మాయావతి, ఒవైసీలపై శివసేన వ్యంగ్యాస్త్రాలు

ABN , First Publish Date - 2022-03-11T19:06:48+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పరోక్షంగా

మాయావతి, ఒవైసీలపై శివసేన వ్యంగ్యాస్త్రాలు

ముంబై : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పరోక్షంగా దోహదపడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలకు పద్మవిభూషణ్, భారత రత్న పురస్కారాలను ఇవ్వాలని శివసేన వ్యంగ్యంగా పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీఎస్‌పీ, ఏఐఎంఐఎం కొన్ని ఓట్లను చీల్చినందువల్ల బీజేపీ లబ్ధి పొందినట్లు విశ్లేషకులు చెప్తున్న సంగతి తెలిసిందే. 


ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, సంజయ్ రౌత్ శుక్రవారం మాట్లాడుతూ, బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. ఉత్తర ప్రదేశ్ వారి సొంత రాష్ట్రమని, (ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ అని), అయినప్పటికీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి ఈ ఎన్నికల్లో 125 స్థానాలు వచ్చాయని, అంటే అంతకుముందు కన్నా మూడు రెట్లు పెరిగాయని చెప్పారు. అంతకుముందు 42 స్థానాలున్న పార్టీ ఇప్పుడు 125 స్థానాలను సాధించిందన్నారు. బీజేపీ విజయానికి మాయావతి, ఒవైసీ దోహదపడ్డారన్నారు. వారికి పద్మవిభూషణ్, భారత రత్న పురస్కారాలను ఇవ్వాలన్నారు. 


ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయం గురించి మాట్లాడుతూ, దీని గురించి తాము తలక్రిందులు కావలసినదేమీ లేదన్నారు. వారి సంతోషాన్ని తాము కూడా పంచుకుంటామన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పరాజితులయ్యారని అడిగారు. పంజాబ్‌లో బీజేపీని పూర్తిగా తిరస్కరించారన్నారు. జాతీయవాద పార్టీ అయిన బీజేపీని పంజాబ్‌లో తిరస్కరించడం చాలా బాధాకరమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అందరూ పంజాబ్‌లో అద్భుతంగా ప్రచారం చేశారన్నారు. అలాంటపుడు ఎందుకు గెలవలేకపోయారన్నారు. యూపీ, ఉత్తరాఖండ్, గోవా బీజేపీ పాలిత రాష్ట్రాలేనన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్, శివసేన నష్టపోయినదాని కన్నా పంజాబ్‌లో బీజేపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. 


Updated Date - 2022-03-11T19:06:48+05:30 IST