బీజేపీకి షాక్ ఇచ్చిన అకాళీదళ్

ABN , First Publish Date - 2020-09-17T02:53:24+05:30 IST

ఈ మూడు బిల్లు ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ మూడు బిల్లులపై పంజాబ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మేలు చేస్తున్నామనే కారణం చూపించి వ్యవసాయాన్ని

బీజేపీకి షాక్ ఇచ్చిన అకాళీదళ్

న్యూఢిల్లీ: ఎన్డీయేలో భాగమైన శిరోమణి అకాళీదళ్.. ఉన్నట్టుండి భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వ్యవసాయ రంగ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం ద్వారా లాభసాటిగా మార్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడు ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపింది. నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్‌, రైతులకు సాధికారిత కల్పించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్‌, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ప్రోత్సాహం కల్పించే పేరుతో మరో ఆర్డినెన్స్‌ను ఆమోదించారు.


ఈ మూడు బిల్లు ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ మూడు బిల్లులపై పంజాబ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మేలు చేస్తున్నామనే కారణం చూపించి వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలే ఇవని వారు మండిపడుతున్నారు. ఈ మూడు ఆర్డినెన్స్‌లపై పంజాబ్‌తో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. త్వరలో కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బీహార్‌, మధ్యప్రదేశ్‌కూ పాకే అవకాశముందని రైతు సంఘాలు చెబుతున్నాయి.


రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో శిరోమణి అకాళీదళ్ యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఓటింగ్‌లో పాల్గొనాలని తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇవి రైతు వ్యతిరేక బిల్లులుగా పరిగణిస్తూ వీటిని ఉపసంహరించుకోవాలని మిత్రపక్షమైన బీజేపీని డిమాండ్ చేసింది. ఈ బిల్లులకు మద్దతు ఇచ్చే ఏ పంజాబ్ ఎంపిని గ్రామాల్లోకి అనుమతించరని అకాళీదళ్ పేర్కొంది.

Updated Date - 2020-09-17T02:53:24+05:30 IST