Apr 12 2021 @ 17:44PM

పి19 ప్రొడక్షన్‌లో శివ కందుకూరి హీరోగా చిత్రం

శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యువ వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కొవ్వూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. పి19లో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా చవన్ ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. జూన్ నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాత సురేష్‌ రెడ్డి కొవ్వూరి మీడియాకు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. "శివ కందుకూరి పాత్ర సినిమా మెయిన్ పిల్లర్స్‌లో ఒకటిగా ఉంటుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో అతను కనిపిస్తారు. సీతారామ్ ప్రసాద్ మంచి కథ చెప్పారు. దానికి చవన్ ప్రసాద్ న్యాయం చేయగలుగుతారని అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాకు 'జాతిరత్నాలు' ఫేమ్ సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'హిట్', 'కృష్ణ అండ్ హిజ్ లీల' తదితర హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేసిన గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేయనున్నారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్  పాకాల సంగీతం అందించనున్నారు. మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. జూన్ నెల నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కొడైకెనాల్‌లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు.