శ్రీవారి దయతోనే..: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాన్‌గా అవకాశంపై శోభారాజు ఆనందం

ABN , First Publish Date - 2020-10-01T16:56:34+05:30 IST

శ్రీవారి దయతోనే తనకు టీటీడీలో ఆస్థాన సంగీత విద్వాన్‌గా అవకాశం దక్కిందని..

శ్రీవారి దయతోనే..: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాన్‌గా అవకాశంపై శోభారాజు ఆనందం

తిరుపతి(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దయతోనే తనకు టీటీడీలో ఆస్థాన సంగీత విద్వాన్‌గా అవకాశం దక్కిందని శోభారాజు ఆనందం వ్యక్తం చేశారు.   బుధవారం రాత్రి ఆమె ఫోన్‌లో ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రతినెలా రెండవ శనివారం శ్రీవారి సేవలో పాల్గొనడమే పెద్ద అదృష్టంగా భావించానన్నారు.ఆ అదృష్టం జీవితాం తం కొనసాగితే చాలని కోరుకుంటు న్న తరుణంలో అనుకోకుండా దేవ స్థానం ఆస్థాన సంగీత విద్వాన్‌గా అవకాశం కల్పించడంతో తన సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయన్నారు.ఈ అవకాశం రావడం వల్ల శ్రీవారిని స్తుతిం చిన అన్నమయ్య సంకీర్తనల ప్రచారం మరింత నిబద్ధతతో కొనసాగిస్తానన్నారు. మరింత సృజన్మాతకంగా యువతను ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టేందుకు టీటీడీ సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అవకాశం కల్పించిన టీటీడీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


తిరుమల తిరుపతి దేవస్థానాలతో 44 ఏళ్ళ అనుబంధం

జీవితమంతా అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికే అంకితమైన శోభా రాజుకు ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. తిరుమల-తిరుపతి దేవస్థానాల ఆస్థాన సంగీత విద్వాన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఆమెకు టీటీడీ నుంచీ నియామకపుటుత్తర్వులు అందాల్సి వుంది.అవి అందిన నాటి నుంచీ సంబంధిత పదవిలో ఆమె రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు.కాగా శోభారాజుకు దేవస్థానంతో 44ఏళ్ళ అనుబంధం వుంది. 1970-72లో ఆమె తిరుపతిలో టీటీడీకి చెందిన పద్మావతీ మహిళా కళాశాలలో ఇంటర్‌ చదివారు.తిరుపతి త్యాగరాయ గానసభలో అన్నమయ్య వర్ధంతి ఆరాధనా ఉత్సవాలకు వచ్చిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు సాలూరు రాజేశ్వరరావుకు పద్మావతీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ పశుపతి ఆమెను చూపించి అన్నమయ్య సంకీర్తనలు బాగా పాడుతోందంటూ పరిచయం చేశారు. ఆ సభలోనే సాలూరు రాజేశ్వరరావు తను స్వరపరిచిన ‘‘ శ్రీవెంకటాచల వాసా’’.... ‘‘ జోజో అచ్యుతానంద జోజో ముకుందా’’ అన్న సంకీర్తనలను ఆమెతో పాడించారు. పాడిన తీరు నచ్చడంతో మద్రాసుకు ఆహ్వానించి హెచ్‌ఎంవీ స్టూడియోలో పాటలు పాడించారు. ఆ గ్రామ్‌ఫోన్‌ రికార్డింగులు 1972లో టీటీడీయే విడుదల చేయడం విశేషం.క్రమంగా అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించే గాయనిగా పేరు తెచ్చుకోవ డంతో ఆ పాటలపై పరిశోధన కోసం 1976లో ఆమెకు టీటీడీ స్కాలర్‌ షిప్‌ మంజూరు చేసింది. అప్పటి టీటీడీ ఈవో అన్నారావు బాగా ప్రోత్సహించడంతో రెండేళ్ళలో ఆమె సాగించిన కృషికి 1978లో అన్నమాచార్య పాటల ప్రచారం కోసమే ప్రత్యేకించి ఆమెను తొలి కళాకారిణిగా టీటీడీ  నియమించింది. ఆ హోదాలో ఆమె 1982 కాగా కొనసాగారు. అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికే జీవితాంతం పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాత హైదరాబాదు వెళ్ళి ఆసక్తి వున్న యువతకు శిక్షణ ఇస్తున్నారు.1998లో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో స్థలం కేటాయించడంతో శ్రీవారి ఆలయం నిర్మించారు. గర్భగుడిలో శ్రీవారితో పాటు అన్నమయ్య విగ్రహం కూడా ప్రతిష్టించారు. ఆ తరహా ఆలయం ప్రపంచంలో అదొక్కటే. 2009లో అప్పటి టీటీడీ ఈవో రమణాచారి ప్రతి నెలా రెండవ శనివారం శ్రీవారి ఆలయంలో ఊంజల్‌ సేవకు సంకీర్తన ఆలపించే అవకాశం ఆమెకు కల్పించారు. ఈ ఏడాది మార్చి నుంచీ లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ ఉధృతుల కారణంగా ఆమె శ్రీవారి సన్నిధికి రావడం లేదు.కాగా అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి శోభారాజు చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.


Updated Date - 2020-10-01T16:56:34+05:30 IST