HYD : పెంపుడు తల్లి హత్య కేసులో విస్తుపోయే విషయాలు.. నాలుగు నెలల నుంచి అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2022-05-10T15:17:36+05:30 IST

పెంపుడు తల్లి హత్య కేసులో విస్తుపోయే విషయాలు.. నాలుగు నెలల నుంచి అసలేం జరిగింది..!?

HYD : పెంపుడు తల్లి హత్య కేసులో విస్తుపోయే విషయాలు.. నాలుగు నెలల నుంచి అసలేం జరిగింది..!?

  • రెండు వారాలుగా ప్లాన్‌?
  • గడ్డి అన్నారం హత్య కేసులో విస్తుపోయే విషయాలు
  • నాలుగు నెలల నుంచి సాయితేజ ప్రవర్తనలో మార్పు
  • మత్తు పదార్థాలే కారణమా..?

దిల్‌సుఖ్‌నగర్‌ న్యూ గడ్డిఅన్నారంలో మహిళ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో ఆప్యాయతతో మెలిగే ఆమె దత్తపుత్రుడు సాయితేజ ప్రవర్తనలో నాలుగు నెలలుగా విపరీతమైన మార్పులు వచ్చాయన్న తండ్రి జంగయ్య యాదవ్‌ వ్యాఖ్యలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆయన మాటలను బట్టి దత్తపుత్రుడే నిందితుడన్న అనుమానాలు బలపడుతున్నాయి. రెండు వారాల క్రితం నుంచే ఇంట్లోని నగలు, నగదు చోరీకి ప్లాన్‌ చేసుకున్నట్లుగా ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ క్రమంలోనే పెంపుడు తల్లిని హతమార్చి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌ : ‘‘మాజీ డ్రైవర్‌ మూలంగా సాయితేజ ప్రవర్తనలో మార్పు వచ్చింది. చెడు స్నేహాలతో కొన్ని రోజులుగా మత్తు పదార్థాలకు అలవాటు పడినట్టు గమనించాం. హత్య వెనుక అతడు, అతడి  కొంత మంది స్నేహితుల ప్రమేయం ఉండొచ్చు’ అని స్వయానా పెంపుడు తండ్రే అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా జంగయ్య యాదవ్‌ మాజీ డ్రైవర్‌తో పాటు, సాయితేజ స్నేహితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.


బీరువా తాళాలే ప్రాణాల మీదకు తెచ్చాయా?

సాయితేజకు పెళ్లి చేసేందుకు నిశ్చయించుకున్న జంగయ్య యాదవ్‌, భూదేవి దంపతులు బంగారు ఆభరణాల కొనుగోలు కోసం రెండు నెలల క్రితం రూ.10 లక్షల నగదు తీసుకువచ్చి ఇంట్లో పెట్టారు. నగదు, నగలు ఉండడంతో ఆ బీరువా తాళాలను చిన్న పర్సులో పెట్టి, ఆ పర్సును భూదేవి తన దుస్తుల్లో పెట్టుకునేవారు. శనివారం రాత్రి కూడా అలాగే చేశారు. నగలు, నగదు చోరీ చేసేందుకు పర్సు తీసుకునే సమయంలో భూదేవి లేవడంతో ఆమె ముఖంపై దిండు అదిమి హతమార్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో భూదేవి చేతి గాజులు పగిలిపోయినట్లుగా గదిలో ఉన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది.


అప్పటి నుంచీ పని చేయని సీసీ కెమెరాలు

భూదేవి ఇంట్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి, రెండు అంతస్తుల్లో మొత్తం నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయి. అవన్నీ రెండు వారాల క్రితం నుంచీ పని చేయలేదు. స్థానికంగా టెక్నిషియన్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని రెండు కెమెరాల మరమ్మతు చేసి, తిరుపతి వెళ్లడంతో మొదటి అంతస్తులోని కెమెరాలు అలాగే వదిలేశాడు. దీన్ని బట్టి 15, 20 రోజుల నుంచే చోరీకి పథకం వేసి సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


చైన్‌, ఉంగరాలు తాకట్టు

సాయితేజ తీరులో నాలుగు నెలలుగా విపరీతమైన మార్పు వచ్చినట్లు జంగయ్య యాదవ్‌ వాపోతున్నారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం, వారితోనే పడుకోవడం చేసేవాడు. కొద్ది నెలల క్రితం రెండు ఉంగరాలు, చైన్‌ తాకట్టు పెట్టి స్నేహితులకు మద్యం తాగించినట్లు తమకు ఆలస్యంగా తెలిసిందని పేర్కొన్నారు. తమ మాజీ డ్రైవర్‌ నర్సింహగౌడ్‌ మరికొంత మంది స్నేహితులు సాయితేజలో మార్పులకు కారణమని ఆరోపిస్తున్నారు. కుమారుడ్ని వక్రమార్గం పట్టిస్తున్నాడని మూడు నెలల క్రితమే అతడిని తొలగించినట్లు చెప్పారు. ఈ ఘాతుకంలో అతడి ప్రమేయం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.


దుర్భాషలాడేవాడు 

లాక్‌డౌన్‌కు ముందు వరకు ఆ ఇంట్లో డ్రైవర్‌గా పని చేశాను. మూడు నెలల క్రితం మళ్లీ జంగయ్యయాదవ్‌ వద్ద డ్రైవర్‌గా చేరాను. గతంలో చూసిన సాయితేజకు, ప్రస్తుతం చూస్తున్న వ్యక్తికి చాలా తేడా ఉంది. తల్లిదండ్రులతో గతంలో ఆప్యాయంగా ఉండే సాయితేజ ఇటీవలి కాలంలో తరచూ దుర్భాషలకు దిగేవాడు. తల్లితో గొడవపడి, ఫోన్‌ ఆఫ్‌ చేసుకుని స్నేహితుల వద్దకు వెళ్లేవాడు. ఒకటి,రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చేవాడు. - నాగేశ్వర్‌రావు, జంగయ్యయాదవ్‌ డ్రైవర్‌.

Read more