దార్శనికుడు షింజో

ABN , First Publish Date - 2022-07-09T10:07:55+05:30 IST

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం జపాన్ పార్లమెంటు ఎగువసభకు...

దార్శనికుడు షింజో

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం జపాన్ పార్లమెంటు ఎగువసభకు ఎన్నికలు ఉన్నందున, పశ్చిమ జపాన్‌లో ఒకచోట ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతుండగా, ఓ దుండగుడు ఆయనను తుపాకీతో కాల్చిచంపాడు. రాజకీయహత్యలు, దాడులు దాదాపుగా లేని అత్యంత ప్రశాంతంగా ఉండే జపాన్‌ను ఈ ఘటన వొణికించడం సహజం.


ఈ మాజీ ప్రధానిని మూడేళ్ళపాటు సైన్యంలో పనిచేసిన ఓ మాజీసైనికుడు ఎందుకు హత్య చేశాడన్నది అటుంచితే, ఈ హత్యకు అతడు స్వయంగా తుపాకీని తయారుచేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. జపాన్‌లో ఓ తుపాకీ వినియోగం, అందునా ఓ రాజకీయనాయకుడిమీద దాడి జరగడం అక్కడి కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టం కారణంగా అత్యంత అరుదైనది. 1958 నాటి ఈ చట్టం ఒకే ఒక్క వాక్యంలో ‘దేశపౌరుల్లో ఎవ్వరూ తుపాకీ లేదా తుపాకులు, కత్తి లేదా కత్తులు కలిగి ఉండటానికి వీల్లేదు’ అని శాసిస్తున్నది. అమెరికాలో ఏటా నలభైవేలమంది కాల్పుల్లో మరణిస్తే  జపాన్‌లో ఏ ఏడాది కూడా ఆ సంఖ్య రెండంకెలు చేరలేదట. 2007లో నాగసాకి మేయర్ మీద కాల్పులు జరిగిన ఘటన తరువాత రాజకీయ హత్యంటూ జరిగింది ఇప్పుడే. 1957 నుంచి మూడేళ్ళపాటు జపాన్ ప్రధానిగా ఉన్న షింజో అబే తాత, జపాన్ మాజీ ప్రధాని నొబుసుకె కిషి కూడా ఇటువంటి దాడినే ఎదుర్కొన్నప్పటికీ దానికి ఓ బలమైన కారణం ఉన్నది.


ఆయన అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని కుదర్చుకోవడం జపాన్ సమాజం సహించలేకపోయింది. జనం రోడ్లమీదకు రావడంతో ఆయన పదవినుంచి దిగిపోతున్నట్టు ప్రకటించాడు. అయినప్పటికీ అమెరికాతో రాజీపడ్డాడన్న ఆగ్రహం తట్టుకోలేని ఓ అరవై ఐదేళ్ళ వృద్ధుడు కత్తితో దాడిచేసి తొడమీద పలుమార్లు పొడిచి మరీ తన అసమ్మతిని తెలియచేశాడు. చంపడం తన ఉద్దేశం కాదని ప్రకటించాడు. అప్పుడు తాత ఆ దాడినుంచి బతికిబయటపడ్డాడు కానీ, ఇప్పుడు మనుమడికి ఆ అదృష్టం దక్కలేదు.


తాత ప్రధానమంత్రిగా, ఆ తరువాత తండ్రి మంత్రిగా వ్యవహరించిన రాజకీయ కుటుంబంలో పుట్టిన షింజోకు జపాన్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా నిలబడిన రికార్డు ఉంది. 2006లో ప్రధానికాగానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఓడిపోవడంతో ఏడాదిలోనే దిగిపోవాల్సివచ్చింది. అప్పుడు సంకల్పించిన సంస్కరణలను మరో ఆరేళ్ళకు ప్రధానికాగానే అమలులో పెట్టారు. ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో జపాన్ పురోగమనానికి ‘అబేనోమిక్స్’ బాగా ఉపకరించాయని అంటారు. ప్రపంచ ఆర్థికంలో రెండోస్థానాన్ని చైనా ఆక్రమించుకున్నప్పటినుంచీ దానితో రాజీలేని వైఖరి ప్రదర్శిస్తూ, దాని ఆధిపత్యానికి సవాలు విసురుతూ వచ్చారాయన. భారత ప్రధాని నరేంద్రమోదీ లాగానే షింజో కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత ఆత్మీయుడు. అమెరికా భౌగోళికార్థిక ప్రయోజనాల పరిరక్షణకోసం తనవంతుగా చాలా కృషిచేశారు. భారత్ సహా మిగతా ఆసియా దేశాలతో స్నేహాన్ని పెంచుకొని, చైనా విస్తరణవాదానికి వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ కూటములనేకం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అందమైన జపాన్‌ బలమైన సైనికశక్తితో అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని ఆశించిన మితవాది, జాతీయవాది.  గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచే తనకు అబే ఎంత ఆప్తుడో పేర్కొంటూ నరేంద్రమోదీ తన బ్లాగ్‌లో ప్రత్యేకంగా ఓ సుదీర్ఘవ్యాసం రాశారు. గంగాహారతులు, సబర్మతీ ఆశ్రమ పర్యటనలు ఇత్యాదివన్నీ ప్రస్తావిస్తూ, భారత జపాన్ సంబంధాలను మేలిమలుపు తిప్పిన ఆయనను ఇటీవల పద్మవిభూషణ్‌తో గౌరవించుకున్న విషయాన్నీ గుర్తుచేసుకున్నారు.


2007లో తొలిసారి షింజో అబే భారత్‌లో పర్యటించినప్పుడు పార్లమెంటు ఉభయసభలనూ ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సరిగ్గా యాభైయేళ్ళక్రితం తన తాత అదేచోట ప్రసంగించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘ఈయన జపాన్ ప్రధాని, నేను అమితంగా గౌరవించే, అభిమానించే దేశం అది’ అని అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేకంగా పార్లమెంటు సభ్యులకు పరిచయం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘అంతకు పన్నెండేళ్ళక్రితమే రెండు అణుబాంబుల దాడికి గురై యుద్ధంలో ఓడిపోయిన ఒక దేశానికీ, దాని నేతకూ ఇంతకంటే గౌరవం ఇంకేముంటుంది? అని షింజో వ్యాఖ్యానించారు. షింజో మృతితో వర్తమానకాలంలోని ఒక గొప్ప నేతను ప్రపంచం కోల్పోయింది.

Updated Date - 2022-07-09T10:07:55+05:30 IST