విద్యుత్‌ వ్యవస్థకు షాక్‌..!

ABN , First Publish Date - 2021-12-22T08:12:18+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ), పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) నిర్లక్ష్య వైఖరితో మొత్తం విద్యుత్‌ వ్యవస్థ గాడి తప్పే ప్రమాదంలో పడింది.

విద్యుత్‌ వ్యవస్థకు షాక్‌..!

  • గాడి తప్పుతున్న డిస్కమ్‌లు
  • మూడేళ్లుగా లేని ట్యారిఫ్‌ ప్రతిపాదనలు
  • నష్టాల్లోకి పంపిణీ సంస్థలు
  • డిస్కమ్‌లలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం
  • అధికారాలను ఉపయోగించని ఈఆర్‌సీ


హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ), పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) నిర్లక్ష్య వైఖరితో మొత్తం విద్యుత్‌ వ్యవస్థ గాడి తప్పే ప్రమాదంలో పడింది. వీటికి ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలు కూడా తోడవటంతో విద్యుత్‌ వ్యవస్థ పనితీరు దిగజారుతోంది. చట్టబద్ధంగా ఏర్పాటైన ఈఆర్‌సీ పట్ల డిస్కమ్‌లు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. ఏటా నవంబరు 30వ తేదీన డిస్కమ్‌లు తమ వార్షిక ఆదాయ అవసరాలను (ఏఆర్‌ఆర్‌లను) ఈఆర్‌సీకి పంపించాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. కానీ మూడేళ్లుగా ఇది నిలిచిపోయింది. ఏయేటి వ్యాపారానికి ఆయేడు అనుమతి పొందడంలో డిస్కమ్‌ల నిర్లక్ష్యం వాటిని పీకల్లోతు నష్టాల్లోకి నెట్టింది. మరోవైపు డిస్కమ్‌ల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం మితిమీరుతోంది. ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటూ డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. ఏఆర్‌ఆర్‌ దాఖలుకు, ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేదని ఈఆర్‌సీ చెబుతోంది. కానీ గడచిన మూడేళ్లలో ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేయకపోవడానికి డిస్కమ్‌లు చూపించిన కారణాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. శాసనసభ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల కారణంగా ఏఆర్‌ఆర్‌లు పంపలేకపోయామని డిస్కమ్‌లు తాజాగా ఈఆర్‌సీకి నివేదించాయి. ఈఆర్‌సీ కూడా ఈ అంశంలో చురుగ్గా వ్యవహరించడం లేదు. ట్యారిఫ్‌ ప్రతిపాదనలు లేని ఏఆర్‌ఆర్‌లు మాకెందుకంటూ... 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల ఏఆర్‌ఆర్‌లను డిస్కమ్‌లకు తిప్పి పంపించింది. కానీ చట్టపరంగా తనకు లభించిన అధికారాలను ఉపయోగించుకోవడం లేదు. మొత్తంగా ఏయేటికాయేడు పూర్తిచేయాల్సిన ప్రక్రియను ఏళ్ల తరబడి నాన్చుతూ... చివరకు ప్రజలపై ఒకేసారి గుదిబండను మోపడానికి సిద్ధమవుతున్నాయి.


భవిష్యత్తు అంతా నష్టాలే...

ఏ వ్యాపారంలో అయినా భవిష్యతులో లాభాలు వస్తాయనే ఆశ ఉండటం సహజం. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు తయారుచేసుకుంటారు. కానీ ప్రభుత్వ జోక్యంతో డిస్కమ్‌లు భవిష్యత్తులో కూడా నష్టాల్లోనే (లోటులోనే) ఉండే పరిస్థితి ఏర్పడింది. 2019-20, 2020-21 (రెండేళ్ల) కాలానికి రూ.16,041 కోట్ల నష్టాలు వచ్చినట్టు డిస్కమ్‌లు తాజాగా ఈఆర్‌సీకి నివేదించాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందినప్పటికీ 2019-20లో రూ.7,316 కోట్లు, 2020-21లో రూ.8725 కోట్ల మేర నష్టం వచ్చినట్టు తెలిపాయి. ఇక 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో రూ.21,552 కోట్ల మేర నష్టాలు రావొచ్చని అంచనా వేశాయి. దీంతో సమీప భవిష్యత్తులో లాభాల దిశగా అడుగులు వేసే అవకాశాల్లేవని తేలింది. ఐదేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను సవరించలేదు. అయితే విద్యుత్‌ కొనుగోలు వ్యయంతోపాటు నిర్వహణ వ్యయం తగ్గితే చార్జీలు కూడా తగ్గుముఖం పడతాయనేది నిపుణుల వాదన. మూడేళ్లుగా దేశంలో సోలార్‌ పవర్‌ చార్జీలు తగ్గుముఖం పడుతున్నాయి. యూనిట్‌కు రూ.2 లోపే సోలార్‌ పవర్‌ లభిస్తోంది. కానీ సోలార్‌ పవర్‌కు ప్రభుత్వం వైపు నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో 20,410 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లు పెట్టడానికి అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ కేవలం 3,504 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లే రాష్ట్రంలో ఉన్నాయి.


