బహుముఖ ప్రజ్ఞాశాలి

ABN , First Publish Date - 2020-06-07T05:37:23+05:30 IST

అధ్యాపకుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, సినీ రచయితగా బొల్లిముంత శివరామకృష్ణ అందించిన సేవలు నిరుపమానం.

బహుముఖ ప్రజ్ఞాశాలి

  • బొల్లిముంత శివరామకృష్ణ వర్ధంతి నేడు


అధ్యాపకుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా,  సినీ రచయితగా బొల్లిముంత శివరామకృష్ణ అందించిన సేవలు నిరుపమానం. ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞకు అసలైన అర్ధం తెలిపిన వ్యక్తి ఆయన. 1920 నవంబర్‌ 27న గుంటూరు జిల్లా వేమూరు మండలం చదలవాడ గ్రామంలో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించారు శివరామకృష్ణ. చదలవాడలో ఉన్నత విద్యను పూర్తి చేసి, గుంటూరులో హయ్యర్‌ సెకండరీ గ్రేడ్‌ టైనింగ్‌ తీసుకొన్నారు. ఆ సమయంలోనే విద్యార్ధి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కమ్యూనిస్టు కార్యకర్త కూడా కావడంతో తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని ‘దేశం ఏమయ్యేట్టు?’,  ‘వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాశారు. అలాగే చదలవాడ పిచ్చయ్య, త్రిపురనేని రామస్వామితో కలసి అరసం మహాసభల్లో ఉత్సాహంతో పాల్గొనేవారు. 


తండ్రి అక్యయ్య చదలవాడలో పాఠశాల ప్రారంభించడంతో అందులోనే అధ్యాపకునిగా చేరారు బొల్లిముంత. ఆ సమయంలో ఆయన మీద ‘జస్టిస్‌ పార్టీ’, త్రిపురనేని గోపీచంద్‌ల ప్రభావం ఎక్కువగా ఉండేది. దాంతో  1945లో అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి  వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి  చల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా మొదలైన భూపోరాటంలో పాల్గొన్నారు బొల్లిముంత. ఈ పోరాట అనుభవాలతో తన తొలి రాజకీయ నవల ‘మృత్యుంజయుడు’ రాశారు బొల్లిముంత. ప్రజా నాట్యమండలి పునరుద్దరణ సమయంలో శ్రీకాంత్‌తో కలసి ‘అందరూ బతకాలి’ నాటకం రాశారు. దాన్ని నటుడు నాగభూషణం వందకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. 


సినిమా రంగంలోనూ బొల్లిముంత శివరామకృష్ణ ఓ వెలుగు వెలిగారు. 1960లో ఆచార్య ఆత్రేయ దగ్గర సహ రచయితగా చేరారు. ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘వాగ్దానం’ చిత్రానికి బొల్లిముంత తొలి సారి మాటలు రాశారు. ‘కలసివుంటే కలదు సుఖం’, ‘కలిమిలేములు’ వంటి అనేక చిత్రాలకు సహ రచయితగా పనిచేశారు. బి.ఎ్‌స.నారాయణ దర్శకత్వం వహించిన వాటిల్లో  అధిక భాగం చిత్రాలకు మాటలు రాశారు. ‘మనుషులు మారాలి’, ‘ప్రజానాయకుడు’, ‘కల్యాణ మండపం’, మూగకు మాటొస్తే’ , ‘విచిత్ర బంధం’, ‘తిరుపతమ్మ కథ’ సహా దాదాపు 50 చిత్రాలకు మాటలు రాశారు. అలాగే కొన్ని చిత్రాల్లో పాటలు కూడా రాశారు. బొల్లిముంత శివరామకృష్ణ 2005 జూన్‌ 7న కన్నుమూశారు.

Updated Date - 2020-06-07T05:37:23+05:30 IST