UPSC 177వ ర్యాంకర్...గృహహింసను ఎలా ఎదుర్కొందంటే..?

ABN , First Publish Date - 2022-05-31T23:37:45+05:30 IST

ఉన్నతమైన లక్ష్య సాధన కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ధీమంతులు తట్టుకుని..

UPSC 177వ ర్యాంకర్...గృహహింసను ఎలా ఎదుర్కొందంటే..?

న్యూఢిల్లీ: ఉన్నతమైన లక్ష్య సాధన కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ధీమంతులు తట్టుకుని నిలబడతారు. కష్టపడకుండా ఎవరికీ ఏ విజయం రాదు. కష్టాలొచ్చినప్పుడు తట్టుకుని నిలబడి సాధించిన విజయమే నిజమైన విజయం. ఈమాట అక్షరాలా నిజమని నిరూపించింది శివంగి గోయల్ (Shivangi Goyal). యూపీఎస్‌సీ (UPSC) ఫలితాల్లో ఆమె 177వ ర్యాంకు సాధించి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. శివంగికి ఏడేళ్ల పాప. అత్తింటి ఆరళ్ల కారణంగా భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది.


శివంగి సక్సెస్ జర్నీ...

యూపీలోని హాపుర్ (Hapur) నివాసి అయిన శివంగి గోయెల్‌కు ఒక్కతే కుమార్తె. అత్తమామల వేధింపుల కారణంగా పాపతో కలిసి తల్లిదండ్రులతో ఉంటోంది. ''సమాజంలోని పెళ్లయిన ఆడవారికి నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. అత్మమామల ఇంట్లో వేధింపులకు గురయితే, ఏమీ భయపడనవసరం లేదు. మీ కాళ్ల మీద మీరు నిలబడి వారికి చూపించండి. మహిళలు కోరుకుంటే ఏమైనా చేయగలరు. మీరు బాగా చదువుకుంటే, బాగా కష్టపడితే ఐఏఎస్ (IAS)లు కాగలరు'' అని శివంగి తన గత అనుభవాలను నెమరువేసుకుంది.


పెళ్లికి ముందు నుంచే తనకు ఐఏఎస్ కావాలని కోరిక ఉండేదని, రెండు సార్లు పరీక్ష రాసి విఫలమయ్యాయని శివంగి తెలిపింది. ఆ తర్వాత తనకు వివాహం కావడం, అత్తమామాల గృహహింస తట్టుకోలేక ఏడేళ్ల పాపతో పుట్టింటికి తిరిగి రావడం జరిగాయని చెప్పింది. తన తండ్రి సైతం నువ్వు కోరుకున్నట్టే చేయమని ప్రోత్సహించడంతో యూపీఎస్‌సీ (UPSC)కి మరోసారి ఎందుకు ప్రయత్నించరాదనే ఆలోచన తనకు వచ్చిందని తెలిపింది. కఠోర శ్రమ, అంకితభావంతో యూపీఎస్‌సీ ర్యాంక్ సాధించడం ద్వారా చిన్ననాటి తన కల నెరవేరిందని సంతోషంగా చెప్పింది. తన విజయానికి తల్లిదండ్రులు, కుమార్తె  రైనా (Raina) కారణమని తెలిపింది. శివంగి తండ్రి రాజేష్ గోయల్ ఒక వ్యాపారి కాగా, తల్లి హోం మేకర్.


శివంగి తన పాఠశాల రోజులను కూడా గుర్తు చేసుకుంది. యూపీఎస్‌సీకి ప్రిపేర్ కావాలని ప్రిన్సిపాల్ తరచు తనతో చెప్పేవారని, అప్పట్నించే తనకు ఐఏఎస్ కావాలనే కోరిక బలపడిందని చెప్పింది. యూపీఎస్‌సీ కోసం శివంగి సొంతంగానే ప్రిపేర్ అయింది. సోషియాలజీ ఆమె సబ్జెక్ట్.

Updated Date - 2022-05-31T23:37:45+05:30 IST