గ్రేటర్‌వాసులకు షాకింగ్ న్యూస్.. ఈ నెలలో మోత..

ABN , First Publish Date - 2022-05-07T18:32:43+05:30 IST

గ్రేటర్‌వాసులకు షాకింగ్ న్యూస్.. ఈ నెలలో మోత..

గ్రేటర్‌వాసులకు షాకింగ్ న్యూస్.. ఈ నెలలో మోత..

  • అ‘స్థిర’చార్జీలు!
  • స్థిరచార్జీల పేరుతో కిలోవాట్‌కురూ.10 
  • కస్టమర్‌ చార్జీలు డబుల్‌
  • యూనిట్‌ వారీగా మరో పెంపు
  • రెట్టింపు అవుతున్న కరెంట్‌ బిల్లు
  • నెలకు రూ.165 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారం


మచ్చ బొల్లారానికి చెందిన ఆండాల్‌ (యూఎస్సీ నం.100515383) మార్చిలో 46 యూనిట్ల కరెంట్‌ వినియోగించారు. బిల్లు రూ.101 వచ్చింది. ఏప్రిల్‌లో 50 యూనిట్లకు గాను రూ.197 వచ్చింది. నాలుగు యూనిట్లు అదనంగా వాడినందుకు పడిన భారం రూ.96. ఏప్రిల్‌ నుంచి యూనిట్‌పై రూ.50 పైసల చొప్పున కరెంట్‌ చార్జీలు పెంచుతున్నట్లు విద్యుత్‌ అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన ఆండాల్‌కు పడాల్సిన భారం రూ.25 మాత్రమే. కానీ, కొత్తగా స్థిర చార్జి పేరుతో కిలోవాట్‌కు రూ. 10 చొప్పున రెండు కిలోవాట్లకు అదనంగా రూ. 20. గతంలో రూ.30గా ఉన్న కస్టమర్‌ చార్జీలను రూ.70కి పెంచడంతో బిల్లు దాదాపు రెట్టింపయింది.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌వాసులకు మే నెలలో విద్యుత్‌ బిల్లు తీసుకోగానే షాక్‌ తగులుతోంది. ఏప్రిల్‌ నెలలో వాడిన కరెంట్‌కు పెరిగిన చార్జీలకు తోడు స్థిర, కస్టమర్‌ చార్జీలతో కలిపి బిల్లుల మోత మోగుతోంది. గృహ వినియోగదారులపై యూనిట్‌కు రూ.50 పైసలు మాత్రమే పెంచినట్లు ప్రకటించిన డిస్కం టారీఫ్‌ చార్జీలతో పాటు స్థిర చార్జీల (ఫిక్స్‌డ్‌) పేరుతో కిలో వాట్‌ కు రూ.10 వసూలు చేస్తుండడంతో విని యోగదారులపై అధిక భారం పడుతోంది. త్రీ ఫేజ్‌తో 5 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న కనెక్షన్లకు స్థిర చార్జీయే రూ.50 పడుతోంది. అన్నీ కలిపి విద్యుత్‌ చార్జీలు సుమారు 30 శాతం మేర పెరగడంతో నగరవాసులు గగ్గోలు పెడుతున్నారు.


కస్టమర్‌ చార్జీలు రూ.30 నుంచి రూ.70కు..

విద్యుత్‌ వినియోగం ఆధారంగా వసూలు చేస్తున్న కస్టమర్‌ చార్జీలను ఏప్రిల్‌ నుంచి డబుల్‌ చేశారు. 51-100 లోపు యూనిట్లు వినియోగించే వారి నుంచి మార్చి వరకు రూ.30 వసూలు చేసేవారు. ఏప్రిల్‌ నుంచి దాన్ని రూ.70కి పెంచారు. 100-200 యూనిట్లలోపు రూ.50 నుంచి 90కి పెంచారు. 201-300 యూనిట్ల వరకు వినియోగదారులకు గతంలో రూ.60 ఉంటే దానిని ఏప్రిల్‌ నుంచి రూ.100కు పెంచింది. అస్థిరతంగా చార్జీల భారం మోపారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.


అప్పుడు హెచ్‌టీ కనెక్షన్లకే..

వాస్తవానికి మార్చి వరకు హెచ్‌టీ కనెక్షన్లకే స్థిర చార్జీలు పరిమితం అయ్యాయి. ఏప్రిల్‌ నుంచి గృహ వినియోగదారులకు  కూడా వడ్డిస్తున్నారు. మొన్నటి వరకు ఎనర్జీ, కస్టమర్‌ చార్జీలు మాత్రమే వసూలు చేసేవారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా స్థిర చార్జీలను డిస్కం తెరపైకి తెచ్చింది. 

Read more