హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌కు షాక్‌

ABN , First Publish Date - 2020-12-04T06:04:00+05:30 IST

దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌కు ఊహించని షాక్‌ తగిలింది. బ్యాంక్‌ కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీతో పాటు డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల ప్రారంభంపై ఆర్‌బీఐ తాతాల్కిక నిషేధం విధించింది.

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌కు షాక్‌

  • కొత్త క్రెడిట్‌ కార్డుల జారీతోపాటు డిజిటల్‌ సేవల ప్రారంభంపైౖ నిషేధం 
  • బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయాల నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఆర్‌బీఐ 


ముంబై/న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌కు ఊహించని షాక్‌ తగిలింది. బ్యాంక్‌ కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీతో పాటు డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల ప్రారంభంపై ఆర్‌బీఐ తాతాల్కిక నిషేధం విధించింది. గడిచిన రెండేళ్లకు పైగా కాలంలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవలకు పలుమార్లు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే (గత నెల 21న) హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇతర చెల్లింపులతో పాటు డిజిటల్‌ విభాగ సేవలన్నీ ఉన్నట్టుండి నిలిచిపోయాయి.


దాంతో బ్యాంక్‌ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2018 డిసెంబరులో బ్యాంక్‌ ప్రారంభించిన కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ కొద్ది గంటలకే క్రాష్‌ అయింది. అప్లికేషన్‌ యూజర్ల రద్దీ నిర్వహణలో సర్వర్లు  విఫలమవడమే కారణమని అప్పట్లో బ్యాంక్‌ వెల్లడించింది. సరిగ్గా సంవత్సరం తర్వాత ఖాతాదారుల అకౌంట్లలో జీతాలు జమయ్యే సమయంలో బ్యాంక్‌ ఆన్‌లైన్‌ చానళ్లన్నీ ఉన్నట్టుండి నిలిచిపోయాయి. అప్పటి నుంచే బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవల అంతరాయాలపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. సాధారణంగా ఆర్‌బీఐ ఈ తరహా వైఫల్యాలకు బ్యాంక్‌లపై నగదు జరిమానాలు విధిస్తుంటుంది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ విషయంలో మాత్రం మరిన్ని సేవలందించకుండా నిషేధించడం గమనార్హం.  


విద్యుత్‌ వైఫల్యమే కారణం: హెచ్‌డీఎ్‌ఫసీ 

గత నెలలో సేవల అంతరాయానికి తమ ప్రైమరీ డేటా సెంటర్‌లో విద్యుత్‌ వైఫల్యమే కారణమని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ 2.0 ప్రణాళికలో భాగంగా కొత్త సేవల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్‌బీఐ నిర్దేశించిందంటూ గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు బ్యాంక్‌ సమాచారం అందించింది. అంతేకాదు, మరిన్ని ఐటీ అప్లికేషన్లను ఉపయోగించాల్సిన సేవలతో పాటు కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీని సైతం నిలిపివేయాలని ఆదేశాలందాయని బ్యాంక్‌ తెలిపింది. అలాగే, లోపాలను పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని బ్యాంక్‌ బోర్డుకు ఆర్‌బీఐ సూచించింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ కొత్త సీఈఓగా అక్టోబరులో బాధ్యతలు చేపట్టిన శశిధర్‌ జగదీశన్‌కు ఎదుదైన తొలి సవాలిది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌కు 1.49 కోట్ల క్రెడిట్‌ కార్డు కస్టమర్లు, 3.38 కోట్ల డెబిట్‌ కార్డు ఖాతాదారులున్నారు. 


షేరు 2 శాతం పతనం

ఆర్‌బీఐ వేటు వేయడంతో బీఎ్‌సఈలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేరు ధర 2.13 శాతం క్షీణించి రూ.1,377.05కు పడిపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 2.32 శాతం వరకు పతనమైనప్పటికీ చివర్లో కాస్త కోలుకుంది. 


ఎస్‌బీఐ యోనో యాప్‌ డౌన్‌ 

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐకి చెందిన డిజిటల్‌ యాప్‌ యోనో సేవలకు గురువారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్‌బీఐ యోనో సేవల వైఫల్యంపై కస్టమర్లు సోషల్‌ మీడియా ద్వారా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. యోనోకు బదులు కస్టమర్లు ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో లైట్‌ యాప్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఈ వారం తొలినాళ్లలోనూ ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత నెలలోనూ బ్యాంక్‌ ఆన్‌లైన్‌ వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 

Updated Date - 2020-12-04T06:04:00+05:30 IST