ఆరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన Indrani mukherjea

ABN , First Publish Date - 2022-05-21T01:29:00+05:30 IST

దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ ..

ఆరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన Indrani mukherjea

ముంబై: దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ శుక్రవారంనాడు బైకుల్లా జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసులో అరెస్టయిన ఆరేళ్ల ఐదు నెలల తర్వాత జైలు నుంచి ఆమె బయటపడ్డారు. గత బుధవారంనాడు ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులను ఖరారు చేయాల్సిందిగా విచారణ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రూ.2 లక్షల క్యాష్ బాండ్ సమర్పించిన అనంతరం ఆమె విడుదలకు సీబీఐ కోర్టు అనుమతించింది.


ఇంద్రాణి ముఖర్జీ 2012 ఏప్రిల్‌లో తన కూతురు షీనా బోరా (24)ను కారు డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా సాయంతో కారులోనే గొంతుకోసి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హత్యానంతరం రాయ్‌గఢ్ జిల్లాలోని అడవిలో షీనా బోరా మృత దేహాన్ని పూడ్చిపెట్టినట్టు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించడంతో 2015 సెప్టెంబర్‌లో కేసును సీబీఐకి బదలీ చేశారు. అదే ఏడాది నవంబర్‌లో కుట్రలో పాలుపంచున్నారనే ఆరోపణపై ఆమెను సీబీఐ అరెస్టు చేసింది.


కాగా, జైలులో ఉండగా ఇంద్రాణి పది సార్లకు పైగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అవి తిరస్కరణకు గురయ్యాయి. తన ప్రాణానికి జైలులో ముప్పుందనే ఆరోపణలు కూడా ఆమె చేశారు. అయితే, వీటిని సైతం విచారణ కోర్టు తోసిపుచ్చింది. బయట కంటే బైకుల్లా మహిళా జైలులోనే ఆమెకు మరింత రక్షణ ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో ఇంద్రాణి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గత బుధవారం విచారణ జరిపింది. ఇంద్రాణి చాలాకాలంగా జైలులో ఉన్నారని, విచారణ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదని ఆమె తరఫు న్యాయవాది చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. బెయిలు మంజూరు చేసింది.

Updated Date - 2022-05-21T01:29:00+05:30 IST