అవును.. ఆమె మళ్లీ పుట్టింది..!

ABN , First Publish Date - 2022-01-25T08:01:11+05:30 IST

ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం మరణించిన ఆమె మళ్లీ పుట్టింది. ఇప్పుడు నాలుగేళ్ల వయసులో నాటి సంగతులన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తోంది. గత జన్మలో తన పేరు ఉష అని, 2013లో ప్రమాదవశాత్తూ మంటల్లో కాలిపోయి మరణించానని చెబుతోంది. ...

అవును.. ఆమె మళ్లీ పుట్టింది..!

 తొమ్మిదేళ్ల క్రితం మరణించిన యువతి

 మళ్లీ పుట్టానంటున్న నాలుగేళ్ల బాలిక

 గత జన్మలోని విషయాలను వివరిస్తున్న వైనం


రాజ్‌సమంద్‌ (రాజస్థాన్‌), జనవరి 24: ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం మరణించిన ఆమె మళ్లీ పుట్టింది. ఇప్పుడు నాలుగేళ్ల వయసులో నాటి సంగతులన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తోంది. గత జన్మలో తన పేరు ఉష అని, 2013లో ప్రమాదవశాత్తూ మంటల్లో కాలిపోయి మరణించానని చెబుతోంది. తన ఊరు, తల్లిదండ్రులు, సోదరుడు, పిల్లల గురించి పేర్లతో సహా ఏకరవు పెడుతోంది. నిజానిజాలను విచారిస్తే.. ఆ బాలిక చెప్పిన ఘటనలన్నీ తేదీలతో సహా జరిగినట్లు తేలింది. ఆశ్చర్యపరిచే ఈ ఘటన.. రాజస్థాన్‌లో జరిగింది. విచిత్రమేంటంటే.. ఆ బాలిక గత జన్మలో నివసించానని చెబుతున్న గ్రామం.. ప్రస్తుతం ఆమె ఉంటున్న ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పారావాల్‌ అనే గ్రామంలోని రతన్‌సింగ్‌ చుందావత్‌ ఐదుగురు కుమార్తెల్లో ఒకరు.. నాలుగేళ్ల కింజల్‌. ఏడాది క్రితం నుంచే ఆ బాలిక.. తన సోదరుడి గురించి రతన్‌సింగ్‌ను అడిగేది. తొలుత ఈ మాటలను రతన్‌సింగ్‌ పెద్దగా పట్టించుకునే వాడు కాదు. కానీ, ఓ రోజు ఆ బాలిక తన గత జన్మలోని తల్లిదండ్రులు, సోదరుడు, పిల్లల గురించి వారి పేర్లతో సహా చెప్పింది. ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు.. వెంటనే డాక్టరుకి చూపించారు. పరీక్షల్లో.. మానసికంగా ఏ సమస్యలూ లేవని తేలింది. దీంతో.. ఆ బాలికను వెంటబెట్టుకుని ఆమె చెబుతున్న పిప్లాంత్రి గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆమె.. తన గత జన్మ తల్లిదండ్రులను గుర్తించింది. అలాగే, తన ఇద్దరు పిల్లల గురించి పేర్లతో సహా వాకబు చేసింది. ఆ ఇంటితో తన అనుబంధాన్ని వివరించింది. తను గ్యాస్‌ సిలిండర్‌ పేలి చనిపోయానని ఆ రోజు ఘటనను పూసగుచ్చినట్లు వివరించింది. దీంతో.. ఇరు కుటుంబాలూ ఆమె మాటలను పూర్తిగా నమ్మాయి. ఇక అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్యా బంధుత్వానికి అతీతమైన బంధం ఏర్పడింది. బాలిక ప్రస్తుతం ఈ జన్మ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నప్పటికీ.. గత జన్మ తల్లిదండ్రులూ, పిల్లలతో రోజూ ఫోన్‌లో మాట్లాడుతోంది. ఇలా.. ప్రస్తుతం ఆ నాలుగేళ్ల పాప.. తన కన్నా వయసులో కనీసం పదేళ్లు పెద్దవాళ్లయిన తన పిల్లల యోగక్షేమాలను విచారిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2022-01-25T08:01:11+05:30 IST