జేసీ ప్రభాకర్‌రెడ్డికి షాక్

ABN , First Publish Date - 2020-08-07T23:05:30+05:30 IST

టీడీపీ నేతలు ఊహించినట్లే జరిగింది. జిల్లాలోఉదయం నుంచి పోలీసుల తీరుపై టీడీపీ సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డికి షాక్

అనంతపురం: టీడీపీ నేతలు ఊహించినట్లే జరిగింది. జిల్లాలోఉదయం నుంచి పోలీసుల తీరుపై నేతలు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నేతలు అనుకున్నట్లే పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఏకంగా ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసు నమోదు చేశారు. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప నుంచి వస్తున్న ప్రభాకర్‌రెడ్డి వాహనాలను సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకున్నారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి, సీఐ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్రకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి రూరల్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డిపై 189,353,506 r/w 34 IPC 3(2)(va),3(1)r,3(1)s, sc,st poa act ,52 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 


ఈ రోజు ఉదయం నుంచి అనంతపురం కేంద్రంగా పెద్ద హైడ్రామా నడిచింది. అందేంటంటే... వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగాల కేసులో ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిపై అనంతపురం కేసు నమోదు చేశారు. అయితే అనంతపురం జిల్లా కోర్టు వీరిద్దరికీ కండీషన్ బెయిలిచ్చింది. కండీషన్ బెయిల్‌ నిబంధనల ప్రకారం ఈ ఉదయం జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సంతకాలు చేయడం కోసం వచ్చారు. సంతకాలు పూర్తయినా ఇంకా స్టేషన్‌లోనే కూర్చుండబెట్టారు. దీంతో పోలీసుల తీరుపై ప్రభాకర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రెడ్డి అనుకున్నట్లే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇప్పటికే కడప సెంట్రల్ జైలు వద్ద కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారని, ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. వీరితో పాటుగా మరో 31 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలు విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా వచ్చారు.


గతంలో పోలీసులు వర్సెస్ జేసీ బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. తిరిగి ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు... ఇప్పటికే తాడిపత్రి పట్టణానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. అనంతపురం నుంచి స్పెషల్ పార్టీ పోలీసులు, వజ్ర వాహనం వచ్చింది. ఇప్పడు ఉన్న బలగాలనే కాకుండా ఆదనపు బలగాలను తాడిపత్రికి అధికారులు తరలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నమోదు కేసులతో పాటు.. ఇతర కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2020-08-07T23:05:30+05:30 IST