సచిన్‌ను ఔట్ చేయగానే పెద్దగా అరిచాను.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను: అక్తర్

ABN , First Publish Date - 2020-08-02T21:44:11+05:30 IST

భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటేనే ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో చూస్తారు. అందులోనూ షోయబ్ అక్తర్‌ బౌలింగ్‌లో సచిన్ బ్యాటింగ్..

సచిన్‌ను ఔట్ చేయగానే పెద్దగా అరిచాను.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను: అక్తర్

ఇస్లామాబాద్: భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటేనే ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో చూస్తారు. అందులోనూ షోయబ్ అక్తర్‌ బౌలింగ్‌లో సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడంటే అదో చిన్నపాటి యుద్ధాన్నే తలపిస్తుంది. అక్తర్ బౌలింగ్‌లో సచిన్ బౌండరీ బాదినా.. సచిన్‌ను అక్తర్ అవుట్ చేసినా.. అభిమానుల ఆనందానికి అవధులుండవు. అప్పట్లో తామిద్దరి మధ్య  ఉండే పోటీకి సంబంధించి అక్తర్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా తన తొలి మ్యాచ్‌లోనే సచిన్‌ను డకౌట్ చేసిన తీరును గుర్తు చేసుకున్నాడు. ‘1999లో మా జట్టు ఇండియా టూర్‌ వెళ్లింది. కోల్‌కతా టెస్ట్‌లో సచిన్‌ను మొదటిసారి చూశాను. సచిన్ కూడా నన్ను చూశాడు. కానీ ఒకరిని ఒకరం పట్టించుకోలేదు. అయితే నా మనసులో ఒకటే ఆలోచన వచ్చింది. ఇతను క్రికెట్ దేవుడా.. అయితే నేనేంటో చూపించాలనిపించింది. మ్యాచ్ మొదలైంది. సచిన్ బ్యాటింగ్ వచ్చాడు. నేను బౌలింగ్ చేస్తున్నా. కొంత కలవరపాటుగా ఉన్నప్పటికీ సచిన్‌ను ఔట్ చేయాలని గట్టిగా అనుకున్నాను. బలంగా ఓ యార్కర్ వేశాను.  అంతే సచిన్‌ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిడ్ వికెట్ ఎగిరి అవతల పడింది. ఇక నా ఆనందానికి అంతులేదు. మోకాళ్లపై కూర్చొని పెద్దగా అరిచాను. ఆ క్షణం ఇప్పటికి మరిచిపోలేను. అందరూ క్రికెట్ దేవుడిగా పిలిచే సచిన్‌ను తొలి బంతికే ఔట్ చేశా. ఇప్పటికీ అదో గొప్ప జ్ఞాపకమ’ని అక్తర్ చెప్పాడు.

Updated Date - 2020-08-02T21:44:11+05:30 IST