అఖిలేశ్‌కు మరదలి షాక్‌

ABN , First Publish Date - 2022-01-20T07:04:26+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ పెద్ద సంఖ్యలో నేతల చేరికతో జోరు మీదున్న సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)కి పెద్ద షాక్‌ తగిలింది.

అఖిలేశ్‌కు మరదలి షాక్‌

బీజేపీలో చేరిన అపర్ణా యాదవ్‌



లఖ్‌నవ్‌/న్యూఢిల్లీ/చండీగఢ్‌/పణజి/ముంబై, జనవరి 19: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ పెద్ద సంఖ్యలో నేతల చేరికతో జోరు మీదున్న సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)కి పెద్ద షాక్‌ తగిలింది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మరదలు అపర్ణాయాదవ్‌.. బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. ములాయం రెండో భార్య సాధనా గుప్తా కుమారుడైన ప్రతీక్‌ యాదవ్‌ సతీమణే అపర్ణాయాదవ్‌. 2017 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ తరఫున ఆమె లఖ్‌నవూ కంటోన్మెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు. కాగా, అపర్ణ చేరిక అనంతరం బీజేపీ నేతలు అఖిలేశ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలరంటూ ఎద్దేవా చేశారు. తాము టికెట్లు ఇవ్వలేని వారికి బీజేపీ పిలిచి టికెట్‌ ఇస్తామనడం సంతోషకరమని, అపర్ణ చేరికతో తమ పార్టీ సోషలిస్టు భావజాలం బీజేపీలోనూ వ్యాప్తి చెందుతుందని అఖిలేశ్‌ అన్నారు. ఇక.. అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్‌ తొలిసారి పోటీ చేసే సూ చనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయా ల్సి ఉన్నందున.. ఎమ్మెల్యేగా పోటీ చేయనని ఆయన గతంలో ప్రకటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానంటున్న అఖిలేశ్‌.. పోటీకి ఎందుకు వెనకాడుతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తుండటంతో అఖిలేశ్‌ ఆజంగఢ్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. 


బీజేపీలోకి ఇద్దరు ఎస్పీ ఎమ్మెల్యేలు..

తాజాగా ఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరారు. వీరిలో ఒకరు ఇప్పటికే ఎస్పీ రెబల్‌ ఎమ్మెల్యేగా ముద్రపడిన నితిన్‌ అగర్వాల్‌ కాగా, మరొకరు జలాలాబాద్‌ ఎమ్మెల్యే శరద్‌వీర్‌ సింగ్‌. మరోవైపు అప్నాదళ్‌, నిషాద్‌ పార్టీలతో ఎన్నికల పొత్తు ఖరారైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించేది త్వరలో ప్రకటిస్తామన్నారు. కాగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని రైతు ఉద్యమ నేత రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. ఇక.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికీ ఏడాదికి రూ.18 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తామని అఖిలేశ్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘెల్‌ ప్రకటించారు. మరో వైపు.. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి.. పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ ఛన్నీ మేనల్లుడు భూపీందర్‌సింగ్‌ తో పాటు మరొకరి ఇంటిపై జరిపిన దాడుల్లో రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు బుధవారం వెల్లడించారు. ఇక.. వచ్చే నెలలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఉమ్మడిగా బరిలోకి దిగనున్నాయి. ఇక.. దివంగత మహాదళపతి జనరల్‌ బిపి న్‌ రావత్‌ సోదరుడు విజయ్‌ రావత్‌ బుధవారం బీజేపీలో చేరారు. మరోవైపు.. మహారాష్ట్రలో మొత్తం 106 నగర పంచాయతీలకు సంబంధించి 1802 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ అత్యధికంగా 384 చోట్ల విజయం సాధించింది. 344 సీట్లు గెలిచి, ఎన్సీపీ రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి విజయం సాధించనుందని జీ న్యూస్‌- డిజైన్‌ బాక్స్‌డ్‌ ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించింది. బీజేపీకి 41ు ఓట్లు, 245-267 సీట్లు రావొచ్చని పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 34ు ఓట్లు, 125-148 సీట్లతో రెండో స్థానంలో నిలవనుంది. కాంగ్రె్‌సకు 3-7 సీట్లు, బీఎస్పీకి 2-6 సీట్లు వస్తాయని పోల్‌ అంచనావేసింది.

Updated Date - 2022-01-20T07:04:26+05:30 IST