కస్టడీలో పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన Shilpa Chowdary..

ABN , First Publish Date - 2021-12-13T01:15:41+05:30 IST

కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో అరెస్టయిన శిల్పాచౌదరి మూడ్రోజుల పోలీసు కస్టడీ...

కస్టడీలో పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన Shilpa Chowdary..

హైదరాబాద్ : కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో అరెస్టయిన శిల్పాచౌదరి మూడ్రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీలో పోలీసుల ప్రశ్నలకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా శిల్పా నోరు విప్పకపోగా.. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టారు. అంతేకాదు.. తనను ఎందుకు వేధిస్తున్నారంటూ పోలీసులపైనే ఎదురుదాడికి దిగడం గమనార్హం. శిల్ప స్టేట్‌మెంట్‌లో ఎటువంటి కీలక సమాచారం లేకపోడంతో మరోసారి కస్టడీ పిటిషన్ వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 5 బ్యాంక్ అకౌంట్లు, లాకర్‌ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. పదే పదే తాను నిర్దోషినంటూ పోలీసులతో శిల్పాచౌదరి వాగ్వాదానికి దిగారు. పోలీసులు సంధించిన పలు ప్రశ్నలకు గాను ఒకట్రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చింది. రోహిణికి రూ.13కోట్లు ఇచ్చినట్లు విచారణలో శిల్ప తెలిపారు. ఫిర్యాదులో ఉన్న సొమ్ము మొత్తం తిరిగి చెల్లిస్తానని విచారణలో పోలీసులకు శిల్పాచౌదరి చెప్పారు. అయితే.. ఈ కేసులో దర్యాప్తు మాత్రం పోలీసులు చాలా గోప్యంగా సాగిస్తున్నారు. శిల్ప మోసాలపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. శిల్ప కేసులో మరికొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


ఇదివరకు ఇలా..!

కాగా.. రెండోరోజు కస్టడీలో తన డబ్బును రాధికారెడ్డితో పాటు మరికొందరికి ఇచ్చినట్లు శిల్ప తెలిపింది. వాస్తవం లేదంటూ రాధికారెడ్డి స్వయం పీఎస్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాధికారెడ్డి, కొంపల్లి మల్లారెడ్డికి మధ్యవర్తిత్వంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మల్లారెడ్డి, ఎన్ఆర్ఐ ప్రతాప్‌రెడ్డికి కోట్లు ఇచ్చినట్లు శిల్ప తెలిపింది. అంతకుముందు.. ‘‘నాకేం తెలియదు’’ అంటూ దాటవేసే ప్రయత్నం చేయగా.. పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదుల చిట్టాను.. ఆమె కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలను ముందు పెట్టారు. కాల్‌డేటా రికార్డులను.. ఎవరితో ఎప్పుడు..? ఎంతసేపు మాట్లాడారనే చిట్టాను తీశారు. దీంతో ఆమె ఒక్కో విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. తనది మెదక్‌ జిల్లా అని.. ఓ బాబు ఉన్నాడని చెప్పినట్లు తెలిసింది. బాధితుల వివరాలను పోలీసులు చెబుతూ.. ‘‘ఇంకా చెప్పమంటారా? మీరే చెబుతారా?’’ అని ప్రశ్నించడంతో.. ఆమె అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పారని తెలిసింది. అయితే ఈ కస్టడీ గురించి పోలీసులు మాత్రం ఇంతవరకూ చిన్నపాటి సమాచారాన్ని కూడా బయటికి పొక్కనీవట్లేదు.

Updated Date - 2021-12-13T01:15:41+05:30 IST