Madhya Pradesh : కాంగ్రెస్ కుట్ర బయటపడింది : శివరాజ్ సింగ్ చౌహాన్

ABN , First Publish Date - 2022-05-18T21:18:16+05:30 IST

మధ్య ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతులు

Madhya Pradesh : కాంగ్రెస్ కుట్ర బయటపడింది : శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్ : మధ్య ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతులు (OBCs)కు రిజర్వేషన్ కల్పించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chowhan) కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. OBC కోటాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని, అది ఇప్పుడు స్పష్టంగా వెల్లడైందని చెప్పారు. 


కాంగ్రెస్ (Congress) మధ్య ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కమల్‌నాథ్ (Kamalnath), ఆ పార్టీ నేతలు సామాన్యులకు ఇబ్బందులను సృష్టించేందుకు కుట్ర పన్నారని చౌహాన్ ఆరోపించారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం లేదని బీజేపీపై ఆరోపణలు చేశారన్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ బండారం బయటపడిందన్నారు. రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు నిర్వహించవచ్చునని సుప్రీంకోర్టు చెప్పినపుడు కాంగ్రెస్ నేతలు ఏమీ పరవాలేదని చెప్పారన్నారు. అయితే ఓబీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించరాదని తాము దృఢనిశ్చయంతో పోరాడామని చెప్పారు. పురపాలక సంఘాలవారీగా అధ్యయన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం అడిగిందని, దానిని తాము 24 గంటల్లో సమర్పించామని చెప్పారు. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు చెప్పిందన్నారు. 


ముగ్గురు సభ్యులతో కూడిన ఓబీసీ కమిషన్ గత ఏడాది సెప్టెంబరులో సమర్పించిన నివేదికకు అనుగుణంగా ఓబీసీలకు సీట్లను కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసేందుకు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ సీటీ రవి కుమార్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అంతకుముందు ఇచ్చిన ఆదేశాల్లో సరైన అధ్యయనంతో కూడిన సమాచారం లేకుండా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడానికి తిరస్కరించింది. ఓబీసీల జనాభా, వారి ప్రాతినిధ్యంపై కచ్చితమైన సమాచారం లేకుండా ఈ ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోమని తెలిపింది. 


మధ్య ప్రదేశ్ ఓబీసీ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఓబీసీల జనాభా 48 శాతం ఉంది. 35 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించవచ్చునని ఈ నివేదిక తెలిపింది. ఈ కసరత్తు ఓ వారంలో పూర్తి కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 23,263 స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. 


ఇదిలావుండగా, ఈ కమిషన్ నివేదిక కచ్చితత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే తాజా తీర్పు రాజకీయంగా గొప్ప విజయంగా బీజేపీ పరిగణిస్తోంది. మహారాష్ట్రలోని శివసే, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఒప్పించడంలో విజయం సాధించలేకపోతోందని చెప్తోంది. 


Updated Date - 2022-05-18T21:18:16+05:30 IST