Abn logo
Feb 23 2021 @ 08:27AM

మానవత్వం చాటుకున్న దుబాయి రాజు.. పాప ఆపరేషన్ కోసం..

దుబాయి: యూఏఈ ప్రధాని, దుబాయి రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పసిపాప చికిత్సకు 80 లక్షల దిర్హామ్‌లు(రూ. 15.77 కోట్లు) చెల్లించేందుకు ముందుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇరాఖ్‌కు చెందిన ఇబ్రహీం, మస్సార్ దంపతులకు జన్మించిన లవీన్ అనే పసిపాప స్పైనల్ మస్కులర్ ఆట్రఫీ(ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పసిపాపకు మెరుగైన చికిత్సను అందించేందుకు తల్లిదండ్రులిద్దరూ ఫిబ్రవరి 9న దుబాయి వచ్చారు. ఆస్పత్రిలో పాపను చేర్చగా చికిత్సకు 80 లక్షల దిర్హామ్‌లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత మొత్తాన్ని వారు భరించే ఆర్థిక స్థాయి లేకపోవడంతో తమ కూతురు చికిత్సకు సహాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. 


ఈ వీడియోను దుబాయి రాజు ఖాతాకు ట్యాగ్ చేశారు. సోమవారం దుబాయి రాజు నుంచి స్పందన వచ్చిందని, పాప చికిత్సకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలియడంతో పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితాన్ని తిరిగి తమకు ప్రసాదిస్తున్న దుబాయి రాజుకు కృతజ్ఞతలంటూ తల్లిదండ్రులిద్దరూ చెప్పారు. తమ కూతురు తమకు దక్కదేమోనని ఎంతో భయపడ్డామని, ఆశలు కూడా వదిలేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయి రాజు కారణంగానే తమ పాపకు అవసరమైన చికిత్స లభిస్తోందని అన్నారు. కాగా.. పసిపాప లవీన్‌కు వైద్యులు జన్యు మార్పిడి చికిత్స చేయనున్నారు. యూఏఈలో మొట్టమొదటి జన్యు మార్పిడి చికిత్స ఇదే కావడం విశేషం.

Advertisement
Advertisement
Advertisement