వెలిసిపోతున్న వారసత్వ వైభవాలు

ABN , First Publish Date - 2022-07-01T07:20:04+05:30 IST

‘ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఆ మహాశయుడిని నిర్దేశించే రిమోట్ కంట్రోల్ ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది’– ఈ విలక్షణ నిర్మొహమాట మాటలు ఎవరు అన్నారో మరి చెప్పాలా?

వెలిసిపోతున్న వారసత్వ వైభవాలు

‘ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఆ మహాశయుడిని నిర్దేశించే రిమోట్ కంట్రోల్ ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది’– ఈ విలక్షణ నిర్మొహమాట మాటలు ఎవరు అన్నారో మరి చెప్పాలా?! బాల్‌ ఠాక్రే. ఏ సందర్భంలో అన్నారో కూడా చెప్పనివ్వండి. 2004 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సమయాన విలేఖర్లు ఆ పెద్ద మనిషిని ఒక ప్రశ్న వేశారు : బీజేపీ–శివసేన కూటమి గెలిచిన పక్షంలో సంభావ్య ముఖ్యమంత్రిగా మీ కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేను పరిగణనలోకి తీసుకుంటారా? ఈ ప్రశ్నకే ఆయన అలా నిక్కచ్చిగా సమాధానమిచ్చారు.


ఇరవై సంవత్సరాలు కూడా గడవక ముందే ఠాక్రే అభిజాత్యం పట్ల చరిత్ర నిర్దయగా వ్యవహరించింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పతనమయింది. శివసేనలో అంతర్గత తిరుగుబాటు వల్లే అది జరిగింది. అంతేనా? ‘రిమోట్ కంట్రోల్’ సైతం మాతోశ్రీ (ఠాక్రేల గృహం) నుంచి వెళ్లి పోయింది. అర్ధ శతాబ్ది క్రితం మహారాష్ట్ర అస్మిత (ఆత్మ గౌరవం) ఉద్ధరణకు ‘భూమి పుత్రుల’ ఉద్యమంగా ప్రారంభమైన శివసేన ఇప్పుడు అస్తిత్వ సంక్షోభంలో ఉంది! శివసైనికులకు తమ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మాత్రమే కనిపిస్తోంది.


ముంబైలో నడుస్తున్న చరిత్ర శివసేనకు మహా ఇబ్బందికరమైన పరిస్థితే, సందేహం లేదు. ఈ దురవస్థ ఎందుకు ప్రాప్తించింది? మహా శక్తిమంతుడైన ఒక వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ –కేంద్రిత ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక దశలో అస్తిత్వ సంక్షోభాన్ని తప్పక ఎదుర్కొంటాయి. శివసేన ఇప్పుడు అటువంటి అస్తిత్వ ప్రమాదాన్నే పాక్షికంగా చవిచూస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగిన తరువాత పార్టీ ఆధిపత్యం నిరాటంకంగా కొనసాగేలా అతడి వారసులు దీక్షా దక్షతలతో వ్యవహరిస్తున్నారా? లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఒక అఖిలేశ్ యాదవ్, బిహార్‌లో ఒక తేజస్వి యాదవ్, పంజాబ్‌లో ఒక సుఖ్‌బీర్ బాదల్, కర్ణాటకలో ఒక హెచ్‌డి కుమారస్వామి... ఇంతెందుకు, కాంగ్రెస్ పార్టీ ప్రథమ కుటుంబ గాంధీలకు వంశపారంపర్య విశేషాధికారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వారసత్వంగా పార్టీపై పెత్తనం దక్కినా అధికార ప్రాభవం లభించడం లేదు. ఆదర్శప్రాయమైన వారసత్వ రాజకీయాలకు ఉదాహరణగా తరచు మన్నన పొందుతున్న బిజూ జనతాదళ్ అధినేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ఆ క్రమక్షీణతకు మినహాయింపుగా లేరు. నవీన్ బాబు తరువాత ఎవరు? అనే ప్రశ్న బిజూ జనతాదళ్ భవిష్యత్తులో ఎదుర్కోనున్న సవాల్‌ను ప్రతిబింబిస్తోంది. ఒక్క డిఎంకె మాత్రమే, అధినేత ముత్తువేల్ కరుణానిధి మరణానంతరం తమిళనాట రాజకీయాలలో తన ప్రాబల్యాన్ని తిరుగులేని రీతిలో నిలబెట్టుకోగలిగింది. కారణమేమిటి? కార్యకర్తలకు పార్టీ పట్ల చెక్కుచెదరని అంకిత భావమే అని చెప్పి తీరాలి.


