పేదింటికి షాక్‌

ABN , First Publish Date - 2020-12-03T09:08:20+05:30 IST

పక్కా ఇళ్లపై పేదలకు వైసీపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షలు లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న వైసీపీ....

పేదింటికి షాక్‌

ఇంటికి 5 లక్షల వరకు మేనిఫెస్టో హామీ

ఇప్పుడు 1.8 లక్షలు ఇవ్వాలని నిర్ణయం

అవీ దాదాపుగా కేంద్ర సర్కారు నిధులే

గత ప్రభుత్వం ఇచ్చినదాన్లోనూ కోతలు

అప్పట్లో పట్టణ ఇంటికి 2.5 లక్షలు

యూడీఏల పరిధిలో రూ.2 లక్షలు

ఇదేం రాయితీ అంటున్న పేదవర్గాలు

స్థలంతో అంతే అవుతుందని సమర్థన


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పక్కా ఇళ్లపై పేదలకు వైసీపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షలు లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న వైసీపీ....ఇప్పుడు దానిపై వెనుకడుగు వేసింది. ఒక్కో ఇంటికి ఇచ్చే రాయితీ కేవలం రూ.1.8లక్షలేనని తేల్చేసింది. కొత్త ప్రభుత్వం అదనంగా ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీనీ తగ్గించడం ఇక్కడ కొసమెరుపు.


ఈ మేరకు నవరత్నాలు అమల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు’ పేరుతో 15.1లక్షల ఇళ్లు మంజూరుచేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వం పట్టణ మునిసిపాలిటీల్లో నిర్మించుకున్న ఇళ్లకు రూ.2.5లక్షలు రాయితీ ఇచ్చిం ది. పట్టణ అభివృద్ధి సంస్థల (యూడీఏ) పరిధిలో కట్టుకున్న ఇళ్లకు రూ.2లక్షలు ఇచ్చింది. అంతకుమించి లబ్ధి చేకూరుస్తామని అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం తీరా పాలసీ విడుదల చేసే సమయానికి మొత్తానికే కోత పెట్టింది. గతంలో ఎంతరాయితీ ఉన్నా అన్నిటికీ కలిపి ఒకేవిధంగా రూ.1.8లక్షలు మాత్రమే ఇవ్వనున్నట్లు స్పష్టంచేసింది. ఇది కూడా దాదాపుగా మొత్తం కేంద్రం నుంచి వచ్చేదే కావడం గమనార్హం. మునిసిపాలిటీల్లో కట్టుకునే ఇళ్లకు రాష్ట్రప్రభుత్వం వాటా రూపాయి కూడా లేదు. యూడీఏల్లో కట్టుకునే ఇళ్లకు మాత్రం ఇంటికి రూ.30వేలు రాష్ట్ర వాటా ఉంది. మిగతా నిధులన్నీ కేంద్రం రాయితీ, ఉపాఽధిహామీ నిధుల మార్పిడి కింద సమకూరుస్తారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో మొత్తం 28లక్షల ఇళ్లు కట్టాలని నిర్ణయించింది. తొలి విడతలో ఇప్పుడు 15.10లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టనుంది. గత ప్రభుత్వంలో చాలావరకు గ్రామాలు యూడీఏల పరిధిలోకి రావడంతో అవీ ఇందులో ఉంటాయి.


2019-20కి 7.53లక్షల ఇళ్లు, 2020-21కి 6.22లక్షల ఇళ్లు కట్టనున్నట్లు తెలిపింది. అంతకుముందు ప్రభుత్వంలో మంజూరైన 2018-19కి చెందిన 1.33లక్షల ఇళ్లు కూడా ఇందులో కలపడంతో మొత్తం 15.10 లక్షల ఇళ్లు అయినట్లు వివరించింది. పట్టణాల్లో పేదలకు ఇచ్చే సెంటు స్థలంలో 272 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉండాలని సూచించింది. లివింగ్‌రూమ్‌ 77 అడుగులు, వంటగది 35 అడుగులు, బెడ్‌రూమ్‌ 82 అడుగులు, మరుగుదొడ్డి 24అడుగులు ఉండాలని స్పష్టంచేసింది. ఓపెన్‌ వరండా 68అడుగుల్లో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే రాయితీలో నుంచి నగదు మినహాయించుకుని హౌసింగ్‌ కార్పొరేషన్‌ నిర్మాణ మెటీరియల్‌ సరఫరా చేస్తుందని వివరించింది. ఇసుక ఉచితంగా ఇస్తారని, అయితే రవాణా చార్జీలు లబ్ధిదారు భరించాలని తెలిపింది. సిమెంటు, ఇటుకలు, స్టీలుతో పాటు రెండు తలుపులు, ఒక మరుగుదొడ్డి తలుపు, మూడు కిటికీలు, మూడు వెంటిలేటర్లు కార్పొరేషన్‌ ఇస్తుందని పేర్కొంది. సచివాలయాల ఉద్యోగులు నిర్మాణాలను పర్యవేక్షిస్తారని, లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారని తెలిపింది. మెటీరియల్‌ కొనుగోలు, నిర్మాణాల పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను నియమించింది.




కోత పెట్టి కలరింగ్‌

టీడీపీ ప్రభుత్వంలో మునిసిపాలిటీల్లో కట్టుకున్న ఇళ్లకు రూ.2.5లక్షల రాయితీఇచ్చారు. అందులో కేంద్రం వాటా రూ.లక్షన్నర, రాష్ట్రం వాటా రూ.లక్ష ఉంది. యూడీఏల్లో ఇళ్లకు రూ.2లక్షలు రాయితీఇస్తే కేంద్రం వాటా రూ.లక్షన్నర. రాష్ట్రంవాటా రూ.50వేలు. ఎన్నికల సమయంలో ఇంతకంటే మెరుగైన లబ్ధి పేదలకు అందుతుందని, ఒక్కో ఇంటికి 2 నుంచి 5లక్షలు వస్తాయని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు గతప్రభుత్వం ఇచ్చిన దాంట్లోనే కోత పెట్టారు. అయితే దీనిపై ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ‘ఇంటి స్థలాలు ఇస్తున్నాం కాబట్టి దాని విలువ కూడా ఇందులో కలిపి చూడాలి’ అని అంటున్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే వారికైనా అదనపు రాయితీ ఇస్తారా అంటే అదీ లేదు.


ప్రభుత్వ స్థలం అయినా, సొంత స్థలం అయినా రాయితీ ఒకటేనని ప్రభుత్వం తెలిపింది. ఇంకా విచిత్రం ఏంటంటే 2018-19లో మంజూరైన ఇళ్లకు అప్పటి పాలసీ ప్రకారం రాయితీలు ఇవ్వాలి. కానీ వారికి కూడా ఇప్పుడున్న రాయితీనే వర్తిస్తుందంటూ దానికి కోత పెట్టింది. తాజా పాలసీ చూసిన లబ్ధిదారులు గత ప్రభుత్వంలోనే ఇళ్లు కట్టుకుని ఉంటే బాగుండేది అన్న పరిస్థితి తీసుకొచ్చింది. నూతన పాలసీలో నిర్ణయించిన ధరలపై ఇప్పటికే ప్రచారం సాగడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-12-03T09:08:20+05:30 IST