Shiva Parvathi theatreలో అగ్నిప్రమాదంతో కొత్త చర్చ.. హైదరాబాద్‌లోని ఈ థియేటర్లలో భద్రత ఎంత..!?

ABN , First Publish Date - 2022-01-04T19:03:11+05:30 IST

Shiva Parvathi theatreలో అగ్నిప్రమాదంతో కొత్త చర్చ.. హైదరాబాద్‌లోని ఈ థియేటర్లలో భద్రత ఎంత..!?

Shiva Parvathi theatreలో అగ్నిప్రమాదంతో కొత్త చర్చ.. హైదరాబాద్‌లోని ఈ థియేటర్లలో భద్రత ఎంత..!?

  • అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు అంతంతమాత్రమే
  • బహుళ అంతస్తుల భవనాలను తనిఖీలు.. 
  • చేయాలని గతంలో పురపాలక శాఖ ఆదేశాలు
  • జీహెచ్‌ఎంసీ, ఫైర్‌ సేఫ్టీ విభాగం అధికారులతో బృందాలు
  • తూతూమంత్రంగా పరిశీలన 
  • వేల భవనాల్లో కనిపించని అగ్నిమాపక ఏర్పాట్లు
  • ప్రమాదం జరిగినప్పుడే హడావిడి

హైదరాబాద్‌ సిటీ : మహానగరంలోని వాణిజ్య భవనాల్లో అగ్ని ప్రమాదాలకు కారణమేంటి, ఎందుకు జరుగుతున్నాయి, యజమానుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ విభాగాల ఉదాసీనతా..? అన్నది చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ప్రమాదాలు జరిగిన భవనాల్లో కనీస అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లూ ఉండడం లేదు. ఇది మంటలార్పేందుకు ఆటంకంగా మారుతోంది. గ్రేటర్‌లోని బహుళ అంతస్తుల భవనాలు, ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య నిర్మాణాల్లో ప్రత్యేక బృందాల ద్వారా అగ్నిమాపక ఏర్పాట్లు పరిశీలించాలని రెండున్నరేళ్ల క్రితం పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తనిఖీలు నిర్వహించి, ఫైర్‌ సేఫ్టీ లేని భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలని  సూచించింది. కొన్ని రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించిన జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,  విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం)లోని ఫైర్‌ విభాగం అధికారులు కొందరికి నోటీసులిచ్చారు.


- జనవరి 2 అర్ధరాత్రి తర్వాత కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూటే కారణమని అక్కడి సిబ్బంది 

చెబుతున్నారు.

- జనవరి 23, 2019న ఖాన్‌ లతీ్‌పఖాన్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగంతస్తులకు మంటలు వ్యాపించి తీవ్ర ఆస్తి నష్టం జరిగింది.


ఈ థియేటర్లలో భద్రత ఎంత?

భాగ్యనగరంలో ప్రధాన కూడలి అయిన క్రాస్‌రోడ్స్‌లో గతంలో 11 సినిమా థియేటర్‌లు ఉండేవి. పదేళ్ల కిందట నాలుగు థియేటర్లు, గతేడాది కరోనా కారణంగా సుభాష్‌, శ్రీమయూరి థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం ఐదు థియేటర్‌లు మాత్రమే ఉన్నాయి. ఆయా థియేటర్లలో అధికారులు తనిఖీలు చాలా అరుదు. ఎనిమిది సంవత్సరాల కిందట కొన్ని థియేటర్‌లలో ఫైర్‌సేఫ్టీపై తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి తనిఖీలు లేవనే చెప్పాలి. అయితే నిర్వాహకులు మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. పదివేల లీటర్ల కెపాసిటీతో భవనం పైన ట్యాంక్‌ ఏర్పాటు, అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రేక్షకులు వడివడిగా వెళ్లిపోవడానికి వీలుగా అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేశారు. స్ప్లింకర్ల ద్వారా ప్రమాదాన్ని అరికట్టేందుకు గాను నీటిని చిమ్మేలా ఏర్పాట్లు చేశారు. అందుకోసం పైప్‌లైన్‌ను సైతం ఏర్పాటు చేశారు.


అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం..

రెండు థియేటర్లలోనూ ఫైర్‌ సేఫ్టీ ఉంది. అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేశాం. ఫైరింజన్‌ వెళ్లడానికి వీలుగా లేనప్పటికీ, తర్వాత కాలంలో వచ్చిన జీవోకు అనుగుణంగా అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు తీసుకున్నాం.

- బాల్‌గోవింద్‌రాజ్‌, దేవి, సుదర్శన్‌ థియేటర్ల మేనేజింగ్‌ పార్టనర్‌ 


 ఫైర్‌ సేఫ్టీ అధికారుల తీరే వేరయా.. 

