టీఎంసీపై శివసేన అనూహ్య విమర్శలు

ABN , First Publish Date - 2022-01-09T21:07:00+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని

టీఎంసీపై శివసేన అనూహ్య విమర్శలు

ముంబై : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన అనూహ్యంగా విమర్శలు గుప్పించింది. గోవాలోని కాంగ్రెస్ నేతలకు వల వేయడం వల్ల బీజేపీ లాభపడుతుందని దుయ్యబట్టింది. మమత బెనర్జీ ఇటువంటి వైఖరిని ప్రదర్శించకూడదని హితవు పలికింది. గోవాలో ప్రముఖ నేతలను, ఓటర్లను ఆకర్షించడానికి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ధన బలాన్ని వినియోగిస్తున్నాయని ఆరోపించింది. 


శివసేన పత్రిక ‘సామ్నా’లో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ రాసిన వ్యాసంలో గోవాలో కాంగ్రెస్‌ను అంతం చేయాలనే మమత బెనర్జీ నిర్ణయానికి తాము వ్యతిరేకమని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్ళతో పెకలించాలనేది బీజేపీ కల కావచ్చునని, అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మమత బెనర్జీ వంటి నాయకులు ఇటువంటి వైఖరిని ప్రదర్శించి ఉండకూడదని అన్నారు. గోవాలో టీఎంసీ రాజకీయాల వల్ల అంతిమంగా బీజేపీ లాభపడుతుందని హెచ్చరించారు. 


శాసన సభ ఎన్నికలు జరగబోతున్న గోవాలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్ బలం 17 నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు తగ్గిపోయిందన్నారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో జాతీయ స్థాయి వైఖరిని చేపట్టలేదని తెలిపారు. టీఎంసీ, ఏఏపీ వంటి బయటి శక్తులు ఇప్పుడు భూమి పుత్రుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు గోవాలోని క్రిస్టియన్ ఓట్లపై కన్ను వేశాయని, అయితే వీరు కాంగ్రెస్ వైపు నిలుస్తారని అన్నారు. గతంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ రెబెల్స్ ప్రస్తుతం తమకు పోటీ చేయడానికి బీజేపీ టిక్కెట్లు రావని తెలుసుకుని, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని అన్నారు. అయితే ద్రోహులను మరోసారి ప్రోత్సహించకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుందన్నారు. 


గోవా శాసన సభ ఎన్నికల్లో టీఎంసీ ఖర్చు చేస్తున్న నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం బీజేపీ ధన బలాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని బీజేపీ పదేళ్ళ నుంచి పరిపాలిస్తోందని, అయినప్పటికీ అధికారాన్ని నిలుపుకోవడానికి తగిన ఆధిక్యతను సాధించలేకపోతోందని దుయ్యబట్టారు. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడంపైనే బీజేపీ ఆధారపడుతోందన్నారు. బీజేపీకి ఈసారి కూడా మెజారిటీ స్థానాలు లభించబోవని చెప్తున్నవారిని తాను కలిశానని, అటువంటి సమయంలో ఈ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేస్తుండటం వల్ల అంతిమంగా బీజేపీ లాభపడుతుందని తెలిపారు. దీనిని గుర్తించినవారు టీఎంసీకి ప్రభంజనాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీలోని ప్రస్తుత ఎమ్మెల్యేలు, టికెట్లను ఆశిస్తున్నవారు హిస్టరీ షీటర్స్ అని ఆరోపించారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారంతో ప్రమేయం ఉన్నవారు బీజేపీలో చేరుతున్నారన్నారు. అటువంటివారిని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వాగతిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 


గోవాలో 40 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

 

Updated Date - 2022-01-09T21:07:00+05:30 IST