షీ టాయిలెట్లు వేగవంతం

ABN , First Publish Date - 2020-11-25T05:17:48+05:30 IST

షీ టాయిలెట్లు వేగవంతం

షీ టాయిలెట్లు వేగవంతం
మేడ్చల్‌ గ్రంథాలయం సమీపంలో నిర్మిస్తున్న షీటాయిలెట్లు

  • మేడ్చల్‌ పట్టణంలోని కూడళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టిసారించిన బల్దియా 



మేడ్చల్‌: మేడ్చల్‌ మున్సిపల్‌ యంత్రాంగం ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రయోగాత్మకంగా ముందుకెళ్తున్నది. మేడ్చల్‌ మున్సిపల్‌ ప్రజలకే కాకుండా వివిధ అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. మహిళల అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా షీ టాయిలెట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపాలిటీల్లో ప్రతీ వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించాలని, మహిళల కోసం షీ టాయిలెట్లను నిర్మించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు మేడ్చల్‌ మున్సిపాలిటీలో అధికారులు వివిధ కూడళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటి వరకు 6 టాయిలెట్లను ప్రారంభించగా మరో రెండు మరుగుదొడ్ల నిర్మాణ పనులు త్వరలోనే పూర్తికానున్నాయని మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు. స్వచ్ఛతలో మేడ్చల్‌ మున్సిపల్‌కు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు మేడ్చల్‌ మున్సిపాలిటీని మరింత స్వచ్ఛతగా తీర్చిదిద్దేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్‌లో మరికొన్ని చోట్ల ప్రైవేటు భాగస్వామ్యంతో మరిన్ని మరుగుదొడ్లు నిర్మించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలో వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వలస వచ్చిన వారు స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు. మరోవైపు ప్రతిరోజు నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దినదినాభివృద్ధి చెందుతున్న మేడ్చల్‌లో ఇటు పచ్చదనంలో అటు స్వచ్ఛతలో ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు, పాలకులు ముందుకుసాగుతున్నారు.


మహిళల ఆరోగ్య పరిరక్షణకే.. : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికనర్సింహారెడ్డి

మేడ్చల్‌ పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచే వచ్చే వారి కోసం కూడళ్లలో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు టాయిలెట్ల కోసం ఇబ్బందులు పడవద్దని, వారి ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని షీ టాయిలెట్లను నిర్మిస్తున్నాం. స్వచ్ఛతలో మేడ్చల్‌ను అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు చేపడుతున్నాం. 

Updated Date - 2020-11-25T05:17:48+05:30 IST