కోవిడ్-19పై అధికారులతో గవర్నర్ సమావేశం... శివసేన అభ్యంతరం...

ABN , First Publish Date - 2020-04-11T03:41:23+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై మహారాష్ట్ర

కోవిడ్-19పై అధికారులతో గవర్నర్ సమావేశం... శివసేన అభ్యంతరం...

ముంబై : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించడంపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అనవసరమైన సమాంతర పరిపాలన అని వ్యాఖ్యానించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సిబ్బంది అయోమయానికి గురవుతారని పేర్కొంది. శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేసింది.


ప్రస్తుతం యుద్ధం వంటి పరిస్థితి ఉందని, పాలనా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చేందుకు ఒకే ఒక ఆజ్ఞల కేంద్రం ఉండాలని పేర్కొంది. కేంద్రంలో ప్రధాన మంత్రికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అటువంటి అధికారం ఉండాలని పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతోపాటు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ కోవిడ్-19పై పోరాటంలో మోదీ నాయకత్వంలో యావత్తు దేశం సమైక్యంగా ఉందని చెప్పారని గుర్తు చేసింది. 


మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ముంబై నుంచి పాల్గొన్నారు. 


గవర్నర్ కోషియారీ ఇటీవల వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జిల్లా కలెక్టర్లు, డివిజనల్ కమిషనర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, వలస కార్మికులు, నిరాశ్రయులకు సహాయ కార్యక్రమాలు వంటివాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Updated Date - 2020-04-11T03:41:23+05:30 IST