ఛత్రపతి శివాజీపై బీజేపీది ‘నకిలీ భక్తి’: శివసేన

ABN , First Publish Date - 2020-08-11T23:33:24+05:30 IST

కర్నాటకలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం తొలగింపుపై మహారాష్ట్ర బీజేపీలోని ఆయన..

ఛత్రపతి శివాజీపై బీజేపీది ‘నకిలీ భక్తి’: శివసేన

ముంబై: కర్నాటకలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం తొలగింపుపై మహారాష్ట్ర బీజేపీలోని ఆయన ‘‘భక్తులు’’ నోరు మెదపకపోవడం విచారకరమని శివసేన పార్టీ పేర్కొంది. అలాంటి ‘‘నకిలీ భక్తి’’ వల్ల ఉపయోగం ఏమిటంటూ దుయ్యబట్టింది. ఇవాళ తన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన పార్టీ ఈ మేరకు బీజేపీపై విరుచుకుపడింది. ఈ నెల 5న అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం భూమిపూజ చేసిన సందర్భంగా ఛత్రపతి శివాజీని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ‘‘ఓ వైపు శివాజీకి ప్రధాని మోదీ శిరసువంచి నమస్కరిస్తారు. కానీ కర్నాటకలో ఆయన మద్దతుదారులు మాత్రం శివాజీ విగ్రహాన్ని తొలగిస్తారు. దీనిపై మహారాష్ట్రలోని శివాజీ భక్తులు ఎలా మౌనంగా వహిస్తారు? అలాంటి నకిలీ భక్తి వల్ల ప్రయోజనం ఏమిటి?’’ అని శివసేన ప్రశ్నించింది. విగ్రహం తొలగింపును కర్నాటక సీఎం యడియూరప్ప ఖండించకపోవడం పైనా ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ పాలిత కర్నాటకలో బెళగావి జిల్లా మంగుట్టి గ్రామంలో ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించడంపై వివాదం రేగిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-08-11T23:33:24+05:30 IST