యోగి సర్కార్‌పై మండిపడిన 'సామ్నా' సంపాదకీయం

ABN , First Publish Date - 2021-10-05T17:57:43+05:30 IST

హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న లఖింపూర్‌లో పర్యటించేందుకు అనుమతించకుండా విపక్ష నేతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..

యోగి సర్కార్‌పై మండిపడిన 'సామ్నా' సంపాదకీయం

ముంబై: హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న లఖింపూర్‌లో పర్యటించేందుకు అనుమతించకుండా విపక్ష నేతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడంపై శివసేన విమర్శలు గుప్పించింది. విపక్ష నాయకులను లఖింపూర్ చేరకుండా జిల్లా సరిహద్దులను మూసివేయడాన్ని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయం నిలదీసింది. లఖింపూర్ ఘటనపై ప్రధాని మోదీ మౌనాన్ని కూడా ప్రశ్నించింది.




''యోగి ప్రభుత్వం లఖింపూర్ సరిహద్దులను మూసేసింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఘటనా స్థలికి వెళ్తుండగా అడ్డుకుని నిర్బంధించారు. ఎంపీ హుడాపై కూడా అనుచితంగా ప్రవర్తించారు. అఖిలేష్ యాదవ్‌ను గృహనిర్బంధం చేశారు'' అని సంపాదకీయ పేర్కొంది. లఖింపూర్ సరిహద్దులను మూసేసిన తరహాలోనే లద్దాఖ్‌లో ఇండో-చైనా సరిహద్దులను మూసివేసి ఉంటే చైనా సైనికుల చొరబాటు ఉండేది కాదంటూ చురకలు వేసింది.


ప్రధాని మౌనం దిగ్భ్రాంతికరం..

లఖింపూర్ ఘటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా సామ్నా సంపాదకీయం విమర్శించింది. తాను సున్నిత మనస్కుడే కాకుండా, భావోద్యాగాలు ఉన్న వ్యక్తి అని ప్రధాని మోదీ పలు సందర్భాల్లో చాటుకున్నారు కానీ, లఖింపూర్ ఘటనలో మరణించిన రైతులకు సంతాపం తెలపడపోవడం మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తోందని పేర్కొంది. లఖింపూర్ ఘటనపై కంటే షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపైనే మీడియా ఎక్కువగా దృష్టి సారించడాన్ని కూడా శివసేన తప్పుపట్టింది. కేంద్ర మంత్రి తనయుడు నిరసనలు తెలుపుతున్న రైతులను చంపడం కంటే షారూక్ ఖాన్ కుమారుడే మీడియాకు ఎక్కువైందని, రైతుల దారుణ హత్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం మీడియా చేస్తోందని విమర్శించింది.

Updated Date - 2021-10-05T17:57:43+05:30 IST