అతను ఓఎల్ఎక్స్‌లో పెట్టిన ప్రకటన చూసి కారు కొనేందుకు వచ్చారు.. టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పి కారును, అతడిని ఊరు అవతలకు తీసుకెళ్లారు.. అక్కడ కారు ఆపి పిస్టల్‌తో అతడిని కాల్చి పారిపోయారు.. విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు.. అదంతా ఆ వ్యక్తి భార్య వేసిన స్కెచ్ అని తేల్చారు.. ప్రియుడితో కలిసి భార్య అతడిని చంపించిందని తేల్చారు.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన జరిగింది.
లోహియా సంస్థాన్‌లో పని చేస్తున్న శ్రీరామ్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య సంగీత, పిల్లలతో కలిసి లక్నోలో నివసిస్తున్నాడు. సంగీతకు కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అతడితో మాట్లాడేందుకు రహస్యంగా ఓ ఫోన్‌ను ఉపయోగిస్తూ ఉండేది. ఈ నెల 1వ తేదీన ఆ ఫోన్ శ్రీరామ్ కంటపడింది. అప్పట్నుంచి శ్రీరామ్, సంగీత మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో శ్రీరామ్‌ను చంపెయ్యాలని సంగీత, కుమార్ పథకం రచించారు. తన భర్త కారు అమ్మెయ్యాలనుకుంటున్నట్టు సంగీత ఇటీవల కుమార్‌కు చెప్పింది. దీంతో కుమార్ ఓ పథకం వేశాడు.
ఇద్దరు యువకులను శ్రీరామ్ దగ్గరకు పంపించాడు. కారు కొంటామని, టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తామని వారు శ్రీరామ్‌ను నమ్మించారు. వారితో పాటు శ్రీరామ్ కూడా కారులో బయల్దేరాడు. వారు శ్రీరామ్‌ను మాటల్లో పెట్టి ఊరవతలకు తీసుకెళ్లారు. ఒక చోట కారు ఆపి శ్రీరామ్‌ను తుపాకీతో కాల్చి చంపేసి అక్కణ్నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. శ్రీరామ్ సోదరుడు మనీష్ యాదవ్ స్టేట్‌మెంట్ ఆధారంగా సంగీతను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె అసలు విషయం బయటపెట్టింది.