Abn logo
Jun 30 2020 @ 10:15AM

సీఎం జగన్‌కు ఆర్‌ఆర్‌ఆర్ రాసిన లేఖలో షాక్‌లు..?

ఆర్‌ఆర్‌ఆర్‌.. ఈ మూడు ఆంగ్లాక్షరాలు ఇప్పుడు తెలుగునాట సంచలనానికి కేంద్ర బిందువులు. ఈ పేరుతో రాజమౌళి తీస్తున్న సినిమా ఒకటైతే.. ఇదే ట్రిపుల్‌ ఆర్‌ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీలోని ఆ మూడు అక్షరాలే రఘురామ కృష్ణంరాజు. ఇటీవల ఆయన వైసీపీ పెద్దలకు ఒక రేంజ్‌లో సినిమా చూపిస్తున్నారు. రోజుల తరబడి కొనసాగుతున్న ఈ సినిమా అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.


    రఘురామ కృష్ణంరాజు పేరు వింటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం పెద్దలు ఉలిక్కిపడుతున్నారు. స్వపక్ష ఎంపీ ఏపీలో అధికార పక్షానికి నిద్రలేకుండా చేస్తున్నారు. పార్టీలో నెంబర్‌- 2 గా హవా చెలాయిస్తున్న విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకి కూడా ఎదురు ప్రశ్నలు సంధించి షాక్‌ ఇచ్చారు రఘురామ కృష్ణంరాజు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌పార్టీ పక్షాన ఎంపీగా గెలిచాననీ, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పక్షాన కాదనీ సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పేరిట ఎలా నోటీసు ఇస్తారంటూ విజయసాయిని నిలదీశారు. దీంతో ఈ వ్యవహారం ఈసీ వరకూ పోయింది. అంతే కాదు- ఏపీ అధికారపక్షంలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. 


    తాజాగా ముఖ్యమంత్రి జగన్‌కి రఘురామ కృష్ణంరాజు ఓ లేఖ రాశారు. అది కూడా షోకాజ్‌ నోటీసుకి సమాధానం కాదట. ఈ లేఖ సంగతేమిటని మీడియా ప్రతినిధులు అడిగితే "ముఖ్యమంత్రికి తాను పంపింది సమాచారం మాత్రమే'' అని ఆయన స్పష్టచేశారు. నిజానికి ఏ నాయకుడైనా తనకు అధిష్టానం షోకాజ్‌ నోటీసు ఇస్తే వివరణతో కూడిన సమాధానం ఇస్తారు. లేదంటే సరెండర్‌ అవుతారు. ఈ రెండు కాకుండా ముఖ్యమంత్రికి లేఖ రూపంలో సమాచారం మాత్రమే పంపానని రఘురామ కృష్ణంరాజు చెప్పడమే ఆశ్చర్యకర కోణం!


    జగన్మోహన్‌రెడ్డికి ఆర్‌ఆర్‌ఆర్‌ రాసిన ఆరు పేజీల లేఖలో ఓంప్రథమం ముఖ్యమంత్రిని పొగిడారు. ఉత్తమ ముఖ్యమంత్రులు ఎవరన్న సర్వేలో జగన్‌కు నాలుగవ స్థానం వచ్చినందుకు అభినందనలు తెలిపారు. త్వరలోనే మొదటిస్థానం సాధించాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. అయితే ఆయన సెటైరికల్‌గానే అలా అన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విజయసాయిరెడ్డి నుంచి తనకు అందిన నోటీసు గురించి కూడా ఆ లేఖలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రస్తావించారు. "పార్టీ క్రమశిక్షణా సంఘమే నోటీసులు ఇవ్వాలి. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడి హోదాలో విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారా?'' అని కూడా ఆయన జగన్‌ని ప్రశ్నించారు. నిజానికి రఘురామకృష్ణంరాజుకు వచ్చింది షోకాజ్ నోటీస్ కాబట్టి.. దానికి  గడువులోగా ఆయన స్పందించారు. అయితే ముఖమంత్రికి రాసిన లేఖలో వివరణ ఇచ్చారా? లేక ధిక్కారస్వరం వినిపించారా? అనేది మాత్రం వైసీపీ శ్రేణులకు అర్థంకావడం లేదట. అందులో ఆయన అసంతృప్తి మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 


