షెడ్డు నిర్మించరూ?

ABN , First Publish Date - 2020-11-24T05:44:09+05:30 IST

షెడ్డు నిర్మించరూ?

షెడ్డు నిర్మించరూ?
రోడ్డుపై చేపలు విక్రయిస్తున్న మహిళ

  • రోడ్లపక్కనే చేపల విక్రయం
  • నిల్వ చేసుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు
  • చేపలు చనిపోయి పెట్టుబడి కోల్పోతున్న వ్యాపారులు
  • షెడ్డు నిర్మించాలని విక్రయదారుల వేడుకోలు

ఆమనగల్లు : రాష్ట్ర రాజధానికి చేరువలో ఉండి నాలుగు మండలాలకు కూడలిగా ఉన్న ఆమనగల్లు పట్టణంలో చేపల విక్రయానికి నిర్దిష్ట స్థలం లేదు. దీంతో ఇటు విక్రయదారులు, అటు కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేపల విక్రయాలకు ప్రత్యేక స్థలం కేటాయించి షెడ్లు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు, విక్రయదారులు ఏళ్ల కాలంగా ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమనగల్లులో అనేక మత్స్యకారుల, ముదిరాజ్‌ కుటుంబాలు చేపల విక్రయాల ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నాయి. కాగా మార్కెట్‌ షెడ్‌ లేక మాడ్గుల రోడ్డులో పోలీస్‌స్టేషన్‌ వెనక భాగంలో చేపల విక్రయాలు సాగిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, డిండి, హైదరాబాద్‌ వంటి మార్కెట్ల నుంచి విక్రయదారులు చేపలను కొనుగోలు చేసి కూలి గిట్టుబాటు చూసుకొని విక్రయిస్తుంటారు. అయితే స్థానికంగా షెడ్లు, సరైన వసతులు లేక చేపలను నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతోందని, కొన్ని సందర్భాలలో గిరాకీలేక, నిల్వ చేసుకోవడానికి వీలుకాక చేపలు చనిపోతున్నాయి. దీంతో పెట్టుబడి కోల్పోయి నష్టపోవాల్సి వస్తోందని విక్రేత మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం అందడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేపలు వదిలి మత్స్యకారులకు చేయూతనందిస్తున్నా, విక్రయాలకు వసతులు కల్పించకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు విక్రయదారులు వాపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి చేపలు తెచ్చి విక్రయించినా ఏ మాత్రం గిట్టుబాటు కావడంలేదని పేర్కొంటున్నారు. స్థలం కేటాయించి పట్టణంలో చేపల విక్రయ షెడ్డును నిర్మించాలని మున్సిపల్‌, ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుతున్నారు.

Updated Date - 2020-11-24T05:44:09+05:30 IST