కరెంట్ బిల్లు చూసి.. ఖంగుతిన్న టైలర్

ABN , First Publish Date - 2021-09-13T06:11:44+05:30 IST

అతనో నిరుపేద..

కరెంట్ బిల్లు చూసి.. ఖంగుతిన్న టైలర్

కరెంట్‌ బిల్లుతో షాక్‌

టైలర్‌ ఇంటికి రూ.90,444 బిల్లు

విద్యుత్‌ వినియోగంలో ‘జీరో’ యూనిట్లు నమోదు

అయినా భారీగా మొత్తంలో బిల్లు చేతిలో పెట్టిన సిబ్బంది

లబోదిబోమంటున్న నిరుపేద దర్జీ


సీలేరు(విశాఖపట్నం)అతనో నిరుపేద టైలర్‌. ఇంట్లో వున్నది మూడు లైట్లు, రెండు ఫ్యాన్లు మాత్రమే ప్రతి నెలా రూ.200-300 మధ్యలో కరెంటు బిల్లు వస్తుంటుంది. కానీ ఈ నెలలో ఏకంగా రూ.90 వేలకు పైగా బిల్లు రావడంతో లబోదిబోమంటున్నాడు. సీలేరు శివాలయం వీధికి చెందిన కిముడు సోమనాథమ్‌ టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏపీ జెన్‌కోకు చెందిన రేకుల షెడ్డులో నివాసం వుంటున్న ఇతని ఇంటిలో కిముడు సోమనాథమ్‌ అనే వ్యక్తి అద్దెకు నివాసం వుంటున్నాడు. మూడు లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీ మాత్రమే వున్నాయి. నెలకు రూ.200-300 వరకు కరెంటు బిల్లు వస్తుంటుంది.


ఈ నేపథ్యంలో గత నెల 8వ తేదీ నుంచి ఈ నెల 12వ తేదీ వరకు వినియోగించిన విద్యుత్తుకి సంబంధించి ఆదివారం మీటర్‌ రీడింగ్‌ తీశారు. బిల్లు మొత్తం రూ.90,444 చెల్లించాలని వచ్చింది. దీనిని చూసి సోమనాథమ్‌ షాక్‌కు గురయ్యాడు. ఇంత భారీ మొత్తంలో బిల్లు ఎలా వచ్చిందని రీడింగ్‌ తీసిన వ్యక్తిని ప్రశ్నించాడు. ‘మీటర్‌లో ఉన్న రీడింగ్‌ ప్రకారమే బిల్లు ఇచ్చాను. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈపీడీసీఎల్‌ అధికారులను సంప్రదించండి’ అని చెప్పి వెళ్లిపోయాడని సోమనాథమ్‌ వాపోయాడు. 

Updated Date - 2021-09-13T06:11:44+05:30 IST