CM YS Jagan చేసిన ఆ ఒక్క ప్రకటనతో.. 25 లక్షల మందికి షాక్‌!

ABN , First Publish Date - 2022-01-09T07:09:58+05:30 IST

CM YS Jagan చేసిన ఆ ఒక్క ప్రకటనతో.. 25 లక్షల మందికి షాక్‌!

CM YS Jagan చేసిన ఆ ఒక్క ప్రకటనతో.. 25 లక్షల మందికి షాక్‌!

  • నిరుద్యోగులపై ‘పదవీ విరమణ’ పిడుగు 
  • సర్కారు కొలువుపై ఆశలు ఆవిరి 
  • అప్పులు చేసి ఏళ్ల తరబడి కోచింగ్‌ 
  • 3 లక్షల ఉద్యోగాల భర్తీకి జగన్‌ హామీ 
  • ఖాళీగా ఉన్నవి, పదవీ విరమణ చేసినవి.. 
  • అన్నీ కలిపి 2.32 లక్షల ఉద్యోగాలని ప్రకటన 
  • మెగా డీఎస్సీ వేస్తామన్న వాగ్దానానికి నీళ్లు 
  • ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలూ అంతే 
  • ఉద్యోగ కేలండర్‌ విడుదల ఒట్టి మాటే 
  • సర్కారు తీరుపై నిరుద్యోగుల మండిపాటు 
  • రెండున్నరేళ్లలో ఇచ్చిందేమీ లేదని విమర్శలు 

ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ సీఎం జగన్‌ చేసిన ప్రకటన నిరుద్యోగులకు శరాఘాతమైంది. పోటీ పరీక్షల కోసం అప్పులు చేసి మరీ ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటున్న వీరంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సర్కారు కొలువు సాధించాలని కలలు కంటున్న దాదాపు 25లక్షల మంది నిరుద్యోగుల ఆశలు ప్రభుత్వ నిర్ణయంతో ఆవిరయ్యాయి. అధికారంలోకి వస్తే 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పాదయాత్ర సమయంలో జగన్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం 25లక్షల మంది నిరుద్యోగులతో పాటు దాదాపు కోటి మంది వరకూ వారి కుటుంబ సభ్యుల ఆశలను గల్లంతు చేసింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా... తాజా నిర్ణయంతో ఇక ఇప్పట్లో ఉద్యోగ ప్రకటనలు రావేమోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీల ప్రకారం 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. ‘‘దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున్న మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఏవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తానో ఇవాళ మీకు చెప్తాను. అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా నేను చేయబోయేది 2.30లక్షల ఉద్యోగాలు విడుదల చేస్తాను. అంతేకాకుండా ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి 1న ఉద్యోగ కేలండర్‌ విడుదల చేస్తా’’ అని అప్పట్లో జగన్‌ ప్రకటించారు. ‘‘డిగ్రీలు రాగానే ఉద్యోగం రాక పిల్లలు పడుతున్న బాధలు చూశా. కోచింగ్‌ సెంటర్ల మీద వేలకు వేలు తగలేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 1.42లక్షలు. పైగా ఈ ఐదేళ్లలో పదవీ విరమణ చేసినవాళ్లు 90 వేలు. అన్నీ కలిపితే అక్షరాలా 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. మీ కష్టాలను చూశా. మీ బాధలను విన్నా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా. నేను విన్నా. నేనున్నా’’... అని పలుచోట్ల సభల్లో ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ వేస్తామని, ఏటా పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన నిరుద్యోగులు... ఈ పోస్టులన్నీ కలిపి సుమారు 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. పైగా ఇందులో చాలావరకు పోస్టులు సాధారణంగా భర్తీ చేసేవే. పోలీసు, ఉపాధ్యాయ ఉద్యోగాలను రెండు, మూడేళ్లకోసారి భర్తీ చేయడం ఆనవాయితీ. కానీ ఇప్పటివరకు సర్కారు ఆ ఊసే ఎత్తలేదు. పైగా ఇప్పుడు రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచడం దారుణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు.


సచివాలయ పోస్టులకు 26లక్షల దరఖాస్తులు 

రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు 26లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. అందులో 22లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షలకు, పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు మాత్రం ఈ పోస్టులకు దరఖాస్తు చేయలేదు. వారిని కూడా కలిపితే 30లక్షలకు పైగా నిరుద్యోగులు ఉంటారని అంచనా. వీరంతా ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ నోటిఫికేషన్‌ ఒక్కటీ రాలేదు. ఇచ్చిన హామీని జగన్‌ అమలు చేయలేదంటూ నిరుద్యోగులు ఆవేదన చెందుతుండగా, ఇప్పుడు రిటైర్మెంట్‌ వయసు పెంపు నిర్ణయం వారిని మరింత కుంగదీస్తోంది. 


భర్తీ చేసే ఆలోచన లేదేమో..

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏదో ఒకరోజు నోటిఫికేషన్‌ ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నామని, కానీ ఇప్పుడు రిటైర్మెంట్‌ వయసు పెంచడంతో ఇక ఉద్యోగాలిచ్చే యోచన ఈ సీఎంకు లేదేమోనని నిరుద్యోగులు వాపోతున్నారు. రిటైరయిన ఉద్యోగాలే 90వేలు ఉన్నాయని మూడేళ్ల క్రితం ఆయనే ప్రకటించారు. అప్పటినుంచి పదవీ విరమణ పొందినవారు 60వేలకు పైనే ఉంటారు. అంటే జగన్‌ లెక్కల ప్రకారమే రిటైరైన ఉద్యోగులు 1.5 లక్షల మంది. ఆయన మాటిచ్చిన మేరకు ఇవన్నీ భర్తీ చేయాలి. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా... ఇలాగే నడిపించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.


కొత్త ఉద్యోగాలు లేవు

ఏటా లక్షల మంది విద్యార్థులు చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగాల వేటలో పడతారు. సాధారణంగా వీరిలో ఎక్కువ భాగం ప్రైవేటు ఉద్యోగాల్లో చేరిపోతుంటారు. అయితే గడిచిన రెండున్నరేళ్లలో కొవిడ్‌ ప్రభావం, ప్రభుత్వ విధానాలతో కొత్త ఉద్యోగాలు లేవు. రాష్ట్రానికి గతంలో వచ్చినంత వేగంగా పరిశ్రమలు రాలేదు. ఒప్పందాలు చేసుకున్నవీ వెనక్కి వెళ్లిపోయాయి. ఐటీ రంగంలో ఉన్న కంపెనీలు వెళ్లిపోవడం తప్ప కొత్తవి వచ్చిన జాడ లేదు. యువతకు స్వయం ఉపాధి కోసం గతంలో ఇచ్చే రుణాలు, పథకాలు అన్నీ ఈ ప్రభుత్వం రద్దు చేసేసింది. నవరత్నాల పాట తప్ప స్వయం ఉపాధి ఊసే లేదు. దీంతో ఉద్యోగ అవకాశాలే లేకుండా పోయాయి. దీనికితోడు ఇప్పుడు జగన్‌ సర్కారు తీసుకున్న పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయంతో నిరుద్యోగ యువత ఉక్కిరిబిక్కిరవుతోంది. 

Updated Date - 2022-01-09T07:09:58+05:30 IST