతుండేవాడని తెలిపారు. కాగా.. స్కూల్లో చిన్నప్పటి నుంచీ తోటి పిల్లలు అతడి దుస్తుల విషయంలో హేళన చేస్తూ ఉండేవారని, అతడు ఒంటరితనంతో బాధపడుతుండేవాడని క్రమంగా హింసాత్మక ప్రవర్తనను అలవరచుకున్నాడని సమాచారం. చివరకు తన ముఖం మీద తానే చాకుతో గాట్లు పెట్టుకుని స్వీయహాని చేసుకునే దశకు చేరాడు. రామోస్‌ తల్లి మాదకద్రవ్యాలకు బానిస. ఇద్దరి మధ్య తరచూ గొడవలు అవుతుండేవి. ఆ రకంగా పోలీసులకు కూడా రామోస్‌ పరిచయమే. ఇలా పెరిగిన రామోస్‌ 5000 డాలర్లు దాచిపెట్టి తన 18వ పుట్టినరోజునాడు రెండు ఏఆర్‌-15 సెమీ ఆటోమేటిక్‌ రైఫిళ్లను కొనుగోలు చేశాడు. మంగళవారం.. తనకు పరిచయమైన ఒక అమ్మాయికి.. తాను చేయబోయే ఈ ఘోరం గురించి నర్మగర్భంగా చెప్పాడు. త న దగ్గర ఒక రహస్యం ఉందని.. దాని గురించి తర్వాత చెప్తానని మెసేజ్‌ చేశాడు. అతడు కొన్న రెండు రైఫిళ్ల లో ఒకటి.. అతడి శవంపక్కనే పడి ఉండగా, మరొక  రైఫిల్‌ను అతడు వేసుకొచ్చిన ట్రక్కులో గుర్తించారు.


తుపాకులపై చర్చ

ఈ ఘటనతో.. అమెరికాలో తుపాకుల నియంత్రణపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దుండగులను నిరోధించడానికి టీచర్ల వద్ద తుపాకులు ఉండాల్సిందేనని టెక్సస్‌ ఏజీ కెన్‌ పాక్స్‌టన్‌ వంటివారు అభిప్రాయపడగా.. అసలు తుపాకుల విక్రయంపై పూర్తిస్థాయిలో ని యంత్రణ విధించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. తుపాకులకు సంబంధించిన సంస్కరణల వల్ల ఇలాంటి నేరాలు ఆగకపోవచ్చని టెక్సస్‌ సెనెటర్‌ టెడ్‌ క్రుజ్‌ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను(తుపాకీ కలిగి ఉండే హక్కు) నిర్బంధించడం వల్ల ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. గన్‌ వయొలెన్స్‌ ఆర్కైవ్‌ స్వచ్ఛంద సంస్థ గణాంకాల ప్ర కారం.. ఈ ఏడాది ఇప్పటిదాకా 212 మాస్‌ షూ టింగ్స్‌ (కాల్పుల్లో నలుగురు అంతకంటే ఎక్కువ మంది మరణించిన ఘటనలు) జరిగాయి. 2020 లోనే అమెరికాలో 19,350 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019తో పోలిస్తే ఈ సంఖ్య 35% అధికం.


బాధాకరం..

టెక్సస్‌ స్కూల్లో కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ విచారం వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి గురైనట్టు కనిపించిన ఆయన.. ‘ఇది చర్యలు తీసుకోవాల్సిన సమయం’ అన్నారు. ‘ఏం చేస్తే వారికి అర్థమవుతుంది’ అని తోటి చట్ట సభ సభ్యులను ప్రశ్నించారు. అత్యంత శక్తిమంతమైన తుపాకీ తయారీదారులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తరగతి గదిలో తమ స్నేహితులు తూటాలకు బలవుతుంటే.. తోటిపిల్లలు ఆ మారణహోమాన్ని చూసి ఎంతటి భయభ్రాంతులకు గురై ఉంటారో అని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలను కోల్పోవడమంటే ఆత్మను కోల్పోయినట్టేనని బాధగా అన్నారు. ఈ బాధను చర్యగా మార్చాల్సిన అవసరం ఉందంటూ.. తుపాకుల నియంత్రణ చట్టంపై చట్టసభల సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇక నావల్ల కాదు. మనం చర్య తీసుకుని తీరాల్సిందే. తుపాకుల లాబీలను ఎదిరించి నిలిచే ధైర్యం మనకు లేదా’’ అని ప్రశ్నించారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు, టీచర్లకు నివాళిగా ఈ నెల 28 (శనివారం) సాయంత్రం దాకా జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచాలని బైడెన్‌ ఆదేశించారు. టెక్సస్‌ కాల్పులపై పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. వివేచన లేకుండా జరుపుతున్న ఆయుధాల వ్యాపారానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు.

















Updated Date - 2022-05-26T14:34:02+05:30 IST