మైనింగ్‌ మాఫియాకు షాక్‌

ABN , First Publish Date - 2021-07-31T06:02:32+05:30 IST

నాతవరం మండలం భమిడికిలొద్దిలో బినామీల మాటున లేటరైట్‌ ఖనిజాన్ని తవ్వి తరలించుకుపోతున్న మాఫియాకు, వారికి సహకరించిన అధికారులకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) గట్టి షాక్‌ ఇచ్చింది.

మైనింగ్‌ మాఫియాకు షాక్‌
లేటరైట్‌ కోసం రిజర్వుఫారెస్టును ధ్వంసం చేసి నిర్మించిన రహదారి

భమిడికలొద్దిలో లేటరైట్‌ మైనింగ్‌పై విచారణకు

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశం

రిజర్వు ఫారెస్ట్‌లో వేల చెట్ల నరికివేత, రహదారి నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం

ఖనిజ రవాణా కోసం అటవీ చట్టాలను ఉల్లంఘించారని ఆగ్రహం

ఏడు అంశాలపై సమగ్ర విచారణ 

కేంద్ర అటవీ శాఖ, రాష్ట్ర గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, విశాఖ కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు

అక్రమాలకు అండగా నిలిచిన అధికారుల మెడకు ఉచ్చు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నాతవరం మండలం భమిడికిలొద్దిలో బినామీల మాటున లేటరైట్‌ ఖనిజాన్ని తవ్వి తరలించుకుపోతున్న మాఫియాకు, వారికి సహకరించిన అధికారులకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) గట్టి షాక్‌ ఇచ్చింది. రిజర్వు ఫారెస్టులో రహదారి నిర్మించడం అక్రమమేనని, అటవీ చట్టాలను తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై విచారణకు ఆదేశించింది. రహదారి నిర్మాణం, లేటరైట్‌ మైనింగ్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక అందించాలని ఆదేశిస్తూ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 


సుందరకోట పంచాయతీ భమిడికలొద్ది వద్ద 121 హెక్టార్లలో లేటరైట్‌ మైనింగ్‌కు గతంలో లీజులు పొందిన వ్యక్తిని అధికార పార్టీ ముఖ్య నేతలు తమ దారికి తెచ్చుకుని జూన్‌ నెలలో లేటరైట్‌ తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు...తవ్విన ఖనిజాన్ని కడపలో కీలక నేత సిమెంట్‌ ఫ్యాక్టరీకి తరలించడం కోసం భమిడికలొద్ది లేటరైట్‌ క్వారీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి ఈ ఏడాది ఆరంభంలో స్కెచ్‌ గీశారు. ప్రభుత్వ పెద్దల తరఫున ఓ ప్రముఖ ఆలయ మాజీ చైర్మన్‌ తనయుడు స్వయంగా రంగంలోకి దిగి తూర్పుగోదావరి జిల్లాలోనే మకాం వేసి అంతా తానై ఈ వ్యవహారం నడిపించారు. స్వయంగా రహదారి నిర్మాణం చేపడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్‌ శాఖను అడ్డం పెట్టుకుని ఉపాధి హామీ పథకం కింద గిరిజన గ్రామాలకు రహదారి పేరిట ప్రతిపాదనలు తయారుచేయించారు. గ్రావెల్‌ రహదారి నిర్మాణానికి మార్చి నెలలో రూ.30 లక్షలు మంజూరుచేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ జీవో జారీచేసింది. రోడ్డు వేసే పనిని ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రెవెన్యూ, అటవీ శాఖల అనుమతులు లేకుండా యంత్రాలతో పనులు మొదలుపెట్టారు. భమిడికలొద్ది-చెల్లూరు మధ్య సుమారు ఐదు కిలోమీటర్ల మేర రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. అటవీ శాఖ అనుమతులు లేకుండా మూడు వేల వరకూ టేకు, దండారి, నల్లమద్ది, తెల్లమద్ది, తుమ్మిడి, తెల్లగర్ర వృక్షాలను నేలకూల్చేశారు. ఆనవాళ్లు దొరకకుండా దుంగలుగా మార్చి వేరేచోటకు తరలించారు. కొండలను ఇష్టారాజ్యంగా తవ్వేశారు. బండరాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను కూడా వినియోగించారు. నెలన్నర రోజుల్లోనే 30 అడుగుల వెడల్పుతో గ్రావెల్‌ రోడ్డు నిర్మించారు. అధికార పార్టీ పెద్దలకు చెందిన వ్యవహారం కావడంతో అటవీ శాఖ అధికారులు అభ్యంతరం పెట్టలేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల రెండో తేదీ నుంచి వరుస కథనాలు ప్రచురితం అయిన విషయం తెలిసిందే. రిజర్వు ఫారెస్టులో రహదారి నిర్మాణం, లేటరైట్‌ తవ్వకాలపై సరుగుడు, సుందరకోట పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల గిరిజనులు జాతీయ పర్యావరణవేత్తలకు ఫోన్‌ చేసి వివరించారు. నాతవరం మండలం గునుపూడికి చెందిన మరిడయ్య అనే వ్యక్తి ఎన్జీటీని ఆశ్రయించారు. ఆయన చేసిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్జీటీ...ప్రభుత్వ పెద్దలకు షాక్‌ తగిలేలా ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటుచేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. మైనింగ్‌ అక్రమాలు, రహదారి నిర్మాణంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర అటవీ శాఖ, రాష్ట్ర గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, విశాఖ కలెక్టర్‌తో కమిటీని నియమించింది. రోడ్డు నిర్మాణానికి సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని, పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి, బాధ్యుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. 


