Shoaib Akhtar: సొంతజట్టుపై విరుచుకుపడిన పాక్ మాజీ పేసర్

ABN , First Publish Date - 2021-07-11T22:17:38+05:30 IST

ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు వన్డేల

Shoaib Akhtar: సొంతజట్టుపై విరుచుకుపడిన పాక్ మాజీ పేసర్

లండన్: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడిన పాకిస్థాన్ సిరీస్‌ను కోల్పోయింది. 8న కార్డిఫ్‌లో జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించిన ఇంగ్లండ్.. నిన్న లార్డ్స్‌లో జరిగిన రెండో వన్డేలో 52 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 13న బర్మింగ్‌హామ్‌లో మూడో వన్డే జరగనుంది. 


పాక్ జట్టు ఘోర వైఫల్యాలపై ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. పాకిస్థాన్ ‘సగటు’ క్రికెట్ ఆడుతోందని అన్నాడు. ఇది ఇలాగే కొనసాగితే బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు 3-0తో ఇంగ్లండ్ చేతిలో ఓడడం ఖాయమని జోస్యం చెప్పాడు. బంతికి ఒక పరుగు చేయాల్సిన స్థితిలోనూ అంత కష్టపడడం ఏంటని ప్రశ్నించాడు. ఇది చాలా చాలా సగటు ప్రదర్శన అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చూస్తుంటే పాక్ జట్టుకు వైట్‌వాష్ తప్పేలా లేదన్నాడు.


పాక్ బ్యాటింగ్ ఎప్పుడూ నిరాశ పరుస్తూనే ఉందని, అది ఇప్పుడు కూడా కొనసాగుతోందని అన్నాడు. ఇలాంటి జట్టును చూశాక ఏ పిల్లాడైనా క్రికెట్ ఆడతాడా? అని అక్తర్ ప్రశ్నించాడు. చూస్తుంటే ఇంతా పీసీబీ ప్లాన్‌లా ఉందని, ఎవరూ క్రికెట్‌ను చూడకపోతే, ఎవరూ క్రికెట్‌ ఆడకపోతే ఏ పనిచేయకుండా హాయిగా ఉండొచ్చని పీసీబీ భావిస్తున్నట్టుగా ఉందని అక్తర్ విరుచుకుపడ్డాడు. 

Updated Date - 2021-07-11T22:17:38+05:30 IST