భద్రాద్రి ఈవోగా శివాజీ

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బి.శివాజీని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది

భద్రాద్రి ఈవోగా శివాజీ

రెగ్యులర్‌ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు

మరోసారి రెవెన్యూ అధికారికి పగ్గాలు


భద్రాచలం, సెప్టెంబరు 18 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బి.శివాజీని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. ఈ మేరకు జీవో నెం.238ని జారీ చేసింది. రెవెన్యూ శాఖలో పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి బి.శివాజీని దేవస్థానం ఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన శివాజీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కల్లూరు ఆర్డీవోగా పనిచేయడంతో పాటు రెవెన్యూ శాఖలో పలు చోట్ల వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు.


కొంత కాలంగా ఆయన పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తుండగా భద్రాద్రి ఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఈ క్రమంలోనే ఆయనకు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే జూన్‌ 30న భద్రాద్రి దేవస్థానం ఈవోగా ఉద్యోగ విరమణ చేసిన బి.నర్సింహులు స్థానంలో హైదరాబాద్‌ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ల్యాండ్‌ ప్రొటక్షన్‌ సెల్‌లో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్‌.రమాదేవిని ఇన్‌చార్జ్‌ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే రెగ్యులర్‌ ఈవోగా త్వరలో బి.శివాజీని నియమించనున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ఖమ్మం జిల్లా సంచికలో ఆగస్టు 24న కథనం ప్రచురితమైంది. 


మరోసారి రెవెన్యూ అధికారికే పగ్గాలు..

భద్రాచలం దేవస్థానం ఈవోగా మరోసారి రెవెన్యూ అధికారికే రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు అప్పగించింది. భద్రాద్రి దేవస్థానం చరిత్రలో ఇప్పటి వరకు 73మంది ఈవోలు బాధ్యతలు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఐదుగురు రెవెన్యూ శాఖకు స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్లున్నారు. వారిలో బి.మురళీధర్‌రెడ్డి, వి.హనుమంతరావు, ఎన్‌.సత్యనారాయణ, ఎన్‌సీహెచ్‌ బదరీ నారాయణా చార్యులు, కె.ప్రభాకర శ్రీనివాస్‌ ఉన్నారు. తాజాగా బి.శివాజీ నియమితులయ్యారు. 

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST