గాలివాన బీభత్సానికి నేలకూలిన షెడ్లు

ABN , First Publish Date - 2021-05-14T06:17:23+05:30 IST

గాలివాన బీభత్సానికి మామిడి, టమోటా షెడ్లు కుప్పకూలాయి. దీంతో యజమానులు సుమారు రూ.50లక్షలు ఆస్తినష్టం వాటిల్లింది

గాలివాన బీభత్సానికి నేలకూలిన షెడ్లు
కళ్యాణదుర్గంలో గాలివాన బీభత్సానికి కుప్పకూలిన మామిడి కొనుగోలు కేంద్రం


రూ.50లక్షల మేర ఆస్తి నష్టం


కళ్యాణదుర్గం, మే 13: గాలివాన బీభత్సానికి మామిడి, టమోటా షెడ్లు కుప్పకూలాయి. దీంతో యజమానులు సుమారు రూ.50లక్షలు ఆస్తినష్టం వాటిల్లింది. బుధవారం రాత్రి ఓ మోస్తారు వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన గాలి బీభత్సం చేసింది. పట్టణ సమీపంలోని ధర్మపురం, హిందూపురం రింగ్‌రోడ్లలో ఉన్న మామిడి, టమోటా మండిల రేఖలషెడ్లు ఒక్కసారిగా కూలి పోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి గ్యాస్‌గోదాము వద్ద ఇటీవల మామిడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ షెడ్‌ 11 కేవీ విద్యుత్‌ లైన్‌పై పడడంతో స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆ వ్యాపారికి సుమారు రూ.30లక్షలు ఆస్తినష్టం వాటిల్లిన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కృష్ణ, కేఆర్‌ రవిలకు చెందిన రెండు టమోటా మండిలో ఏర్పాటు చేసిన షెడ్లు కూలడంతో సుమారు రూ.20లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. అలాగే మల్లికార్జునకు చెందిన హెచ్‌ఆర్‌ మండి రేకుల షెడ్‌ కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు బాధితుడు తెలిపారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వృక్షాలు, టమోటా నర్సరీలు గాలికి కొట్టుకుపోయాయి. ఈ కారణంగా విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు మరమ్మతులు చేసేపనిలో సిబ్బంది నిమగ్నమైంది. 

 

Updated Date - 2021-05-14T06:17:23+05:30 IST