బీజేపీకి అంతిమ ఘడియలు: శివసేన

ABN , First Publish Date - 2021-08-02T16:31:57+05:30 IST

మహారాష్ట్రలో బీజేపీ కనుమరుగయ్యే సమయం దగ్గరపడిందని శివసేన మండిపడింది. శివసేన..

బీజేపీకి అంతిమ ఘడియలు: శివసేన

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ కనుమరుగయ్యే సమయం దగ్గరపడిందని శివసేన మండిపడింది. శివసేన భవనం కూల్చేయాలంటూ బీజేపీ నేత ప్రసాద్ లాడ్ చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' ఘాటైన సంపాదకీయం రాసింది. బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఆ పార్టీ తెరమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందని, వోర్లి జలాల్లో ఆ పార్టీ, పార్టీ నేతలు తుడిచిపెట్టుకుపోనున్నారని పేర్కొంది. మరాఠీ నేతలు కూర్చున్న వేదికపై చప్పట్లు చరుస్తూ బీజేపీ నేతలు శివనేత భవనాన్ని కూల్చేయండంటూ వ్యాఖ్యానించడం మరాఠా గౌరవాన్ని మంటకలపడమేనని శివసేన మండిపడింది.


''శివసేనతో కొందరికి రాజకీయ విభేదాలు ఉండొచ్చు. శివసేనను ఎప్పటికప్పుడు విమర్శిస్తుండొచ్చు. ప్రతిసారి ఈ సవాళ్లను శివసేన ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఏరోజూ మా రాజకీయ ప్రత్యర్థులు శివసేన భవనాన్ని కూల్చేయాలని మాత్రం మాట్లాడలేదు. బాలసాహెబ్ థాకరేతో పాటు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొలువైన భవనం అది. ఆయన కాషాయి ధ్వజం కూడా భవన్‌లో ఎగురుతుంటుంది'' అని సామ్నా సంపాదకీయం పేర్కొంది. బీజేపీలో ఒకప్పుడు విధేయులైన కార్యకర్తలు, అట్టడుగు ప్రజలతో మమేకమైన వారు ఉండేవారనీ, నిజమైన సైద్ధాంతిక విలువలున్న నేతలు ఇప్పుడు కనుమరుగు కావడంతో ఆ పార్టీ కూడా తెరమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించింది. కాగా, బీజేపీ నేత వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సైతం పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. విమర్శలకు తాము భయపడేది లేదని, చాలా సమర్ధవంతంగా వాటిని తిప్పికొడతామని అన్నారు. తామంటూ తిప్పికొట్టడం మొదలు పెడితే ఎదుట వ్యక్తులు మళ్లీ పైకి లేవరని అన్నారు.

Updated Date - 2021-08-02T16:31:57+05:30 IST