ఏడు అంశాలపై విచారణ


జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను పరిశీలిస్తే...లేటరైట్‌ మైనింగ్‌కు అనుమతించిన గనులు, అటవీ శాఖతోపాటు ఎన్‌వోసీ ఇచ్చిన రెవెన్యూ అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటుందనే విషయం స్పష్టమవుతోంది. మొత్తం ఏడు ప్రధాన అంశాలపై విచారణ చేయాలని కమిటీని ఆదేశించింది. రెవెన్యూ రికార్డుల మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారా? అన్నది ఈ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలనిపేర్కొంది. లేటరైట్‌ తవ్వకాల్లో ఉల్లంఘనలు, రిజర్వు ఫారెస్టులో రోడ్డు నిర్మాణంపై ఫిర్యాదుచేసిన మరిడయ్య సమక్షంలోనే ఈ కమిటీ విచారణ చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని విచారించాలని సూచించింది. ఈ సందర్భంగా 1947కు ముందున్న రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించడం...రెవెన్యూ, గనులు, అటవీ శాఖ అధికారులను బెంబేలెత్తిస్తున్నది. 


 చెట్లు నరికి రోడ్డేసినందుకు గతంలో ఒకరికి భారీ జరిమానా


నాతవరం మండలం తొరడలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం కిల్లో లోవరాజు సుమారు పదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకోగా, అన్ని ప్రక్రియల అనంతరం అధికారులు లీజు మంజూరుచేశారు. నాలుగేళ్ల క్రితం లేటరైట్‌ తవ్వకాలు చేపట్టేందుకు సుమారు 1.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం అనుమతులు లేకుండా చెట్లు నరికివేశాడు. తొరడలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం నిబంధనలు ఉల్లంఘించారంటూ సుందరకోటకు చెందిన గిరిజనుడొకరు అప్పట్లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఖనిజ రవాణాకు 1.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణ కోసం కొట్టేసిన చెట్ల ఫొటోలను సమర్పించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు...తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని 2018లో ఆదేశించింది. క్వారీ చుట్టూ ప్రహరీగోడ నిర్మించాలని, రోడ్డు నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు ఒక్కో దానికి రూ.5 వేల వంతున మొత్తం రూ.1.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ, అటవీ శాఖ అధికారులు గనుల్లో తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘించారంటూ మైనింగ్‌ను నిలిపివేశారు. నాటి హైకోర్టు తీర్పు, అధికారుల చర్యలను పర్యావరణవేత్తలు, స్థానిక గిరిజనులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  

Updated Date - 2021-07-31T06:02:32+05:30 IST