మందుబాబులకు షాక్‌!

ABN , First Publish Date - 2022-05-19T07:47:34+05:30 IST

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

మందుబాబులకు షాక్‌!

  • మద్యం ధరలు పెంచిన సర్కారు
  • 10 నుంచి 20 శాతం పెంపు?
  • నేటి నుంచే కొత్త ధరల అమలు
  • షాపుల్లోని స్టాక్‌ సీజ్‌ చేసిన అధికార్లు
  • తక్షణ రాబడి కోసమే ధరల పెంపు

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. మద్యం ధరలను పెంచాలంటూ రేట్‌ కాంట్రాక్ట్‌ నెగోషియేషన్‌ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిటీ సిఫారసుల మేరకే ధరలు పెంచినట్లు సర్కారు వెల్లడించింది. ధరల పెంపును ఆసరాగా తీసుకొని, అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని.. అందుకే పెంచిన ధరల వివరాలను వెల్లడించలేదని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు బుధవారం దుకాణదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే సదుపాయాన్ని కూడా నిలిపివేశారు. అయితే 28 బ్రాండ్ల ధరలు 10 నుంచి 20ు పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఒక అంచనా ప్రకారం.. మద్యం క్వార్టర్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.80, ఒక్కో బీరుపై రూ.10-20 వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2600 మద్యం దుకాణాలు ఉన్నాయి. బుధవారం రాత్రి ఈ దుకాణాల్లో విక్రయాలు ముగిసిన తర్వాత ఎక్సైజ్‌ అధికారులు మద్యాన్ని సీజ్‌ చేశారు.


గురువారం ఉదయం నిల్వలను లెక్కించి, కొత్త ధరల ప్రకారం ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను వసూలు చేయనున్నారు. ఎక్సైజ్‌ అధికారులంతా బుధవారం రాత్రి కార్యాలయాల్లోనే ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, దుకాణాల్లో నిల్వ ఉన్న మద్యాన్ని సీజ్‌ చేయడాన్ని యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం సొమ్ము చెల్లించి, తాము బఫర్‌ స్టాకును ఉంచుకుంటామని.. వాటికి కొత్త రేట్ల ప్రకారం చెల్లించాలనడం సరికాదని వాపోతున్నారు. ధరలు ఎంత మేరకు పెంచుతున్నారో తమకూ తెలియదని అంటున్నారు.


తక్షణ ఆదాయం కోసమే.. 

రాష్ట్ర ప్రభుత్వం నిధుల కటకటతో అల్లాడిపోతోంది. కొత్త రుణాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరణలను సరిగా సమర్పించకపోవడంతో ఏప్రిల్‌, మే నెలలో కూడా అవసరమైన మేరకు రుణాలు తీసుకోలేకపోయింది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదుర్కొంటోంది. బిల్లులు కూడా పెండింగులో ఉన్నాయి. ఇటీవల ప్రాజెక్టులకు కనీసం రూ.5 వేల కోట్లయినా విడుదల చేయాలని సీఈలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇక్కట్లలో ఉన్న సర్కారు.. ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యంగా చెల్లిస్తున్న దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ సర్కారు.. తక్షణమే ఖజానాకు ఆదాయం సమకూర్చుకునే మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఆబ్కారీ శాఖపై కన్ను పడింది. ఇప్పటికిప్పుడు కాసులు రావాలంటే ‘మందే’ మార్గమని గుర్తించింది. అంతే మద్యం ధరలను పెంచేసింది.

Updated Date - 2022-05-19T07:47:34+05:30 IST