Abn logo
Sep 25 2021 @ 00:55AM

చింతపల్లిలో ఎమ్మెల్యేకు షాక్‌

చింతపల్లి ఎంపీపీగా గెలుపొందిన వంతల బాబూరావు

పార్టీ విప్‌ని ధిక్కరించిన వైసీపీ సభ్యులు

స్వతంత్ర అభ్యర్థికి మద్దతు

చెరి సగం ఓట్లు రావడంతో లాటరీ

స్వతంత్ర అభ్యర్థిని వరించిన ఎంపీపీ పదవి


చింతపల్లి, సెప్టెంబరు 24: చింతపల్లి ఎంపీపీ ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేకి పరాభవం ఎదురైంది. ఆమె ప్రకటించిన అభ్యర్థిని వ్యతిరేకిస్తూ, అదే పార్టీకి చెందిన మరో సభ్యుడు తిరుగుబాటు చేశారు. దీంతో వైసీసీ సభ్యులు రెండుగా చీలిపోయారు. వీరితోపాటు స్వతంత్రులు ఇతర పార్టీల సభ్యులు తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో చెరి సగం ఓట్లు రావడంతో ఆర్‌ఓ లాటరీ తీశారు. తిరుగుబాటు అభ్యర్థిని అదృష్టం వరించింది. వైసీపీకి కనీసం వైస్‌ ఎంపీపీ పదవి కూడా దక్కలేదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సమావేశ మందిరంలోనే ఉన్నారు. ఆమె సమక్షంలోనే వైసీపీ సభ్యులు పార్టీ విప్‌ని ధిక్కరించి, తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు తెలపడం విశేషం.


చింతపల్లి మండలంలో 20 ఎంపీటీసీలు వుండగా వైసీపీకి పది, కాంగ్రెస్‌ రెండు, టీడీపీ, సీపీఐ ఒక్కొక్కటి, స్వతంత్రులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ఇతర సభ్యుల్లో ఒక్కరు మద్దతు ఇస్తే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను వైసీపీ గెలుచుకుంటుంది. ఎంపీపీ పదవికి తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనూషాదేవిని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఎంపిక చేశారు. కానీ చింతపల్లి-3 ఎంపీటీసీ సభ్యుడు వంతల బాబూరావు తీవ్రంగా విభేదించారు. తాను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నానని, తనకు ఎంపీపీ పదవి ఇవ్వాలని, లేదంటే స్వతంత్రంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అన్నట్టుగానే ఆయన ఎంపీపీ పదవికి పోటీ పడ్డారు. వైసీపీ అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన అనూషాదేవికి అదే పార్టీకి చెందిన సాగిన వెంగళరావు, దాసరి ధారలక్ష్మి పద్మ, చింతాడ జయలక్ష్మి, రావుల నాగమణితోపాటు కాంగ్రెస్‌కు చెందిన వనుము పద్మ, సీపీఐకి చెందిన సెగ్గె సత్తిబాబు, స్వతంత్రులు బచ్చెలి మత్స్యమ్మ, పాంగి బాబూరావు, లువ్వాబు మీనాకుమారి మద్దతు తెలిపారు. వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి వంతల బాబూరావుకు వైసీపీకి చెందిన కొర్ర సూరిబాబు, జర్త రూతు, తాంబెలి మోహన్‌రావు, గోపీనాయక్‌ శారద, టీడీపీకి చెందిన కిల్లో అప్పారావు, కాంగ్రెస్‌ సభ్యురాలు గెమ్మెలి పార్వతి, స్వతంత్రులు గెమ్మెలి సోని, మఠం రాజులమ్మ, పొట్టిక లోవరాజు మద్దతు తెలిపారు. దీంతో ఇద్దరికి చెరో పది ఓట్లు వచ్చాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్‌ అధికారి వి.రవీంద్రనాథ్‌ లాటరీ నిర్వహించగా వంతల బాబూరావు పేరు వచ్చింది. దీంతో అతను ఎంపీపీగా ఎన్నికైనట్టు ఆర్‌వో ప్రకటించారు. వైస్‌ ఎంపీపీ పదవికి వైసీపీ తరపున పోటీ చేసిన ఎ.శనివారం ఎంపీటీసీ సాగిన వెంగళరావుకు 9 ఓట్లు రాగా, తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన కొత్తపాలెం-1 ఎంపీటీసీ గోపినాయక్‌ శారదకు 11 ఓట్లు వచ్చాయి. దీంతో శారద  వైస్‌ ఎంపీపీగా ఎన్నికైనట్టు ప్రకటించారు.