పూరి, ఛార్మీలకు ముంబైలో వింత అనుభవం

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబైకే మకాం మార్చేశారు ఛార్మీ అండ్ పూరి. అక్కడి నుండే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ముంబై వీధుల్లో కారులో వెళుతున్న పూరి, ఛార్మీలకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ అనుభవాన్ని స్వయంగా ఛార్మీ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. 

‘లైగర్’ షూటింగ్ నిమిత్తం పూరి, ఛార్మీ కారులో వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రమోద్ అనే కుర్రాడు.. వారిని పలకరించాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారుని గుర్తించిన తెలుగు కుర్రాడైన ప్రమోద్.. అందులో ఉన్న పూరి, ఛార్మీలను గుర్తుపట్టి ఎగ్జయిట్ అవుతూ.. వారిని పలకరించాడు. ‘లైగర్’ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లుగా తెలిపాడు. పూరితో సెల్ఫీ తీసుకోవాలని ఎంతో ఆరాటపడ్డాడు కానీ.. సమయానికి తన దగ్గర ఫోన్ లేకపోవడంతో నిరాశపడ్డాడు. ఇది గమనించిన పూరి అతనిని ప్రేమగా పలకరించి.. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదంతా ఛార్మీ తన ఫోన్‌లో రికార్డు చేశారు. అయితే పూరి పలకరింపుతో పొంగిపోయిన ఆ కుర్రాడు వెళుతూ వెళుతూ.. వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేయాల్సిందిగా ఛార్మీని కోరాడు. ప్రస్తుతం ఛార్మీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Advertisement