ఆ ప్రజాస్వామ్యం పెగాసస్‌కు వర్తించదా? : శివసేన

ABN , First Publish Date - 2021-08-04T16:43:36+05:30 IST

పెగాసస్ అంశం వెనుక బీజేపీ దాక్కుందని శివసేన బుధవారం

ఆ ప్రజాస్వామ్యం పెగాసస్‌కు వర్తించదా? : శివసేన

ముంబై : పెగాసస్ అంశం వెనుక బీజేపీ దాక్కుందని శివసేన బుధవారం ఎద్దేవా చేసింది. ముఖ్యమైన సమస్యలపై చర్చించకుండా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పారిపోతోందని దుయ్యబట్టింది. ఆ పార్టీ మౌత్‌పీస్ ‘సామ్నా’ సంపాదకీయంలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడింది. 


పార్లమెంటులో ప్రతిష్టంభనకు ప్రతిపక్షాలను నిందించడానికి బదులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెగాసస్ వివాదంపై మాట్లాడి ఉండవలసిందని పేర్కొంది. పెగాసస్ వివాదంపై దర్యాప్తు జరపవలసిన అవసరం ఉందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్తున్నారని, దీనిపై బీజేపీ ఏమంటుందని ప్రశ్నించింది. నితీశ్ కుమార్ ఢిల్లీ వెళ్ళి, తన వాదనను గట్టిగా వినిపించాలని డిమాండ్ చేసింది. 


పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన ప్రజాస్వామ్యానికి అవమానకరమని మోదీ అంటున్నారని, పార్లమెంటులో ఈ రసాభాసకు మూలాలు ఎన్డీయే ప్రతిపక్షంలో ఉన్నపుడు కనిపిస్తాయని తెలిపింది. బోఫోర్స్, టూజీ, అవినీతిపై అప్పటి యూపీయే ప్రభుత్వాన్ని ఎన్డీయే ఇరుకునపెట్టిందని గుర్తు చేసింది. అలా చేయడం శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి సంకేతం అయినపుడు, నేడు పెగాసస్‌కు కూడా అదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ చొరవ తీసుకుని (పెగాసస్ వివాదంపై మాట్లాడి) ఉంటే, పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా జరిగేవని తెలిపింది. 


ఉభయ సభల్లో పెగాసస్ ప్రకంపనలు

పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి రాజకీయ నేతలు, పాత్రికేయులు, ఇతర ప్రముఖులపై నిఘా పెడుతున్నట్లు వార్తలు రావడంతో, దీనిపై చర్చించాలని పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుండటంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు మంగళవారం సమావేశమయ్యాయి. పెగాసస్ వివాదంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి తగిన వ్యూహంపై చర్చించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమవాలని నిర్ణయించారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి అవమానకరంగా ఉందని మండిపడ్డారు. 


Updated Date - 2021-08-04T16:43:36+05:30 IST