ప్రమాదం జరిగినప్పుడు హడావిడిగా, నిమిషాల్లో చేరుకున్నామని గర్వంగా చెప్పుకునే అగ్నిమాపక శాఖాధికారులు ప్రమాదాల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వందలాది మంది ఏకకాలంలో కూర్చుని చూసే సినిమా థియేటర్లలో అగ్నిమాపక చర్యలు ఎలా ఉన్నాయంటే.. చాలా బాగున్నాయని సమాధానం చెప్పేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తనిఖీలు చేస్తున్నారని అడిగితే.. అప్పుడప్పుడు మాత్రమే అని వారే పేర్కొంటున్నారు. నిబంధనలు పాటించని థియేటర్ల యజమానులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. అప్పుడప్పుడు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నగరంలోని శివపార్వతి థియేటర్‌ అగ్నికి ఆహుతైన నేపథ్యంలో పలు ప్రాంతాల థియేటర్లలో ఫైర్‌ సేఫ్టీ ఉందా అని ఆరా తీయగా, చాలా థియేటర్లలో అన్నీ సక్రమంగానే ఉన్నాయని అధికారులు చెప్పడం గమనార్హం.


ఏం చేశారు..? 

అగ్నిమాపక నిబంధనల ప్రకారం 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న (గ్రౌండ్‌ ప్లస్‌ నాలుగంతస్తులు) వాణిజ్య, 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న నివాస భవనాల్లో (గ్రౌండ్‌ ప్లస్‌ ఐదంతస్తులు) ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లను తనిఖీ చేసే బాధ్యత జీహెచ్‌ఎంసీకి ఉంది. అంత కంటే ఎక్కువ ఎత్తు (అంతస్తులు)న్న భవనాల్లో అగ్నిమాపక ఏర్పాట్ల పరిశీలన ఫైర్‌ సర్వీసెస్‌ విభాగం పరిధిలో ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వాణిజ్య భవనాల్లో ఫైర్‌ సేప్టీ తనిఖీ నెలల వ్యవధిలో పూర్తి చేయాలని అర్వింద్‌కుమార్‌ ఆదేశించారు. రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌ హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌, ఇతర వాణిజ్య సముదాయాల్లో పరిస్థితిని పరిశీలించి నెలాఖరు లోపు సర్కారుకు నివేదిక పంపాలని సూచించారు. కానీ ఆ దిశగా పూర్తిస్థాయిలో అడుగులు పడలేదు. 


2, 850 లోపే..

గ్రేటర్‌లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 35 వేలకుపైగా వాణిజ్య భవనాలున్నాయి. ఇందులో ఫైర్‌ సేఫ్టీ ఉన్నవి 2,850లోపు మాత్రమే. సుమారు 32వేలకుపైగా భవనాల్లో అగ్నిమాపక ఏర్పాట్లు లేవు. వేల సంఖ్యలో ఉన్న మెజార్టీ ఇతర బహుళ అంతస్తుల భవనాల్లోనూ అదే దుస్థితి. వినియోగం, విస్తీర్ణాన్ని బట్టి 1000 చదరపు మీటర్లు, నిర్ణీత అంతస్తులు దాటిన భవనాల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాటు తప్పనిసరి. కానీ నగరంలో ఆ పరిస్థితి లేదు. వాస్తవంగా ఆమోదిత ప్లాన్‌ ప్రకారం భవనం నిర్మించారా..? పైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు ఉన్నాయా..? అన్నది పరిశీలించాకే పట్టణ ప్రణాళికా విభాగం నివాసయోగ్య పత్రం (ఓసీ) జారీ చేయాలి. తద్విరుద్ధంగా ఓసీలు ఇస్తున్నారు. దీంతో అగ్నిప్రమాదం జరిగితే క్షణాల్లోనే తీవ్రత పెరుగుతోంది. నిర్ణీత స్థాయి విస్తీర్ణం, ఎత్తు దాటిన భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే నియంత్రించేలా ఫైర్‌ ఎగ్జ్‌ట్వింగిషర్లు, ఫైర్‌ హైడ్రెంట్లు, స్ర్పింక్లింగ్‌ సిస్టమ్‌, హోస్‌ రీల్స్‌, ఫైర్‌ అలారం వంటివి ఏర్పాటుచేయాలి. చాలా భవనాల్లో ఈ ఏర్పాట్లు లేకపోగా.. కొన్ని భవనాల్లో ఉన్నప్పటికీ.. నిర్వాహణాలోపంతో పని చేయడం లేదు. 



Updated Date - 2022-01-04T19:03:11+05:30 IST