Shocking : నూనూగు మీసాలు కూడా రాలేదు.. పసితనం ఇంకా ముఖంలో మాయం కాలేదు.. ఈ కుర్రాడు చేసే పనులు వామ్మో..!

ABN , First Publish Date - 2021-10-30T18:57:42+05:30 IST

నూనూగు మీసాలు కూడా రాలేదు. పసితనం ఇంకా ముఖంలో మాయం కాలేదు. మైనారిటీ దాటనేలేదు. అయినా...

Shocking : నూనూగు మీసాలు కూడా రాలేదు.. పసితనం ఇంకా ముఖంలో మాయం కాలేదు.. ఈ కుర్రాడు చేసే పనులు వామ్మో..!

చిత్తూరు : నూనూగు మీసాలు కూడా రాలేదు. పసితనం ఇంకా ముఖంలో మాయం కాలేదు. మైనారిటీ దాటనేలేదు. అయినా, ఏటీఎంల దగ్గర కాపేసి, మాయచేసి ఇప్పటికే పదిన్నర లక్షలు దాకా కాజేశాడు. తాజాగా చిత్తూరులో ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఒక మహిళ నుంచి 65వేలు నొక్కేసిన కేసులో దొరికిపోయాడు. చిత్తూరు ఒకటో పట్టణ సీఐ నరసింహరాజుతో కలిసి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్గి గ్రామానికి చెందిన 18 ఏళ్ళలోపు పిలగాడు కొన్నేళ్లుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఏటీఎంల దగ్గర కాపేసి, డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియని వారిని మాయచేసి సొమ్ములు కాజేస్తున్నాడు.


ఈ విధంగా రూ.10.52 లక్షలను కాజేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం అదుపులోకి తీసుకున్న బాల నేరస్తుడి నుంచి రూ.65వేలతోపాటు రూ.3లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని జువైనల్‌ జస్టిస్‌ హోమ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన సిబ్బందిని డీఎస్పీ నగదు రివార్డులతో అభినందించారు. మీడియా సమావేశంలో ఎస్‌ఐ అనిల్‌కుమార్‌, పద్మావతి పాల్గొన్నారు.


ఈనెల 23న చిత్తూరు హైరోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఇదే పద్ధతిలో తాళంబేడుకు చెందిన బేబీ షామిలి అనే మహిళను మోసం చేశాడు. తను డ్రా చేసి ఇస్తానంటూ కార్డు తీసుకుని, తన దగ్గర ఉన్న నకిలీ కార్డును పెట్టి, పనిచేయడం లేదంటూ నకిలీ కార్డు షామిలీకి ఇచ్చేశాడు. ఆ తర్వాత అసలు కార్డుతో 65 వేలు డ్రా చేసుకున్నాడు. ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు వలపన్ని బాలనేరస్తుడిని పట్టుకున్నారు. ఇతను ఇదే పద్ధతిలో మలక్‌పేట, వైజాగ్‌, సంగారెడ్డి జిల్లా ఆర్‌సీపురం, అనంతపురం, పాలకొల్లు, విజయనగరం, బాపట్ల, టంగుటూరు, తిరుపతి, రాజమండ్రి, తణుకుల్లోనూ మోసాలు చేశాడని ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-10-30T18:57:42+05:30 IST