శివసేన సైతం కార్యకర్తల ఆధారిత పార్టీయే అనడంలో మరో అభిప్రాయం లేదు. పార్టీ శాఖల్లో కార్యకర్తల అభిప్రాయానికే ప్రథమ పరిగణన. ఇదొక ప్రత్యేకమైన వ్యవస్థ. అన్ని శాఖలను సమైక్యంగా ఉంచడంలో బాల్ ఠాక్రే వ్యక్తిత్వం, నాయకత్వ దక్షత కీలక పాత్ర వహించేది. రాజకీయ వ్యంగ్య చిత్రకారుడుగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయవేత్తగా పరిణమించిన బాల్ ఠాక్రే అద్వితీయ నాయకుడు. సాటిలేని మేటి. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో మహానేర్పరి. ఎన్నికలలో ఒక్కసారి కూడా పోటీ చేయని బాల్ ఠాక్రే తన పార్టీకి తిరుగులేని నాయకుడు. ఆయన మాటే తుది నిర్ణయం. సీనియర్ నాయకులు, అట్టడుగు కార్యకర్తలు ఒకే విధేయతతో వ్యవహరించేవారు. భయ భక్తులతో మెలిగేవారు. ప్రాంతీయ, జాతీయ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూనే బాల్ ఠాక్రే మహాశయుడు బహిరంగంగా ‘థోక్షాహి’ (హింసాత్మక బెదిరింపుల) రాజకీయాలను ఆమోదించారు, ప్రోత్సహించారు. 


బాల్ ఠాక్రే జన సమ్మోహన శక్తి అసాధారణమైనది. కుమారుడు ఉద్ధవ్ తన తండ్రికి నకలుగా వ్యవహరించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. ఇది అభినందించదగ్గ విషయమే. అయితే ఒక ఉదారవాదిగా తనకు ఒక సొంత గుర్తింపును తెచ్చుకునేందుకు రాజకీయవేత్తగానే కాదు, శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాధినేతగా కూడా ఉద్ధవ్ ప్రయత్నించారు. పులి తన చారలను మార్చుకోలేదన్న సత్యాన్ని ఆయన విస్మరించారు.


శివసైనికుల ‘కీర్తి’ ఏమిటి? దశాబ్దాలుగా ముంబై వీథి పోరాటకారులుగా వారు పేరు పొందారు. ఆ శ్రేణుల్లో భ్రష్ట కార్మికుల సంఖ్య తక్కువేమీ కాదు. క్రికెట్ పిచ్‌లు తవ్వివేయడం, పాకిస్థానీ కళాకారుల కార్యక్రమాలను అడ్డుకోవడం, ప్రత్యర్థుల – దక్షిణ భారతీయులు కానివ్వండి లేదా ముస్లింలు కానివ్వండి– పై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం శివసైనికుల ‘పేరు ప్రతిష్ఠ’ల చిట్టాలో ప్రముఖంగా ఉన్నాయి. ఐదు దశాబ్దాల కాలంలో శివసైనికుల ‘శత్రువు’ పలుమార్లు మారాడు కానీ పార్టీ రణ ప్రియ వ్యవహార శైలి పదునెక్కిందేగాని ఇసుమంత కూడా మారలేదు. శివసేనలో ప్రస్తుత అసాధారణ తిరుగుబాటునకు నాయకత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే కూడా పులు కడిగిన ముత్యమేమీ కాదు. ఆయనకు మార్గదర్శి అయిన ఆనంద్ ధిఘే ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి థానేలోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. ఆ ఆసుపత్రిపై దాడికి పాల్పడిన మూకకు నాయకత్వం వహించిన ఘనత ఈ షిండే మహాశయుడికి ఉంది.


మృదువుగా మాట్లాడే ఉద్ధవ్, జెస్యూట్ కళాశాలలో విద్యాబ్యాసం చేసిన ఆయన కుమారుడు ఆదిత్య శివసేన రాజకీయాల నాగరీక పార్శ్వానికి ప్రతినిధులే అయినప్పటికీ పార్టీ ‘పూర్వ ప్రతిష్ఠలు’ తొలగిపోతాయా? వీథి పోరాటకారుల వైఖరి అంత త్వరగా మారిపోతుందా? మారదు కనుకనే ఉద్ధవ్ వ్యవహార శైలి, నిర్ణయాలపై పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న సణుగుడు, గొణుగుడు తక్కువేమీ కాదు. హనుమాన్ చాలిసా చదువుతానని పట్టుపట్టిన మహారాష్ట్ర ఎంపీ ఒకరిపై శివసేన ప్రభుత్వం దేశద్రోహ నేరారోపణ మోపింది. ఇది శివసైనికులను విభ్రాంతపరిచింది. చాలా మంది గాభరా పడ్డారు. పార్టీ నాయకత్వ వైఖరిలో ‘లౌకికవాద’ మార్పుతో రాజీపడలేకపోయారు. అనేక మంది గాభరా పడ్డారు. ఠాక్రే కుటుంబంలోని తిరుగుబాటుదారు రాజ్ ఠాక్రే శివసైనికుల అయోమయ పరిస్థితిని తన రాజకీయ లబ్ధికి చక్కగా వినియోగించుకున్నారు. పర్యావరణ సమస్యల పరిష్కారం పట్ల ఆదిత్య ఠాక్రే నిబద్ధత కొనియాడదగిందే, సందేహం లేదు. అయితే శివసైనికులకు తమ యువనేత తీరుతెన్నులు అర్థం కావడం లేదు. అస్తిత్వ రాజకీయాల భావోద్వేగ అంశాలకు కాకుండా వాతావరణ మార్పుకు ఆదిత్య ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. 