    జగన్‌కి తాను విధేయుడినే అంటున్నారు రఘురామ కృష్ణంరాజు. కానీ అధికారపక్షం ఏపీలో తీసుకుంటున్న పలు నిర్ణయాలను ఆయన విమర్శిస్తున్నారు. ఈ వైఖరే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌పార్టీ అధినేతలకు మింగుడుపడటం లేదు. ప్రాథమిక విద్యను ఆంగ్లంలో బోధించాలన్న జగన్‌ సర్కార్‌ నిర్ణయాన్ని రఘురామ కృష్ణంరాజు గట్టిగా వ్యతిరేకించారు. పార్లమెంట్‌లో కూడా ఈ అంశంపై తన వాయిస్‌ వినిపించారు. జగన్‌ పార్టీలో ఉంటూ ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమేంటని చాలామంది ఆయనను అడిగారు. దానికాయన స్పష్టమైన సమాధానమే చెబుతున్నారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలన్న రాజ్యంగ సూత్రానికి భిన్నంగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ.. ఆ విషయంలో పార్టీ పెద్దలను అప్రమత్తం చేయడానికే తాను గొంతెత్తానన్నది రఘురామ కృష్ణంరాజు వాదన. ఏపీలో సాగుతున్న ఇసుక దందాపై కూడా ఆ మధ్య ఆర్‌ఆర్‌ఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. టీటీడీకి సంబంధించిన నిరర్థక ఆస్తులు విక్రయించాలని పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చినప్పుడు కూడా రఘురామ కృష్ణంరాజు వ్యతిరేకించారు. వెంకటేశ్వరస్వామి అపర భక్తుడిగా తన మనోభావాలను వ్యక్తంచేస్తున్నానని ఆయన ప్రకటించారు. ఇలా స్వపక్ష ఎంపీనే తమ నిర్ణయాలపై బాహాటంగా గొంతెత్తడంతో ఏపీలో అధికారపక్ష పెద్దలకి గొంతులో వెలక్కాయపడుతోందన్నది రాజకీయవర్గాల కథనం!


    ఏపీలో హీట్‌ పెరిగిన తర్వాత రఘురామ కృష్ణంరాజు తన నియోజకవర్గానికి వెళ్లాలంటే భద్రత లేదనీ, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనీ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ని కలిపి పరిస్థితిని వివరించారు. దీంతో ఈ రచ్చ నేషనల్‌ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో ఏపీలో అధికారపక్షం దాదాపుగా డిఫెన్స్‌లో పడిందన్నది పరిశీలకుల కథనం!


    రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం జగన్‌కి అగ్నిపరీక్ష పెడుతున్నారని పొలిటికల్‌ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌పై చర్యలు తీసుకోవడానికి ఒకటికి పదిసార్లు వైసీపీ పెద్దలు ఆలోచించాల్సి వస్తోందట. హస్తినలో బీజేపీ పెద్దలతో రఘురాముడు సఖ్యతగా మెలుగుతున్నారు. ఈ సమయంలో ఆయనపై వేటువేస్తే పరిస్థితి ప్రతికూలంగా మారుతుందేమో అని జగన్‌ అండ్‌ కోకి జంకుగా ఉందట. పోనీ చూసీచూడనట్టు ఊరుకుందామా అంటే ఆర్‌ఆర్‌ఆర్‌ ఉండుండుండీ పిడుగులు కురిపిస్తున్నారాయె! దీంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదట. మొత్తానికి జగన్‌ పార్టీని రఘురామ కృష్ణంరాజు ఒక డైలామాలోని నెట్టేస్తున్నారన్నది విశ్లేషకుల వాదన. చూద్దాం ఈ పరిణామం ఎటు దారితీస్తుందో! 

Advertisement
Advertisement
Advertisement