ముంబై: శివసేన (Shiv Sena) నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజురోజుకు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా శివసేన అడుగులు వేస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలు కోరుకుంటే మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి నుంచి బయటకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తెలిపారు. అయితే, ఇందుకాయన ఓ షరతు కూడా విధించారు. రెబల్ ఎమ్మెల్యేలు 24 గంటల్లో గువాహటి నుంచి ముంబై వచ్చి సీఎం ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ను కలిసి ఆయన ముందు ఆ ప్రతిపాదన చేసి చర్చించాలని సూచించారు.
మరోవైపు, కాంగ్రెస్ (Congress) కూడా కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే తాము శివసేనతో ఉన్నామని తెలిపింది. ఈ సంక్షోభం మొత్తానికి ఈడీనే కారణమని నిందించింది. ఫ్లోర్ టెస్ట్‌కు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. తాము ఎంవీయేతోనే ఉన్నామని, ఇకపైనా ఉంటామని తేల్చి చెప్పింది. వారు (శివసేన) కావాలనుకుంటే ఎవరితోనైనా జట్టుకట్టొచ్చని, తమకు ఎలాంటి సమస్య లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ అబిత్కార్ (Prakash Abitkar) వారి నుంచి తప్పించుకోవాలని చూసినా లాభం లేకుండా పోయిందని శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ (Nitin Deshmukh) పేర్కొన్నారు. తాము సూరత్ హోటల్‌కు చేరుకున్న తర్వాత కానీ ఎంవీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి తెలియరాలేదన్నారు. తనను బలవంతంగా సూరత్ తీసుకొచ్చారని, తాను అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా సూరత్ పోలీసులు పట్టేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సమస్యలు లేకున్నా గుండెపోటు వచ్చిందని వైద్యులు చెప్పారని, దాదాపు 300-350 మంది పోలీసులు తమపై ఓ కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. కాగా, నితిన్‌ను బలవంతంగా సూరత్ తీసుకెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇతర రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్న ఫొటోను ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) క్యాంపు విడుదల చేసింది.
కాగా, కూటమి నుంచి తాము బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నసంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్.. తమ పార్టీ నేతలతో సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో సమావేశమైంది. ఆ పార్టీ సీనియర్ నేతలైన హెచ్‌కే పాటిల్, బాలాసాహెబ్ థోరట్, నానా పటోలే, అశోక్ చవాన్ తదితరులు హాజరయ్యారు.
తాము చివరి వరకు ఉద్ధవ్ థాకరేతోనే ఉంటామని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మహారాష్ట్ర సంక్షేమం కోసమే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడిందని, తాము చివరి వరకు ఉద్ధవ్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి