శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు

ABN , First Publish Date - 2021-03-08T05:00:58+05:30 IST

ఈ నెల 11వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని జరగబోయే బ్రహ్మోత్సవాలకు రాజంపేట పట్టణ, మం డల పరిధిలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి.

శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న హత్యరాల త్రేతేశ్వరుని ఆలయం

 రాజంపేట టౌన్‌, మార్చి7 : ఈ నెల 11వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని జరగబోయే బ్రహ్మోత్సవాలకు రాజంపేట పట్టణ, మం డల పరిధిలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. రాజంపేట మండలం ఊటుకూరులోని కామాక్షిదేవి సమేత నాగలింగేశ్వరస్వామి దేవాలయం, హత్యరాల కామాక్షి త్రేతేశ్వరస్వామి దేవాలయం, గుండ్లూరు శివాలయం, మందపల్లె శివాలయాలు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక సుందరంగా తయారవుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన హత్యరాల కామాక్షి త్రేతేశ్వర స్వామి ఆల యం అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ముస్తాబవుతోంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు రాజంపేట పట్టణం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు త్రేతేశ్వరస్వామిని దర్శించుకుంటుంటారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్న నేపఽథ్యంలో ఆలయ అధికారులు  ఆలయం చుట్టూ విద్యుత్‌ దీపాలంకరణ భారీ ఎత్తున చేస్తున్నారు. దేవతా మూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు నిర్వహించే రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రథానికి అత్యంత సుందరంగా మెరుగులుదిద్దుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాలను పరిశుభ్ర పరుస్తూ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తుల కోసం చలువపందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా హత్యరాలలోని మడుగు(బాహుదానది)లో స్నానమాచరించే వారికి ముఖ్యంగా మహిళలు ఎలాంటి అసౌకర్యాలకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిఇలా ఉండగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణకు పోలీసులు, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ అధికారులతో సమన్వయంగా చర్యలు చేప ట్టి వాహనాల పార్కింగ్‌ ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిసరాల్లో పెద్దఎత్తున చలివేంద్రాలు, అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర చికిత్స నిమిత్తం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, ఆలయ అధికారులు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. 

గోడపత్రాల ఆవిష్కరణ

రాజంపేట, మార్చి7 : రాజంపేట మండల పరిధిలోని హత్యరాల త్రేతేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు  ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన అంకురార్పణతో  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కొండయ్య, చైర్మన్‌ పూల నరసింహులు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలి సుబ్బారెడ్డి, కమలాకర్‌, మాజీ సర్పంచ్‌ గంగిరెడ్డి, పోలి మురళి, మందరం సర్పంచ్‌ చాపల సుభాషిణి, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ శివయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T05:00:58+05:30 IST