అంతేగాక, 24,835 మెగావాట్ల పవన విద్యుత్‌ ఉత్పాదనకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్రం నివేదికలు చెబుతున్నాయి. కానీ 50.4 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్లకు మాత్రమే రాష్ట్రంలో అనుమతిచ్చారు. ఇంకా పవన విద్యుత్‌ పాలసీనే ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. వీటన్నిటి ఫలితంగా.... ఎక్కువ ఖర్చుపెట్టి ప్రభుత్వ సంస్థల నుంచి కరెంట్‌ను కొనాల్సి రావడం డిస్కమ్‌లకు శాపంగా మారింది. డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమస్యను పెంచాయి. ఏటా కొద్దిగా చార్జీలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి ఉంటే... భవిష్యత్తులో ఒకేసారి కరెంట్‌ చార్జీల భారం పడకుండా ఉండేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఏటా నష్టాలతో డిస్కమ్‌ల పరపతి కూడా గణనీయంగా పడిపోయింది.


9 నెలలు కమిషన్‌ను ఖాళీగా ఉంచారు

చట్టప్రకారం ఒక సభ్యుడు పదవీ విరమణ చేస్తుంటే... ఆ స్థానంలో ఆరు నెలలు ముందునుంచే నియామక ప్రక్రియ చేపట్టాలి. కానీ ప్రభుత్వం ఇద్దరు సభ్యులు, ఒక ఛైర్మన్‌ రిటైర్‌ అయ్యేవరకు ఆ పని చేయలేదు. 9 నెలలపాటు కమిషన్‌ను ఖాళీగా ఉంచారు. డిస్కమ్‌లు ట్యారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించేవరకు ఈఆర్‌సీ ఆగకూడదు. ఏఆర్‌ఆర్‌లను వెబ్‌సైట్‌లో పెట్టి ఉంటే బాగుండేది. 

- శ్రీకుమార్‌, ప్రయాస్‌ గ్రూప్‌


ఈఆర్‌సీ తన అధికారాలు ఉపయోగించుకోవాలి

డిస్కమ్‌లు సకాలంలో ఏఆర్‌ఆర్‌ / ట్యారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించకపోతే సుమోటోగా విచారణ చేసే అఽధికారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి ఉంది. ఏఆర్‌ఆర్‌లపై సుమోటోగా విచారణ జరపాలని 2011లో విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఈఆర్‌సీ తనకున్న అఽధికారాలను ఉపయోగించుకోవాలి. ఏఆర్‌ఆర్‌లపై పబ్లిక్‌ నోటీసులు ఇచ్చి, వెంటనే అభిప్రాయాలు, అభ్యంతరాలు సేకరించాలి. విచారణ జరిపి, ట్యారిఫ్‌ ఉత్తర్వులు ఇవ్వాలి. 

- తిమ్మారెడ్డి, పీపుల్స్‌ మానిటరింగ్‌ గ్రూప్‌


ఈఆర్‌సీ అంటే లెక్కలేనితనం

ప్రభుత్వం ఈఆర్‌సీని ధిక్కరించే ధోరణిలో ఉంది. మూడేళ్లపాటు ట్యారి్‌ఫతో ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేయలేదు. రెవెన్యూ లోటును పూడ్చుతారో డిస్కమ్‌లు చెప్పలేదు. కమిషనే చార్జీలను నిర్ణయించాలనుకోవడం సరికాదు. కమిషన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నమే ఇది. ప్రభుత్వానికి ఈఆర్‌సీపై నిందవేసే ఆలోచన ఉంది. మూడేళ్ల నుంచి ట్యారి్‌ఫను సవరించకపోవడం, సబ్సిడీ పెంచకపోవడం, ఇప్పుడు ఒకేసారి వినియోగదారుల నెత్తిన భారం వేయాలనుకోవడం తప్పు. 

- వేణుగోపాల్‌, విద్యుత్‌ రంగ నిపుణుడు


ప్రభుత్వం కమిషన్‌ను నిర్వీర్యం చేసింది

చట్టప్రకారం ఏఆర్‌ఆర్‌ను దాఖలు చేయడం చాలా కీలకమైన ప్రక్రియ. సకాలంలో వీటిని దాఖలు చేయకుండా రెగ్యులేటరీ కమిషన్‌ను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏయేటికాయేడు అనుమతి తీసుకోకుండా ఈఆర్‌సీని నిర్లక్ష్యం చేసింది. ఈ పద్ధతి మంచిది కాదు. ప్రజల భాగస్వామ్యంతో  చట్టబద్ధ సంస్థలు పనిచేయాలి. ప్రభుత్వం చట్ట ప్రక్రియలను కొనసాగించకపోవడం కరెక్ట్‌ కాదు. 

- నర్సింహారెడ్డి దొంతి, విద్యుత్‌ రంగ విశ్లేషకులు

Updated Date - 2021-12-22T08:12:18+05:30 IST