శివసేనలో ఇదొక అంతర్గత అలజడి. అది కేవలం సైద్ధాంతిక, తరాల మధ్య పోరు మాత్రమే కాదు. దీనికి తోడు మహారాష్ట్రలో శివసేన రాజకీయ పలుకుబడిని స్వాయత్తం చేసుకునేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించింది. జాతీయ పాలక పక్షం ఇందుకు పూనుకోకపోతే శివసేనలో చీలిక సంభవించేది కాదు. ఇదొక వాస్తవం. ఈ విషయాన్ని మరింత నిశితంగా చూద్దాం. శివసేన, బీజేపీలు 1988లో తొలిసారి సన్నిహితమయ్యాయి. కలసికట్టుగా రాజకీయ ప్రస్థానం చేసేందుకు నిర్ణయించుకున్నాయి. భాగస్వామ్య సూత్రాలు స్పష్టమే. మహారాష్ట్రలో శివసేనకు ప్రాధాన్యం, జాతీయ రాజకీయాలలో బీజేపీ మార్గమే శిరోధార్యం. ప్రభవిస్తోన్న హిందూత్వ జాతీయవాద రాజకీయాలే సమరశీల ‘మరాఠీ మనూస్’ పార్టీ, హిందీ భాషా ప్రాంతాల ప్రధాన రాజకీయ శక్తి బీజేపీ మధ్య బంధాన్ని పటిష్ఠం చేశాయి. ఈ పరస్పర ప్రయోజనకర బంధమే మహారాష్ట్రలో మరాఠాల ప్రాబల్యమున్న కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి సవాల్‌గా పరిణమించింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యానికి ఇది మొట్ట మొదటి సవాల్. బీజేపీ, శివసేనలు పరస్పరం దగ్గరవడమనేది ఒక ‘ఆచరణాత్మక అవసరం’ అని ఆ రాజకీయ సంకీర్ణ నిర్మాత దివంగత ప్రమోద్ మహాజన్ ఒకసారి వ్యాఖ్యానించారు. ఒక కూటమిగా ఏర్పడేంతవరకు శివసేన, బీజేపీలకు మహారాష్ట్రలో 1 శాతం చొప్పున ఓట్లు మాత్రమే లభించేవి. ఇరు పార్టీలూ కలిసి మహారాష్ట్రలో 1995లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ రాజకీయ సమస్కంధుల మధ్య మిత్ర బంధం క్రమేణా సుదృఢమయింది. 2014 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేందుకు సాహసించింది. నాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహరచన ఫలించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఏకైక పెద్ద పక్షంగా బీజేపీ ఆవిర్భవించింది. పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల అనంతరం శివసేన మళ్లీ బీజేపీ పక్షాన చేరింది. ప్రభుత్వంలోనూ భాగస్వామి అయింది. అయితే గాయపడ్డ పులిలా ఉండిపోయింది. 


2019లో బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకుంది. ఎన్నికల అనంతరం ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో కలిసి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడీ’ కూటమిగా ఏర్పడింది. 2014లో బీజేపీ వ్యవహరించిన తీరుపై ఇలా ‘ప్రతీకారం’ తీర్చుకుంది. 2019 వంచనకు ప్రతిఘటనే 2022 తిరుగుబాటు. శివసేన, బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య వైషమ్యాలు బాగా పెరిగిపోయాయి. ఎంతగా పెరిగిపోయాయంటే పగలు తీర్చుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను నిస్సిగ్గుగా దుర్వినియోగం చేయడం జరుగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే పక్షాన ఉన్నవారు ఈడీ నుంచి తీవ్ర సమస్యల నెదుర్కొంటున్నారు. తిరుగుబాటు వర్గంలో వారికి ‘రక్షణ’ తప్పక లభించగలదని మరి చెప్పనవసరం లేదు. సరే, ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడేమి చేయనున్నారు? మళ్లీ బీజేపీ పక్షాన చేరుతారా లేక మహారాష్ట్ర వికాస్ అఘాడీతోనే ఉంటారా? ఏ కూటమితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా ఉండిపోతారా? కీలక ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. తప్పటడుగు వేయడానికి వీలులేదు. మొత్తం మీద ఠాక్రే కుటుంబ రాజకీయ వారసత్వమేకాదు, మహారాష్ట్ర రాజకీయాలలో శివసేన మనుగడ కూడా ప్రమాదంలో పడిందనేది స్పష్టం.



రాజ్‌దీప్‌ 

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - 2022-07-01T07:20:04+05:30 IST