ఆమె... దివ్యాంగుల దర్జీ

ABN , First Publish Date - 2022-08-08T05:35:30+05:30 IST

దివ్యాంగుల అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ధరించే దుస్తులు కూడా వారికి తగ్గట్టుగా ఉండాలని స్వీయానుభవంతో గ్రహించింది కోల్‌కతాకు చెందిన సౌమిత. సోరియాటిక్‌..

ఆమె... దివ్యాంగుల దర్జీ

దివ్యాంగుల అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ధరించే దుస్తులు కూడా వారికి తగ్గట్టుగా ఉండాలని స్వీయానుభవంతో గ్రహించింది కోల్‌కతాకు చెందిన సౌమిత. సోరియాటిక్‌ అర్థ్రయిటి్‌సతో కదల్లేని స్థితికి చేరుకున్నప్పుడు, ఆమెకు స్ఫురించిన ఆ ఆలోచన ఇప్పుడు ఎంతోమంది దివ్యాంగులకు వరంగా మారింది. జ్యెనిక పేరుతో దివ్యాంగుల వస్త్రశ్రేణిని స్థాపించిన సౌమిత తన వస్త్ర ప్రయాణం గురించి ఇలా వివరిస్తోంది...


‘‘దివ్యాంగులు పరిమితంగానే కదలగలుగుతారు. కాబట్టి సాధారణ దుస్తులు ధరించడం వాళ్లకు ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో కొన్ని దుస్తులకే పరిమితమైపోతారు. కానీ వాళ్లు కూడా అందరిలా ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన, సులువుగా ఉండే దుస్తులను ఎందుకు ధరించకూడదు? అనిపించింది. గతంతో పోల్చుకుంటే, నేడు ప్లస్‌ సైజు దుస్తులు అన్ని చోట్లా దొరకుతున్నాయి. కానీ దివ్యాంగుల విషయంలో దుస్తుల లోటు సర్వత్రా నెలకొని ఉంటోంది. ఈ విషయాన్ని నేను స్వయంగా గ్రహించాను. 2014లో నాకు, సోరియాటిక్‌ ఆర్థ్రయిటిస్‌ అనే ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌ ఉన్నట్టు తేలింది. అప్పుడు నా వయసు 30. కొన్నేళ్లకు వ్యాధి మరింత ముదిరి నేను కదల్లేని స్థితికి చేరుకున్నాను. అలా రెండేళ్ల పాటు పూర్తిగా మంచానికే పరిమితమైపోయాను. తర్వాత కొంత కోలుకున్నప్పటికీ చేతి కర్రల సహాయంతో లేదా చక్రాల కుర్చీ ఆసరాతో మాత్రమే కదలగలిగేదాన్ని. ఆ సమయంలో దివ్యాంగుల ఇబ్బందులు, వాళ్లు పడే బాధల గురించిన ఆలోచన మొదలైంది. మరీ ముఖ్యంగా దుస్తుల పరంగా వాళ్లకుండే పరిమితుల పట్ల అవగాహన ఏర్పడింది. అలా అప్పుడే దివ్యాంకుల కోసం ప్రత్యేక దుస్తుల తయారీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను.


20 వేల పెట్టుబడితో...

దివ్యాంగుల్లో భిన్నమైన అవయవ లోపాలుంటాయి. వారి ఆకారాలూ, అవసరాలూ భిన్నంగా ఉంటాయి. కాబట్టి సమాజంలో శారీరక అవలక్షణాలు కలిగి ఉండే వేర్వేరు వ్యక్తుల గురించి పరిశోధన చేశాను. అలాగే ప్రత్యేక అవసరాలున్న అలాంటి వ్యక్తులకు మార్కెట్లో అందుబాటులో ఉన్న దుస్తుల గురించి కూడా తెలుసుకున్నాను. అదే సమయంలో వేర్వేరు దివ్యాంగులను కలిసి, వారి అవసరాల గురించి కూడా అవగాహన పెంచుకున్నాను. ఎక్కువ మంది దివ్యాంగులు, వాళ్లు ధరించే దుస్తుల పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. దాంతో ప్రత్యేకించి ఈ కోవకు చెందిన వాళ్ల కోసం దుస్తులను తయారుచేయాలనే ఆలోచన కలిగింది. అందుకోసం స్నేహితుల నుంచి 20 వేల రూపాయలు అరువు తీసుకున్నాను. జిఐఎఎన్‌ (గ్రాస్‌రూట్‌ ఇన్నొవేషన్స్‌ ఆగ్మెంటేషన్‌ నెట్‌వర్క్‌) అధిపతి అనిల్‌ గుప్తాకు ఉత్తరం రాశాను. ఆయన స్పందించి నా ఇనీషియేటివ్‌కు సహకారం అందించారు. అలా 2020, జనవరిలో ‘జ్యెనికా’ దుస్తుల బ్రాండ్‌ను స్థాపించి, దివ్యాంగుల దుస్తుల తయారీ మొదలుపెట్టాను. 


సవాళ్లు ఎదురైనా...

దుస్తుల తయారీపరంగా వాటిని కుట్టే టైలర్ల నుంచి మొదట్లో నాకు సవాళ్లు ఎదురయ్యాయి. సాధారణ దుస్తులు కుట్టడానికి అలవాటు పడిన దర్జీలకు, దివ్యాంగులకు అవసరాలకు తగ్గట్టుగా దుస్తులను కుట్టడం ఇబ్బందిగా మారింది. దాంతో కటింగ్‌, స్టిచింగ్‌ పరంగా స్వయంగా శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతం నా దగ్గర తొమ్మిది మంది టైలర్లు ఉన్నారు. వారిలో మహిళలూ, దివ్యాంగులు కూడా ఉన్నారు. దుస్తులు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడంతో పాటు, ఫ్యాషన్‌గా కూనిపించేలా చూసుకుంటాను. ఇందుకోసం నా దగ్గర ప్రత్యేక డిజైనర్లు కూడా అందుబాటులో ఉన్నారు.’’ 


అందరికీ నప్పేలా...

నా దగ్గర 600 మొదలుకుని 5 వేల ధర పలికే దుస్తులున్నాయి. స్త్రీపురుషుల దుస్తులతో పాటు పిల్లల దుస్తులు కూడా డిజైన్‌ చేస్తాను. వంగే పని లేకుండా ధరించగలిగే ప్యాంట్లు, డ్రస్‌లా ధరించగలిగే స్లిప్‌ ఆన్‌ చీరలు, ఆర్మ్‌హోల్‌ దగ్గర ఓపెన్‌ అయ్యేలా ఉండే టాప్స్‌, అడాప్టివ్‌ ఇన్నర్‌ వేర్‌ ఇలా... క్యాజువల్‌, ప్రొఫెషనల్‌ రేంజ్‌ దుస్తులను డిజైన్‌ చేస్తున్నాను. ఇవన్నీ దివ్యాంగుల ఆదరణ పొందుతున్నాయి. వారి సంతృప్తే నాకు ప్రధానం. మున్ముందు ఒక వస్త్ర యూనిట్‌ను నెలకొల్పి, మరెన్నో భిన్నమైన దివ్యాంగ దుస్తులను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. 

Updated Date - 2022-08-08T05:35:30+05:30 IST